ఈ వారం అన్నమయ్య
కీర్తన.
అమ్మేదొకటియు
అసీమలోనిదొకటి
ఇమ్ములమా గుణములు
యెంచ చోటేదయ్యా! !!
ఎప్పుడు నేము
చూచిన నింద్రియ కింకరులము
ఇప్పుడు నీ కింకరుల
మెట్టయ్యేమో
తప్పక ధనమునకుదాస్యము
నేము సేసేము
చెప్పి నీ దాసుల
సిగ్గుగాదా మాకు !!
పడతులకెప్పుడును
పరతంత్రులము నేము
పడి నీ పరతంత్ర
భావము మాకేది
నడుమ రుచులకే
నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను
నుతియించే అందుకును !!
తనువు లంపటాలకు
తగ మీదెత్తితి మిదె
వొనరి నీ ఊడిగాన
కొదిగే దెట్టు
ననచి శ్రీవేంకటేశ
నాడే నీకు శరణంటి
వెనకముందెంచక
నీవె కావవయ్యా! !!
భావం..
మనం కానిది మనమని
చూపెట్టుకునేందుకు మనం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి దైన్యం నుంచి మనం బయటపడాలంటె
ఆ దేవదేవుడిని శరణు వేడుకోవాలి. మనలోని కపటత్వాన్ని కడిగివేయమని ఆ పరమాత్మని వేడుకోవాలి.
అలాంటి భావనతోనే ఈ భగవతోత్తముడు ఈ కీర్తనను రచించాడు.
ఓ వేంకటేశ్వరా!
మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా! మేము మూటలోనున్నవి ఒకరకమైతే, ముందు మరోరకం
వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారస్తుల్లాంటివాళ్ళం . ఇది నీకు తెలియనిది
కాదు.
మేమెప్పుడూ ఇంద్రియాలకు
బానిసలము. ఇంద్రియాలకు యజమానులుగా ఉండవలసిన మేము, వాటికి బానిసలుగా మారిపోతున్నాము.
అవి మన అధీనంలో ఉండవలసినది పోయి మేమే వాటి
అధీనంలోకి వెళ్ళిపోతున్నాము. ధనానికే దాస్యం చేస్తూ, నీ దాస్యాన్ని విస్మరిస్తున్నాము.
నీ దాసులమని చెప్పుకుందుకి సిగ్గుపడుతున్నామయ్యా!
స్త్రీవ్యామోహంతో
చిత్తచాంచల్యము కల మాకు నీగురించి ఆలోచన ఏది? జిహ్వచాపల్యంతో తపించే నాలుకకు నిన్ను
నుతీంచే అవకాశమేది? ఈ చాపల్యం నీ నామస్మరణకు దూరం చేస్తూంది.
ఈ తనువు లంపటాల్లో
చిక్కుకున్న మేము నీకు ఊడిగం చేస్తూ ఎప్పటికి తరించగలము? శ్రీవేంకటేశా! నిన్నే శరణన్న మమ్మల్ని ముందువెనుకలు ఆలోచించక కాచుకోమని
ఆర్ద్రతో అన్నమయ్య వేడుకొంటున్నాడు.
No comments:
Post a Comment