అన్నమయ్య కీర్తన.
అట్ట నెరవాదివి నీవలమేలుమంగవు
నెట్టన నీ రమణుడు నిన్ను మెచ్చీ నిందుకు. ॥
ఇయ్యకొంటె మాఁటలెల్లా నింపులై యుండు
నెయ్యముగలిగినట్టి నెలఁతలకు
నొయ్యనే విచారించితే నుపమ పుట్టు
యెయ్యెడా నలుకలేని ఇంతులకు. ॥
వున్నది నేమిసేసినా నొడఁబాటౌను
సన్నయెరిఁగినయట్టి సతులకును
విన్నకన్న సేఁతలెల్లా వేదుకై తోఁచు
నన్నిటా నోరుపుగల యతివలకు. ॥
కందువఁ దెలిసితేఁ గరఁగు మతి
అంది వివేకముగల యాఁడువారికి
యిందరిలో శ్రీ వేంకటేశ్వరుఁడు గూడె
పొంది లిట్టివి నీవంటి పొలఁతులకును. ॥
ఈ కీర్తనలో చెలికత్తెగా మారిన అన్నమయ్య అలమేలుమంగతో ఇలా అంటున్నాడు.
ఓ అలమేలుమంగా! నీవు సమర్ధురాలైన పడతివి. అందుకే నీ రమణుడు నిన్ను నీ యెదుటనే మెచ్చుకుంటున్నాడు.
అయినా ప్రపంచములో జరిగేది ఇదే కదా! ఇంతికి స్నేహంగా ఉండే మగని మాటలెల్లా ఇంపుగానే ఉంటాయి. అలుకే లేని స్త్రీలకు సరిగ్గా ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలు గోచరిస్తాయి.
మగని సంజ్ఞ తెలిసిన స్త్రీకి అంగీకారమైతే ఏమిచేసినా ఇష్టంగానే ఉంటుంది. అన్నింటిలోనూ ఓర్పు గల స్త్రీకి ఏమి కనినా, ఏమి వినినా తన మగని చేతలన్ని వేడుకగానే ఉంటాయి.
వివేకమున్న స్త్రీకి నేర్పు ఉంటే మగని మనస్సు కరిగించగలదు. అందుకేనేమో ఇందరిలో నిన్నుమాత్రమే అనురాగముతో కలిసినాడు. నీ వంటి స్త్రీలకు శ్రీ వేంకటేశుని పొందులు ఇటువంటివే..
No comments:
Post a Comment