Saturday, 4 June 2016

గాన గంధర్వుడు బాలాసుబ్రమణ్యం

ఆ గళం ..గుడికట్టిన నుడి కారం (శ్రీబాలుగారిజన్మదినోత్సవంసందర్భంగా......'మధురవాణి' అంతర్జాలపత్రికసౌజన్యంతో)
-ఓలేటి శ్రీనివాసభాను
పాడటం ఓ కళ. అందులోనూ నేపథ్య గానం ప్రత్యేకమైన కళ.తెర మీది దృశ్యం, తెర వెనక గాత్రం - పాలూ తేనెల్లా కలిసిపోవాలి . వాటిని విడదీయలేని అనుభూతి ఆవిష్కృతం కావాలి . ఇంపుగా ఉండాలి . సొంపులు తిరిగి సోయగాలు పోవాలి . వీటన్నిటితోపాటు- స్పష్టత, స్వచ్ఛత గొంతులో గుడి కట్టాలి . ఇవన్నీ కొలువు తీరిన గొంతు శ్రీ బాలు గారిది . అందుకే యాభయ్యేళ్లుగా అది తెలుగు చలనచిత్ర గీతానికి పర్యాయపదమైపోయింది . పాటల చదువుకు పాఠ్యగ్రంథమైపోయింది . తరాల సంగీతాభిమానుల తరగని అభినందనల్ని అందుకుంటోంది.
**********************
'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'లో "రావే కావ్యసుమబాలా .." అని తొలిసారిగా పల్లవించినప్పుడూ, 'ప్రైవేటు మాస్టారు'లో "పాడుకో పాడుకో .."అని పాడుతూ చదువుకోమని సందేశం ఇచ్చినప్పుడూ, అలాగే "మేడంటే మేడా కాదూ .." (సుఖ దుఃఖాలు),
, "రావమ్మా మహాలక్ష్మీ ..", "చుక్కలతో చెప్పాలని ..", చాలు లే నిదురపో .." (ఉండమ్మా బొట్టు పెడతా)లాంటి పాటలతో పూతరేకుల తీయదనాన్ని లేత గొంతులో పంచి ఇచ్చినప్పుడూ - తెలుగు చలన చిత్రాభిమానులు ఆనందించారు . "కొత్త గొంతు గమ్మత్తుగా ఉందే!" అని స్వాగతించారు . అ క్రమం లో "ఓ చిన్నదానా .."(నేనంటే నేనే) దూసుకొచ్చింది .హాల్లో చూసిన వారినీ, రేడియోలో విన్న వాళ్ళనీ ఒకే లాగ "ఓహో" అనిపించింది . నటుడు కృష్ణకి అచ్చంగాసరిపడే స్వరం వచ్చిందని జనం చెప్పుకొన్నారు .
నటుడైనా, గాయకుడైనా తమ లో వైవిధ్యాన్ని రుజువు చేసుకోవాలనుకుంటారు. హుషారు పాటలతో పాటు లలిత శాస్త్రీయ సంగీత ఛాయలున్న పాటల్ని కూడా పాడగలనని ఆ స్వరం నిరూపించుకునే దశలో బాలు గారికి 'శ్రీరామ కథ'లో సముద్రాల రాఘవాచార్యుల వారి చివరి గీతం -"రామ కథ.. శ్రీరామ కథ "ను రాగమాలిక లో పాడే అవకాశం వచ్చింది . గాత్రం లో వైవిధ్యాన్ని చూపించడానికి దోహదపడింది . అలాగే 'ప్రతీకారం; చిత్రం లో "నారీ రసమాదురీ..", 'ఆంధ్ర పుణ్యక్షేత్రాలు'(జానకి గారితో కలిసి పాడిన ప్రైవేటు ఆల్బం)లాంటివి కూడా ఆయన లోని గాయకుడు ఆశించే వైవిధ్య ప్రదర్శనకు ఊతమిచ్చాయి !
కానీ, అప్పటి చలన చిత్ర అవసరాల దృష్ట్యా అలాంటి అవకాశాల కోసం బాలుగారు మరికొంత కాలం నిరీక్షించాల్సి వచ్చిందేమో! అదృష్టం వల్ల అవకాశాలు వస్తాయోమో గానీ, వాటిని సద్వినియోగం చేసుకోడానికి కృషి, పట్టుదల,ప్రతిభ ముప్పేటలా తోడు కావాలి .ఆ మూడూ ఉన్న బాలూ గారి గొంతు ఎప్పటికప్పుడు సత్తాను నిరూపించుకుంటూనే, ఎదురైన పరీక్షల్లో విజయాన్ని ప్రథమ శ్రేణిలో సాధిస్తూనే వచ్చింది .
సంపూర్ణ నేపథ్యగాయకుడిగా ఎదిగే ప్రస్థానం లో ఆయనకు మరో ముఖ్యమైన సవాలు ఎదురయింది. అదే-"అగ్రనటులు ఎన్టీఆర్ , ఏయన్నార్ లకు బాలుగారి గొంతు సరిపోతుందా?"అన్న మీమాంస! అప్పటికి ఎన్టీఆర్ కి ఆయన "పట్టాలి అరక దున్నాలి మెరక .."(చిట్టి చెల్లెలు), "నిద్దురపోరా స్వామీ.."(కోడలు దిద్దిన కాపురం), అలాగే ఏయన్నార్ కి "నాహృదయపు కోవెల లో .." (ఇద్దరు అమ్మాయిలు) లాంటివి పాడారు. కానీ మీమాంస తీరడానికి మరికొంత సమయం పట్టింది . ఆ లోగా వైవిధ్యం, సంకల్పం, పట్టుదల, తపన, రాజీపడని తత్త్వం,ఒడిసిపట్టి ఒదిగిపోయే నైపుణ్యం- ఈ ఏడు లక్షణాలూ సప్తస్వరాలై బాలుగారి గొంతులో స్థిరపడిపోయాయి . ఫలితం ఏమిటో అగ్రనాయకులకు ఆయన పాడిన పాటలే చెప్పాయి . 'దానవీరశూర కర్ణ' వచ్చింది. దుర్యోధనుడిపాత్ర లో ఎన్టీఆర్ కి యుగళగీతం -"చిత్రం ..భళారే విచిత్రం" ఒక ఊపు ఊపింది ..సరి కొత్త పోకడ సృష్టించింది . 'ఆలుమగలు ' వచ్చింది . "ఎరక్కపోయి వచ్చాను .." పాట అక్కినేని హావభావాలకు అచ్చమైన శబ్దరూపాన్నిచింది . ఇద్దరు అగ్రనటుల గొంతుల్లోనూ , కవళికల్లోనూ వ్యక్తమయే విభిన్నత్వానికి నూరుపాళ్ళ న్యాయం చెయ్యడానికి బాలుగారిలో ధ్వన్యనుకరణ నైపుణ్యం అక్కరకు వచ్చింది . ఆ ఆతర్వాత -'అడవిరాముడు', 'ప్రేమాభిషేకం'లాంటివి చారిత్రిక అధ్యాయాలు ! చలనచిత్రానికి అవసరమైన మోతాదులో శాస్త్రీయ సంగీత ఛాయల్ని మేళవించి, ఓ సినిమా ఆద్యంతాల వరకు న్యాయం చేకూర్చడం ఆ తర్వాతి చరిత్ర! అది 'శంకరాభారం'తో సాకారమయింది . బాలు గారికి జాతీయ పురస్కారాన్ని అందించింది .
యాభయ్యేళ్ళ ఈ సుదీర్ఘ ప్రస్థానం లో బాలుగారి ప్రతిభ కేవలం తెలుగు పాటలకే పరిమితం కాకపోవడం మరో ప్రత్యేకత . తమిళ, కన్నడ చలనచిత్రాభిమానులు "బాలూ తమ వాడే " అని ప్రేమించి, అభిమానించేలాగా ఆయా భాషల్లో పాటలకు న్యాయం చేశారాయన . అంతేకాదు చిరుతెర మీద తన అనర్గళమైన వ్యాఖ్యాన ప్రతిభతో పొరుగు రాష్ట్రాల వారిప్రశంసలు కూడా అందుకుంటున్నారు . అలాగే తన హిందీ పాటలతో ఉత్తరాది మెప్పును , హిందీ పాటకు జాతీయ పురస్కారాన్నీ పొందారాయన!
మాతృభాష లో కావచ్చు, మరో భాష లో కావచ్చు ..బాలుగారి విజయ రహస్యం - భాషల పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం! ఉచ్చారణ లో స్పస్టత కోసం, సహజమైన పలుకుబడి లో నిబిడీకృతమైన అందాల్ని అందించడం కోసం, తన పాట వింటున్న ప్రతీ వ్యక్తినీ -"ఈయన నా భాషను నాలాగే పలుకుతున్నారు"అని ఒప్పించి, మెప్పించి ,తనతో పాటు తీసుకువెళ్ళడం కోసం, బాలు గారు పడే తపన, రాజీ లేని కృషి, నిరంతర అధ్యయనం, ఇలా ఎన్నో ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి .వివిధ వేదికల మీద నుంచి, మాధ్యమాల నుంచి ఔత్సాహిక గాయనీ,గాయకులకు ఆయనిచ్చే సూచనల్లో,సలహాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి . అందుకే బాలుగారు ఏ భాషలో పాడినా ఆ నుడికారానికి అది రాక్షణ కవచం లాగా నిలిచిపోతుంది

దైవమోక్కడే సంతత భజనీయుడు - అన్నమయ్య కీర్తన.


Ponnada Lakshmi
Write a comment...
ప. దైవమోక్కడే సంతత భజనీయుడు
భావము సమబుద్ధి బాయగ దగదు
౧. హరియే సకలాంత రాత్మకుం డటుగాన
తిరమై యోకరి నిందింప దగదు,
అరయగ లోకము లనిత్య మటుగాన
మరగి కొందరిమీది మమతయు వలదు.

౨. బహు కల్పితములెల్ల బ్రకృతి మూలమె కాన
గహనపు దన ఉద్యోగమూ వలదు.
సహజ విహారుడు సర్వేశ్వరుడు గాన
వహి దానె వచ్చినవి వలదన దగదు
౩. తపములు జపములు దాస్యమూలమె కాన
ఉపమల సందేహ మొగి వలదు
ఎపుడును శ్రీ వేంకటేశ్వరు సేవించి
చపలచిత్తము వారి సంగ మిక వలదు.
భావము: ఎల్లవేళల జీవులు కారాధింపదగినవాడు భగవంతుడొక్కడే. పరమాత్ముడు సర్వత్ర సమముగా వ్యాపించి యున్నాడు గాన భగవంతుని పూజించిన వారెన్నడును సమద్రుష్టిని వీడరాదు.
సమస్తజీవులను అంతరాత్ముడైనవాడు శ్రీహరియే. కావున ఒకరిపై ద్వేషము బూని నిందించుట ఎంతమాత్రము తగదు. ఈ లోకములన్నియు అశాశ్వతము లైనవే. ఎవ్వరును మానల నంటి పెట్టుకుని కలకాలము ఉండబోరు. కావున కొందరిపై మమకారము కూడ ఉచితము కాదు.
ఈ ప్రకృతి నుండియే చిత్రవిచిత్రములైన అనేక కల్పనలు ఏర్పడుచున్నవి, కాని కష్టపడి జీవులు తమకు తాముగా ప్రయత్నించి సాధించునదేమియు లేదు. అందుచే అట్టి ప్రయత్నం చేయవలదు. అంతటికి మూలమైన పరమాత్ముడు సహజ విహారుడు కావున ఆ దేవుని సంకల్పముచే తమకు తాముగా వచ్చినవాటిని వలదనుట తగదు.
మోక్షప్రాప్తికై చేయు తపములు, జపములు మున్నగున వన్నియు భగవంతుని దాస్యమూలములే కాని అన్యములు కావు. కావున ఆయా సాధనలకు భగవంతుడిచ్చిన వానిపట్ల సంశయము కలిగి యుండరాదు. సర్వదా శ్రీ వేంకటేశ్వరునే సేవించు వారికి చపలచిత్తులై దైవమును భజించని మూర్ఖులతో నెట్టి సంబంధము పనికిరాద

ఇన్నాళ్ళు నెరగము నిటువంటివి అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఇన్నాళ్ళు నెరఁగము నిటువంటివి
సన్న నిట్టె జరుగునో సారె మీ ