Monday, 2 December 2019

Dwarka of Lord Krishna Mystery in Telugu |Sri krishna Dwaraka found in d...

అంతా రామమయం.

*అంతా రామమయం; మన బతుకంతా రామమయం.*
💥💥💥💥💥💥💥💥💥💥
*ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు .*
*ధర్మం పోత పోస్తే రాముడు . ఆదర్శాలు రూపుకడితే రాముడు . అందం పోగుపోస్తే రాముడు . ఆనందం నడిస్తే రాముడు . వేదోపనిషత్తులకు అర్థం రాముడు . మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు . లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు .*
*ఎప్పటి త్రేతా యుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే .*
*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష . బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట – రమాలాలి – మేఘశ్యామా లాలి . మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష . మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా . వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ .*
*భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం . తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు . కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ . విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ . అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా ! వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా !*
*తిరుగులేని మాటకు – రామబాణం . సకల సుఖశాంతులకు – రామరాజ్యం . ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన . ఆజానుబాహుడి పోలికకు – రాముడు . అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు .*
*రాముడు ఎప్పుడు మంచి బాలుడే . చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా .*
*ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు . గొప్ప కొడుకు – రాముడు . అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు . గొప్ప విద్యార్ధి – రాముడు(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) . మంచి మిత్రుడు – రాముడు(గుహుడు చెప్పాడు ). మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు ). సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు ). నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ). కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు . నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు . చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు . చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు . జన్మ తరించడానికి – రాముడు , రాముడు , రాముడు .*
——————–
*రామాయణం పలుకుబళ్లు.*
———-///———-
*మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే .*
*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది . చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం . కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే – శూర్పణఖ . చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు .* *మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర . పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే – శబరి . ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు .అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ . విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే . పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే . యుద్ధమంటే – రామరావణ యుద్ధమే . ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే .)కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).*
*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . ఒంటిమిట్టది ఒక కథ . భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ . అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం .*

(వట్సాప్ నుండి సెకరణ)

Saturday, 23 November 2019

అల్లరి.

Meeraj Fathima
అల్లరి
అలసిపోయి ఇంటికొస్తానా..
అలిగి ఏ మూలో నక్కి ఉంటావ్.
.
అన్నం తినననే నీ మంకుపట్టూ,
అందరూ తిట్టారనే నీ కంప్లైంటూ..,
.
హడావిడిగా ఉండే నా పని వేళలూ..,
నా గది ముందు తచ్చాడే నీ అడుగులూ..,
.
స్నానం చేయననీ, మంచం దిగననీ.. నీ మొరాయింపూ,
వీది, వీధంతా నీమాట వినలేదనే నీ దబాయింపూ,
.
జేబులోని చిల్లరంతా నీదేననే గద్దింపూ ..,
వీధి చివరి దుకాణం వరకూ తీసుకెళ్ళమనే అర్దింపూ..,
.
నిన్నుతప్ప ఇంకెవరినీ దగ్గర తీయరాదనే మొండితనం,
నన్ను ఒక్కఅంగుళం కూడా కదలనివ్వని నీ పంతం.
.
నీ చుట్టూ ఇందరున్నా..ఎవ్వరూ లేరనుకొనే ఒంటరితనం,
సంతానాన్ని మాత్రమే గుర్తించే అమ్మతనం.
.
( వయస్సు మీదపడి మతిలేని ఎందరో తల్లులు చేసే అల్లరే ఇది,
మన అల్లరిని ముద్దుగా భరించిన వారి అల్లరిని బాధ్యతగా భరిద్దాం

అమ్మేదోకటియు అసీమలోనిదొకటి


ఈ వారం అన్నమయ్య కీర్తన.

అమ్మేదొకటియు అసీమలోనిదొకటి
ఇమ్ములమా గుణములు యెంచ చోటేదయ్యా!        !!

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము
ఇప్పుడు నీ కింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకుదాస్యము నేము సేసేము
చెప్పి నీ దాసుల సిగ్గుగాదా మాకు                     !!

పడతులకెప్పుడును పరతంత్రులము నేము
పడి నీ పరతంత్ర భావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతియించే అందుకును           !!

తనువు లంపటాలకు తగ మీదెత్తితి మిదె
వొనరి నీ ఊడిగాన కొదిగే దెట్టు
ననచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి
వెనకముందెంచక నీవె కావవయ్యా!                    !!

భావం..

మనం కానిది మనమని చూపెట్టుకునేందుకు మనం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి దైన్యం నుంచి మనం బయటపడాలంటె ఆ దేవదేవుడిని శరణు వేడుకోవాలి. మనలోని కపటత్వాన్ని కడిగివేయమని ఆ పరమాత్మని వేడుకోవాలి. అలాంటి భావనతోనే ఈ భగవతోత్తముడు ఈ కీర్తనను రచించాడు.

