Monday, 25 January 2016

నరహరి నీ దయ మీదట నా చేతలు గోన్నా? అన్నమయ్య కీర్తన.



.ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప.       నరహరి నీ దయ మీదట నా చేతలు గోన్నా?
          శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా?                   !!
౧.       మొరయుచు నరకపు వాకిలి మూసిరి హరి నీ దాసులు       
          తెరచిరి వైకుంఠపురము తెరువులు వాకిళ్ళు,
          మరిపిరి పాపములన్నియు నుగ్గుగా నిటు తూర్పెత్తిరి
          వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా?                 !!
౨.       పాపిరి నా యజ్ఞానము పరమాత్ముడ నీ దాసులు
          చూపిరి నిను నామతిలో సులభముగా నాకు,
          రేపిరి నీపై భక్తిని రేయిని బగలును నాలో
          వోపము వోపము తపములు ఊరకే ఇకనేలా?                  !!
౩.       దిద్దిరి నీ ధర్మమునకు దేవా! శ్రీ వేంకటేశ్వర !
          అద్దిరి నీ దాసులు నీ ఆనందములోన
          ఇద్దరి నీ నా పొందులు ఏర్పరి చిటువలె గూర్చిరి
          వొద్దిక నొద్దిక నాకిక నుద్యోగాములేలా ?                         !!

భావము:  నరహరీ! నీ దయ నాపై గల్గిన పిమ్మట  నాకై నేను చేసికొనవలసిన పనులు కొన్ని మిగిలియున్నవా? నిన్ను శరణు జొచ్చిన జీవునికి మరల స్వతంత్రత ఎక్కడిది?
          శ్రీహరీ! నీ దాసులు ఆనందముతో నరకపు వాకిలి మూసిరి. వైకుంఠపుర వాకిళ్ళు తెరిచిరి. మా పాపములన్నిటిని నుగ్గుగా చేసి తూర్పారబెట్టిరి. ఇక మేము భయపడవలసిన నిమిత్తము లేనేలేదు. మాకిక కర్మకాండకు సంబంధించిన విధులతో పని ఏమి ?
          పరమాత్మా! నీ దాసులు నా అజ్ఞానమును తొలగించి, నిన్ను నా మనస్సునందే నిన్ను నాకు సులభముగా జూపిరి. రేయి పవళ్ళు నీప భక్తిని కలిగించిరి. మేమిక తపములు చేయజాలము. నిష్ప్రయోజమైన తపస్సులతో నిక మాకేమి పని?
          దేవా! శ్రీ వెంకటేశ్వరా! నీ దాసులు నన్ను నీ శరణాగతునిగా నొనర్చి ధర్మమును నేర్పిరి.  నీ నామస్మరణచే కలుగు ఆనందములో ముంచిరి. నీకు, నాకు ఒద్దికగా పొందు నేర్పరిచిరి. ఇంకనాకు వేరే ప్రయత్నములేలా?
          హరిని  జేరుటకు హరిదాసులైన ఆచార్యులే మార్గదర్శకులు. వారు ఆశ్రితుల పాపములను తొలగింతురు. అజ్ఞానమును హతమార్చి భగవంతునియందు భక్తిని కలిగింతురు. ముక్తికి త్రోవ జూపుదురు. జీవునికి దేవునితోబంధము కలిగించెదరు. కాన ఈ కీర్తనలో జీవులకు ముక్తి గూర్చుటయందు హరిదాసుల సహాయముండవలెనని అన్నమయ్య చక్కగా వివరించాడు.  

No comments:

Post a Comment