Wednesday, 13 April 2016

ముందే తొలగవలె – మోసపోక సంగ మెల్ల -- అన్నమయ్య కీర్తన.

ప. ముందే తొలగవలె – మోసపోక సంగ మెల్ల
కందువబోయిన నీళ్ళు – కట్టగట్ట వచ్చునా ?
౧. అనలము బోడగంటే – నండనున్న మిడుతలు
పనిలేకున్నా నందు – బడకుండీనా ?
పొనిగి చెలులగంటే – పురుషుల చూపు లెల్లా
ననిశము నందు మీద – నంటబారకుండునా ?
౨. గాలపుటెర్రల గంటే – కమ్మి నీటిలో మీలు
జాల నా పసలజిక్కి – చావకుండీనా ?
ఆలరి బంగారుగంటే – నందరి మనసులూను
పోలిమి నాపస జిక్కి – పుంగుడు గాకుండు నా ?
౩. చేరిముత్యపు జిప్పల చినుకులు నినిచితే
మేర తేట ముత్యములై – మించ కుండీనా ?
ధారుణి శ్రీ వేంకటేశు – దాసుల సంగతి నుంటే
పోరచి నేజీవులైన – బుణ్యులు గాకుందురా ?
భావము: ముముక్షువులైన వారు మోసమునకు గురికాక జాగరూకలై ముందే విషయసుఖముల తోడి సంగమును తోలగవలెను. నీళ్ళు పోయిన తరువాత కట్టగట్టి లాభమేమి?
నిప్పును గన్నచో చెంతనున్న మిడుతలు పనిలేకున్నాను అందున పడుకుండ ఉండలేవు. అట్లే కాంతల గన్న పురుషుల చూపు లెల్ల వేళల వారిపై ప్రసరంపకుండ ఉండలేవు.
గాలములకు తగిల్చిన ఎర్రాలను గాంచినచో నీటిలోన చేపలు వాటిపై మూగి ఆ రుచికి జిక్కి వేదనతో చావకుండా పోవు. అట్లే వలపించి చిక్కులబెట్టు పాడు బంగారును గన్నచో ఎల్లవారి చిత్తములును దాని మిసమిసలకు వాసమై దిగజారి పోకుండా నుండజాలవు.
ముత్యపుచిప్పలలో చినుకులు నిమ్పినచో అవి తేటముత్తెములై ప్రకాశింపక మానవు. అట్లే శ్రీ వేంకటేశ్వరుని దాసులతోడి సాగత్యము గలిగియున్నచో ఎట్టివారైనను ఘనతతో పుణ్యాత్ములు కాకపోరు.
కాన విజ్ఞులైనవారు ముందే మెలుకువ గల్గి భోగావస్తువులతోడి సంగమును తొలగించుకోనవలెనని ఈ సంకీర్తనలో అన్నమయ్య బోధించాడు.

వివాహ వేదిక - ఎవరి హక్కు?

Krishna Prasad Aluri పెళ్ళి లో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అంటే, ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలి అనుకుంటే వాడే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఈయన కన్యాదానం చేస్తున్నాడు.కాబట్టి ఆ వేదిక ఆయనది.కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనది. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది.
ఆయన దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మీరు, మగపిల్లాడు,అతని
తల్లిదండ్రులు.నీకు ఎంత కొడుకే పుట్టినా,వాడు ఎంత వంశోద్ధారకుడే అయినా,వంశాన్ని ఉద్ధరించి నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు.ఇప్పుడు వాడు వంశోద్ధారకుడు,అంటే వంశాన్ని ఉద్ధరించిన వాడు అయ్యాడా?ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న నీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఆ ఔదార్యాన్ని చూసి ముక్కున వేలు వేస్కోవద్దు?
కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన నీకు అధికారం ఎక్కడిది దానం ఇచ్చే వాడి మీద పడి అరవాడనికి,విసుక్కోవడానికి?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం లేదు.ఏ అశ్వమేధ యాగం లాంటి మహా యాగాలలోనో తప్ప.ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే.నీకు నీ ఇంటి లక్ష్మిని 20 యేళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచుకుని ఇస్తున్నారు.ఇంకేం కావాలి నీకు?
సీతారాములలా ఉండండి సీతారాములలా ఉండండి అని ఆసీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది.జనక మహారాజు గారు దశరథ మహారాజు గారిని అడుగుతారు మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని.దశరథ మహారాజు గారు అన్నారు "అయ్యా! ఇచ్చే వాడు ఉంటే కదూ పుచ్చుకునే వాడు ఉండేది."
అది.తన కొడుకు రామచంద్రమూర్తి ఎంతటి పరాక్రమవంతుడో,ఎంతటి గుణవంతుడో తెలిసినా కూడా తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు దాతతో మాట్లాడేటప్పుడు.ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు అంతటి వాడు.
నిశ్చితార్థం లో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరువురు పెళ్ళివారూ కూర్చుని సీతారామ కళ్యాణ సర్గ చదివాలి.ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!
అసలు ఒక ఇంటి మర్యాద ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని ఆయనకు తెలియదా?నువ్వు చెప్పక్కర్లేదు పెళ్ళి మాత్రం బాగా గ్రాండ్ గా జరిపించాలి అండి అని.ఆ దాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవాడిగా నీకు అధికారం ఉండదు దాతతో ఎలా ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి. కట్నాలు,ఎదురు కట్నాలు,పెళ్ళి వాళ్ళ అరుపులు,కేకలు,అత్తవారి చివాట్లు,ఆడపడుచుల దబాయింపులు, ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.

బోధకులకు అబ్రహం లింకన్ ఉద్బోధ


Friday, 26 February 2016

ఇంతకంటే సుద్దులు నే మెరఁగము - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన:

ప.    ఇంతకంటే సుద్దులు నే మెరఁగము
       వింత లెల్లా నీకు విన్నవించంగ వచ్చితిమీ                ||

చ.    మనసెల్లా నీమీఁద మంతనాలు చెలులతో
       తనువు పానుపుమీఁదఁ దరుణికిని
       కనుగొంటే దయ పుట్టు కదా నున్నవారికైనా
       వినవయ్య నీకు విన్నవించంగ వచ్చితిమి.                ||
2.    గురిగాఁ జేయు చెక్కుపై కొనచూపు నీ రాకకై
       జరయు నిట్టూర్పులు చన్నులమీఁద
       కరకురా యైనాను కరఁగుఁబో నీకు వలె
       వెరగంది ఇదే విన్నవించంగ వచ్చితిమి.                             ||
3.    అలయిక తనలోన అసలు నీ కౌఁగిటిపై
      సెలవుల లేనగవు శ్రీవేంకటేశ
      కలిసితి వింక మేడకంబమైనా నిగిరించు
      వెలసే వేడుక విన్నవించంగ వచ్చితిమి.                    ||

భావమాధుర్యం:

         దేవి చెలికత్తెలు శ్రీనివాసునికి విన్నవించుకొంటున్నారు.  అన్నమయ్య వారిలో ముఖ్యమైన చెలికత్తెగా భావించుకుని ఈ కీర్తనలో ఇలా విశదీకరిస్తున్నాడు.  

         స్వామీ! ఇంతకంటె ఆమె ‘కతలు’ వివరించలేమయ్యా! అన్నీ వినడానికి వింత వింతగా ఉంటాయి. ఆమె విరహవేదన చూడలేక నీకు విన్నవించుకుందామని వచ్చాము. ప్రభూ! తానొకపక్క చెలులతో మంతనాలు చేస్తున్నా ఆమె మనసంతా నీమీదే ఉన్నదయ్యా! ఆమె శరీరమే పాన్పుమీద ఉన్నది. ఆ తరుణిని కనులారా చూస్తే పరాయివారికైన దయ పుడుతుంది. నీవు స్వతహాగా కరుణానిధివని నీకు విన్నవించ వచ్చాము.

          దేవా! ఆమెను గమనించు. తన చేయి చెక్కిలిపై జేర్చి క్రీగంట నీ రాకకై ఎదురు చూస్తూనే ఉంది. ఆమె నిరాశతో నిట్టూరుస్తుంటే ఆ వేడికి చనుగవ వేడెక్కుతున్నాయి. ఆమెను చూస్తే నీ వంటి రాతిహృదయం కలవారి గుండె అయినా కరిగి తీరాలి. మేము కూడా భయపడి నీ వద్దకు వచ్చాము.

         స్వామీ! తనలో శ్రమచేత  ఆమె అలిసిపోయింది. అయినా నీ కౌగిలిలో స్వాంతనకై  నిరీక్షిస్తున్నది. ఆమె పెదవులపై చిరునవ్వు మాయలేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! ఒంటి స్తంబపు మెడలోని రాణివలెనున్న ఆమెను నీవు కూడితే పొందే వేడుక వివరించ వచ్చామయ్యా..          

Tuesday, 16 February 2016

ఇంట గెలిచి కా నీవు యిక రచ్చ గెలిచేది. వెంటనే ఆనతీరాదా వినవలె నేను. - అన్నమయ్య కీర్తన




ఈ వారం అన్నమయ్య కీర్తన. 13.2.16

ప.       ఇంట గెలిచి కా నీవు యిక రచ్చ గెలిచేది.
          వెంటనే ఆనతీరాదా వినవలె నేను.
౧.       మాయలెంత సేసినాను మచ్చికెంత పూసినాను
          ఆయెడ నావలె నిన్నునాపె నమ్మీనా
          కాయవు నీ ఘాతలివి కందువ మచ్చములివి
          యేఇంతి సేసినవంటే యేమనేవు నీవు?               ||

౨.       కల్లలెన్ని ఆడినాను కదిసెంత గూడినాను
          యిల్లదే నావలె నాపె యియ్యకొనీనా 
          తెల్లని కన్నులతేట దిష్టమైన యా చెమట
          చెల్లబెట్టుకొని యాపె చింతవాప గలదా?                ||

౩.       నెమ్మినెంత  పొగడినా నీకు నీకే పొగడినా
          రమ్మని  నావలెనాపె రతి గూడీనా
          యెమ్మెల శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
          సమ్మతించనాడనెట్టు సరసమాడేవు.                             ||

భావం.   అన్నమయ్య ఈ కీర్తనలో యింతులకు ‘ఈర్ష్య’ సహజమైనదని  నొక్కి వక్కాణిస్తున్నాడు. అందులోనూ తన మగనికి వాంఛ రేపగల మగువను భార్య సహించలేదు. నాయిక స్వామితో ఏమంటున్నదో చూడండి.
          స్వామీ! నీవు ఇంట గెలిచాక కదా! రచ్చ గెలిచేది? ఆమెతో తమరి పాట్లు వెంటనే ఆనతిస్తే విని నేనూ ఆనందిస్తాను. ఒకటి మాత్రం నిజం. నీవెన్ని మాయలు చేసినా ఎంత చనువు చూపినా నిన్ను ఆవిడగారు నమ్మటమనేది కల్ల. నీ వంటిమీద ఈ గాట్లు, మచ్చలు ఏ ఇంతి సేసినవి అని ఆమె అంటే తమరి సమాధానమేమిటో? నీవు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పినా, దగ్గరయై యెంత సముదాయించినా నావలె ఆమె నిన్ను ఇట్లాంటి విషయాలలో నమ్ముతుందా? అది ఎన్నటికీ జరిగే పని కాదు. తేటగా మెరుస్తున్న నీ కళ్ళు, కంటికి కనిపిస్తున్న ఈ చెమటలు  పోనీలే అని ఆమె సరిపెట్టుకోదు. అది ఆమెని తప్పక బాధిస్తుంది. స్వామీ! నీ నామమెంత పొగిడినా నిన్ను రమ్మని నావలె రతికి ఆహ్వానించదు. శ్రీ వేంకటేశా ! నాకు సుఖమిచ్చినట్లు దానికియ్య లేవు. ఇది నిజం.

Thursday, 28 January 2016

బాలభాస్కరదేవు బంగారు కిరణాలు - త్యాగయ్య పై కరుణశ్రీ పద్యం


త్యాగరాజు ఆరాధనోత్సవాల సందర్భంగా కరుణశ్రీ పద్యం :

బాలభాస్కరదేవు బంగారు కిరణాలు
            కమలాకరాలలో కదలు లీల
శారద పూర్ణిమ చంద్ర చాంద్రీద్యుతుల్
            నెలరా కపోలాల నిమురు లీల
మధుర మోహన మంద మలయ మారుతములు
            వల్లి పదాగ్రాల వ్రాలు లీల
జలధరస్వామి శీతల వర్షధారలు
            సస్యకాంతల ముద్దుసలుపు లీల
తీయతీయని శ్రుతులు త్యాగయ్య కృతులు
శ్రోతృహృదయాల నానంద సుధలు చిందె;
ప్రాజ్యమైన సంగీతసామ్రాజ్యమునకు

రాగమయ రాజరాజు : మా త్యాగరాజు  ::

Monday, 25 January 2016

శ్రీపతి ఈతడుండగా జిక్కినవారి నమ్ముట ...అన్నమయ్య కీర్తన.




 ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప.       శ్రీపతి ఈతడుండగా జిక్కినవారి నమ్ముట
          తీపని మీసాలమీది తేనే నాకుత సుండి.      !!

౧.       తలచినంతటి లోనె దైవమెదుట గలడు
          కొలువలేరని యట్టి కొరతే కాని
          ఇల నరులగొలుచు టెందో కోకలు వేసి
          బలుకొక్కెరలవెంట బారాడుట సుండి          !!

౨.       శరణన్న మాత్రమున సకలవరము లిచ్చు
          నిరతి మరచినట్టి నేరమే కాని
          పొరి నితరోపాయాన బొరలుట గాజుపూస
          గరిమ మాణికమంటా గట్టుకొంట సుండి.      !!

౩.       చేత మొక్కితే చాలు శ్రీ వేంకటేశుడు గాచు
          కాతరాన సేవించని కడమే కాని
          ఈతల నిది మాని మరిన్ని పుణ్యాలు సేసినా
          రీతి నడవి గాసిన రిత్త వెన్నెల సుండి.        !!

భావం:   శ్రీపతి నమ్మిన వారిని కాపాడుటకు సిద్ధముగా  నున్నాడు.  ఇతడుండగా  తక్కినవారెవరో తమను రక్షింతురని నమ్ముట, వలసినంత తేనె చెంతనుండగా దానిని ఆస్వాదింపక మీసాలపై తేనే తీపని నాకుటవంటిది సుమా!

          తలచినంతమాత్రమున ఆదుకొనుటకు ఆ దైవము ఎదుటనే ఉన్నాడు. కాని ఆయనని కోలువనేరని లోపము మనలోనే కలదు. నారాయణుని కొలువక నరులను గొలుచు టెట్లున్నదనగా – తెల్లని వస్త్రముల నెచ్చటనో వేసి అల్లంతదూరమున నున్న కొంగలను జూచి గుడ్డ లని భ్రమించి వాటివెంట పరుగిడినట్లున్నది. 

          శరణన్న మాత్రమున సకలవరములు ఇచ్చుటకు శ్రీహరి సిద్ధముగా నున్నాడు. ఆతని భక్తవాత్సల్యమును మరచిన నేరము మనయందే యున్నది. ఆ దేవుని శరణనక ఇతరములైన ఉపాయములతో కోరికలను తీర్చుకోవాలనుకోవడము గొప్ప మాణిక్యమని భ్రమించి మిలమిల మెరిసే గాజుపూసను ధరించినట్లే సుమా!

          చేయెత్తి మొక్కిన చాలును, శ్రీ వేంకటేశ్వరుడు అన్నివిధముల భక్తులను కాపాడును. చంచల చిత్తముతో ఆయన పట్ల నిర్లక్ష్యము వహించి, అతనిని సేవించని లోపము మనలోనే కలదు. శ్రీ వేంకటేశ్వరుని నమ్మి మ్రోక్కక ఇతరములైన పుణ్యము లెన్ని చేసినను అడవిగాచిన వెన్నెలవలె నిష్ప్రయోజనమే సుమా!