2.1.15.ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. సమబుద్దే యిందరికి – సర్వవేద సారము.
సముడిందరికి హరి – సాధనమో యయ్యా !!
సముడిందరికి హరి – సాధనమో యయ్యా !!
౧. చీమకు దన జన్మము – చేరి సుఖమై తోచు
దోమకు దన జన్మము – దొడ్డసుఖము.
ఆమని ఈగకు సుఖ – మా జన్మమై తోచు
ఏమిటా నెక్కువ సుఖ – మెవ్వరి కేదయ్యా! !!
దోమకు దన జన్మము – దొడ్డసుఖము.
ఆమని ఈగకు సుఖ – మా జన్మమై తోచు
ఏమిటా నెక్కువ సుఖ – మెవ్వరి కేదయ్యా! !!
౨. జంతురాసులకు నెల్లా – జననము లొక్కటే
అంతటాను మరణము – లవి యొక్కటే ,
చెంత నాహార నిద్రలు – స్త్రీ సుఖా లొక్కటే
ఇంతతా నిందుకంటే – నెవ్వరేమి గట్టిరయ్యా! !!
అంతటాను మరణము – లవి యొక్కటే ,
చెంత నాహార నిద్రలు – స్త్రీ సుఖా లొక్కటే
ఇంతతా నిందుకంటే – నెవ్వరేమి గట్టిరయ్యా! !!
౩. ఇందులోన నెవ్వరైనా – నేమి శ్రీ వేంకటపతి
నందముగా దలిచిన – దది సుఖము.
ఎందు జూచినా నిత – డిందరిలో నంతరాత్మ
చందముగా నెవ్వరికి – స్వతంత్ర మేడయ్యా.. !!
నందముగా దలిచిన – దది సుఖము.
ఎందు జూచినా నిత – డిందరిలో నంతరాత్మ
చందముగా నెవ్వరికి – స్వతంత్ర మేడయ్యా.. !!
భావము: సర్వ ప్రాణుల యెడ సమబుద్ధి కలిగి యుండుటయే సర్వవేదసారము. అందరిలో సముడైయున్నవా డొక్క శ్రీహరియే అందరికి ముక్తి సాధనమై యున్నాడు.
స్థూలదృష్టికి చీమ, దోమ మున్నగునవి అల్పప్రాణులుగా కనబడవచ్చును. కానీ చీమ తన జన్మమునే సుఖముగా భావించును. దోమకు తన పుట్టుకయే సుఖకరము. ఈగకు దాని జన్మమే సంపూర్ణ సుఖమైనదిగా అనిపించును. ఇందులో ఎవ్వరికి దేనివలన ఎక్కువ సుఖమున్నది? ఈ సుఖములో తారతమ్యమును నిర్ణయించుట కెట్టి అవకాశము లేదు కదయ్యా!
పుడమిలో జంతురాసు లన్నిటికీ జనన మరణములు ఒక్క తీరుననే యున్నవి. అట్లే ఆహారము, నిద్ర, కామసుఖము కూడా అన్నింటికీ సమానములే. ఇంతకంటే ఈ లోకమున ఎవ్వరేమి మూట గట్టిరయ్యా!
ఈ సృష్టిలో ఎవ్వరైనను సరే ! శ్రీ వేంకటేశ్వరుని చక్కగా స్మరించినచో వారి కదే నిజమైన సుఖము. ఎక్కడ చూచినను ఆ శ్రీహరే అందరికీ అంతరాత్మగా ఉండి సర్వము నడిపించుచున్నాడు. ఇంక ఎవ్వరికి మాత్రము ఏమి స్వతంత్రము కలదయ్యా!
జీవులు వారి వారి కర్మల కనుగుణముగా ఎన్నో జన్మలు దాల్చుచున్నారు. అన్ని ప్రాణులలోనూ అంతరాత్మగా నున్నవాడు పరమాత్ముడొక్కడే. కావున జ్ఞానులు సర్వత్ర సమభావమునే కలిగియుందురు. అజ్ఞులు మాత్రమె జీవులలో ఎక్కువ తక్కువలను పరిగణింతురు. సమస్త వేదములు ఎల్లెడల సమబుద్ధినే బోధించుచున్నవి. ఇట్టి సమబుద్ధిని కలిగి యుండవలెనని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోదించినాడు.
No comments:
Post a Comment