ఓ వేంకటేశ్వరా! మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా! మేము మూటలోనున్నవి ఒకరకమైతే, ముందు మరోరకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారస్తుల్లాంటివాళ్ళం . ఇది నీకు తెలియనిది కాదు.

మేమెప్పుడూ ఇంద్రియాలకు బానిసలము. ఇంద్రియాలకు యజమానులుగా ఉండవలసిన మేము, వాటికి బానిసలుగా మారిపోతున్నాము. అవి మన అధీనంలో ఉండవలసినది పోయి  మేమే వాటి అధీనంలోకి వెళ్ళిపోతున్నాము. ధనానికే దాస్యం చేస్తూ, నీ దాస్యాన్ని విస్మరిస్తున్నాము. నీ దాసులమని చెప్పుకుందుకి సిగ్గుపడుతున్నామయ్యా!

స్త్రీవ్యామోహంతో చిత్తచాంచల్యము కల మాకు నీగురించి ఆలోచన ఏది? జిహ్వచాపల్యంతో తపించే నాలుకకు నిన్ను నుతీంచే అవకాశమేది? ఈ చాపల్యం నీ నామస్మరణకు దూరం చేస్తూంది.

ఈ తనువు లంపటాల్లో చిక్కుకున్న మేము నీకు ఊడిగం చేస్తూ ఎప్పటికి తరించగలము? శ్రీవేంకటేశా!  నిన్నే శరణన్న మమ్మల్ని ముందువెనుకలు ఆలోచించక కాచుకోమని ఆర్ద్రతో అన్నమయ్య వేడుకొంటున్నాడు.

Wednesday, 20 November 2019

అన్నమయ్య అందరివాడు.

పదకవితామహుడైన అన్నమయ్యను మావాడంటారు సాహితీమూర్తులు.వాగ్గేయకారుడు కనుక మావాడంటుంది కర్ణాటక సంగీతలోకం.లలితమైన పదాలతో శృంగారాన్ని ఒలికించాడు కనుక మావాడంటారు సినీ,లలితసంగీత కళాకారులు.జనపదాలు పాడిన అన్నమయ్య మావాడంటారు జానపదులు.తత్వబోధ చేశాడు కనుక మావాడంటారు వేదాంతులు.రామానుజ సిద్ధాంత మతప్రచారకుడు కనుక మావాడంటారు శ్రీవైష్ణవులు.సర్వమానవ సమానత్వాన్ని చాటాడు కనుక మావాడంటారు సంఘసంస్కర్తలు.మధురభక్తిలో తనిసి,తరించినవాడు కనుక మావాడంటారు భక్తజనం...
అయితే,నాఉద్దేశ్యంలో అన్నమయ్య అందరివాడు.ఆయన రచనలలోని వైవిధ్యం,మరి యే కవిలోనూ కానరాదు.వేలకొలదీ సంకీర్తనలలో ప్రతి ఒక్కటీ ఒక ఆణిముత్యమే...ఆలోచనామృతమే.
నా అనుభవంలో అన్నమయ్య సంకీర్తనల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించటం,'కత్తిమీద సాము' వంటిది.'అలరులు కురియగ' కృతిని రాగ,స్వరసహితంగా శుద్ధ శాస్త్రీయపద్ధతిలో ఒకరు పాడతారు.'ఏమొకో చిగురుటధరమున' అంటూ భావబంధురంగా లలితంగా మరొకరు ఆలపిస్తారు.'తందనానా ఆహి' అంటూ జానపద ఫక్కీలో మరొకరు గానంచేస్తారు..వీరిలో అందరికీ సమానంగా హర్షధ్వానాలిస్తారు శ్రోతలు..అయితే గాయకులు ఎంచుకొన్న ఆ కీర్తనలు వారు పాడిన బాణీలో కాక,మరొకరకంగా పాడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించండి..దేనికదే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి.వీటిలో దేనికి ప్రథమ బహుమతి ఇవ్వాలి? అనేది సదా ప్రశ్నార్థకమే..
అది అన్నమయ్య పదంలో ఉన్న విలక్షణత!
అన్నమయ్య సాహిత్యమయితే రాగిరేకులలో నిక్షిప్తం చేయబడటంచేత లభ్యమైంది కానీ స్వరమెట్లు లేకపోవటం చేత,ఎవరికి నచ్చిన బాణీలో వారు స్వరపరచుకొని, పాడుకుంటున్నారు.అలాగని అన్నమయ్య కీర్తనలు స్వరపరచటానికి అందరికీ అర్హత ఉంది అనవచ్చా?కనీస రాగ,తాళ,భాషా పరిజ్ఞానం లేకుండా వాటిని స్వరపరచవచ్చా?లేదు...అయితే...ఆసాహిత్యాన్ని బాగా మనసుకు పట్టించుకొని,అందులోని అచ్చతెనుగుపదాల అర్థాలను ఆకళింపు చేసుకొని,సంగీత ఛందస్సును పాటిస్తూ,ఆనాటి కాల,మాన పరిస్థితులపై కూడా కొంత అవగాహనతో చేసిన బాణీలు నిలబడుతున్నాయి.లేనివి కాలగర్భంలో కలసిపోతున్నాయి.
ఉదాహరణకు 'అంతర్యామి!అలసితి,సొలసితి' అంటూ ఎంతో నిర్వేదంతో అన్నమయ్య పాడుకొన్న సంకీర్తనను, హుషారెక్కించే 'కుంతలవరాళి' రాగంలో కదంతొక్కించినా,'చక్కని తల్లికి చాంగుభళా' అనే జానపదాన్ని 'నీలాంబరి' వంటి నిద్రపుచ్చేరాగంలో స్వరపరచినా శ్రోతలు మెచ్చగలరా?
అన్నమయ్య సంకీర్తనలను,సంగీత విద్వాంసులే స్వరపరచాలని,వాటిని కచ్చేరీలలో ప్రథానాంశంగా పాడుకొనేట్లు చేయాలనే తలంపు సైతం సరికాదు.అన్నీ అందుకు వీలు పడవు.
అనేక ఘనమైన రాగాలను మాలికగాచేసి,క్లిష్టమైన తాళంలో కూర్చిన బాణీ కన్నా,సులువుగా అందరూ పాడుకొనే వీలుతో,అరటిపండు ఒలిచిపెట్టిన రీతిగా సాహిత్యం తెలిసేట్లు సరళంగా చేసిన ఒక అన్నమయ్య జోలపాట జనబాహుళ్యంలో ఎక్కువ ప్రచారంలో ఉంది.
రాగమాలికగా బహుళ ప్రసిద్ధమైన అన్నమయ్యకీర్తన 'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన'..బృందావనసారంగ, మాయామాళవగౌళ రాగాలలో స్వరపరచబడింది.నిజానికి అది రాగమాలిక కాదు.రెండు కన్నా ఎక్కువ రాగాలలో కూర్చితేనే అది మాలిక అవుతుంది.ఆకీర్తన నడక,చతురస్ర గతిలో నల్లేరుమీద నడకలా సాగుతుండగా,దానికి విరుద్ధమైన మిశ్రచాపు తాళంలో కూర్చవలసిన ఔచిత్యం ఏమిటి?పైగా.. ఖచ్చితమైన ఛందోనియమాలు పాటించబడిన అన్నమయ్య కీర్తనకు,ఆవిధంగా తాళభేదం చేయటంతో ఛందోభంగం కలగలేదా!
మహావిద్వాంసులైన మంగళంపల్లివారిని ఒక సందర్భంలో అన్నమయ్య గురించి మాట్లాడమంటే, 'అన్నంకోసం పాడుకొనేవాణ్ణి, అన్నమయ్య గురించి ఏమి మాట్లాడగలను?' అన్నారు.అటువంటిది..ఈనాడు అన్నమయ్య కీర్తనలను ధనసముపార్జనకు ఒక సాధనంగా భావించి,అరకొర సంగీత,సాహిత్య జ్ఞానంతో,అన్నమయ్య హృదయాన్ని కొంతైనా తెలుసుకోకుండా కొందరు స్వరపరచి పాడటం,పాడించటం ఆమహావాగ్గేయకార శిరోమణికి అందించే నిజమైన నివాళి అనిపించుకుంటుందా?
ఇక ప్రదర్శన విషయానికొస్తే,అన్నమయ్య కీర్తనాగాన కచేరీలో,స్వరకల్పనాది మనోధర్మ సంగీతాన్ని పాడవద్దని శాసించే నిర్వాహకుల్ని చూశాను నేను.నిజానికి అందుకు అనుకూలమైన కీర్తనలలో,సమర్థులైన గాయకులు,మితిమించని విధంగా ఆలాపన,స్వరకల్పన,నెరవులు వంటివి చేర్చటం వలన శ్రోతలకు కొంత విశ్రాంతి కలగటమేకాక,కళాకారుడి సృజనాత్మకత వెల్లడి అయే అవకాశం ఉంటుంది.రెండు గంటల కచేరీలో మూడు,నాలుగు అంశాలలో ఈవిధమైన మనోధర్మప్రదర్శన చేయటం ఆహ్వానింపపగినదే!
నాకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది.ఎన్నడైనా త్యాగరాజస్వామి,అన్నమయ్య కీర్తన విని ఉంటారా? అవకాశమే లేదు.అయితే ఇద్దరిదీ భక్తి మార్గమే కనుక, వారిరువురి రచనలలోనూ కొండొకచో భావసారూప్యత కనబడుతుంది.ఉదాహరణకు 'అలర చంచలమైన ఆత్మలందుండనీ అలవాటు సేసెనీ ఉయ్యాల!' అని అన్నమయ్య అంటే, 'ఏతావునరా!నిలకడనీకు? ఎంచిజూడగా నగబడవు!' అని త్యాగయ్యగారంటారు.'ఎవరని నిర్ణయించిరిరా?నిన్నెట్లారాధించిరిరా!నరవరులు!' అని త్యాగయ్యగారంటే,'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు' అంటారు అన్నమయ్య.
ఏది ఏమైనా,తెలుగువారిగా పుట్టటం మన అదృష్టం.అన్నమయ్య మొదలుకొని, మైసూరు వాసుదేవాచార్య వరకూ అందరూ తెలుగులోనే భగవంతుని కీర్తించారు.ఆ కీర్తనలను తనివితీరగా భావించి,పాడుకొనే వరం తెలుగువారి సొత్తు.
అన్నమయ్య సాహిత్యమే అంత గొప్పగా ఉంటే... ఇక ఆయన సంగీతమెంత గొప్పగా ఉండిఉంటుంది?ఆనాడు వాడుకలో ఉన్న రాగాలు పరిమిత సంఖ్యలోనే ఉండేవి కదా!..మరి రాగిరేకులమీద వ్రాసిన విధంగా చూస్తే,ఒకే రాగాన్ని కొన్ని వందల సంకీర్తనలకు ఆయన ఎలా స్వరపరచి పాడుకొని ఉంటారు? ఊహకు అందని విషయమది!..
అందుకే...అందరం 'అన్నమయ్యా!నీకు వందన మన్నామయ్యా!' అనవలసిందే!..
-Modumudi Sudhakar

Friday, 15 November 2019

బంగారు తల్లి.


అమ్మొక దారి నాన్నొక దారి వెతుక్కుంటే,
అమ్మమ్మ పంచన చేరిన అమాయకపు బాలిక 
పది వసంతాలలోనే పరిపూర్ణమైన అనుభవం. 
దారి తెన్ను లేని జీవితం,
అంధకారబంధురమైన భవితవ్యం
ఆప్యాయత తప్ప కడుపునింపలేని అమ్మమ్మ పేదరికం
ఫలితం ఆసరా లేని మరొక అమ్మకు, అమ్మమ్మకు దత్తత..
కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో ఇమడలేని నిస్సహాయత.
కాలగమనంలో తొలగిన అరమరికలు, ఉప్పొంగిన ఆప్యాయతలు.
తను లేనిదే అమ్మమ్మకు ఊపిరి లేదు, అమ్మకు నిద్ర రాదు.
అమ్మమ్మకు, అమ్మకు, మావయ్యకు తలలో నాలుక.
అమ్మ బందువులందరూ తన్ను అభిమానించే వారే,
ఒకరు అన్న, ఒకరు వదిన, ఒకరు అక్క, ఇంకొకరు బావ.
ఒకరు చదువు చెప్తే, ఇంకొకరు పాటలు నేర్పితే
ఆడుతూ పాడుతూ సాగే జీవనం.
పాఠశాల వదలి, కళాశాలలో అడుగుపెట్టిన నాడు
రంగుల కలలా కనిపించే జీవితం, అంతలోనే వక్రించిన విధి.
బాధ్యత నెరిగి, చేదోడుగా మసలి విద్యాబుధ్ధులు నేర్చుతున్న చిట్టితల్లిని
కాన్సెర్ మహమ్మారి తన క్రూరమైన కోరలతో కబళించివేసింది.
బంగారుస్వప్నం చెదరిపోయింది.
అమ్మను, అమ్మమ్మనూ అనాథలను చేసి తరలిపోయింది.
అతిథిగావచ్చి అలరించి అందరి మన్ననలను పొంది,
అంతలోనే కనుమరుగయిపోయిన బంగారు తల్లిని మరచేది ఎలా?

Thursday, 24 October 2019

అదృష్టం


అదృష్టం అందరినీ వరించదు,
వరించినవారికి సంతృప్తి ఉండదు.
ఇంకా ఏదో కావాలనే తపన.
ఆశనిరశలమధ్య కొట్టుమిట్టాడే మానసం.
చీకటి వెనుక వెలుగే రాదా?
కష్టసుఖాలు ఇంతేకాదా ఆన్నాడో సినీకవి.
చీకటేకానీ వెలుగు పొడచూపదు కొందరి జీవితాలలో..
కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.
నిర్విరామంగా కృషి చేసినా ఫలితం శూన్యమే!
చెక్కు చెదరని ఆత్మస్థైర్యం కొందరిదైతే,
అన్నీ అమరినా అనుభవించలేని తత్వం కొందరిది.
షడ్రుచుల సమ్మేళనం జీవితం,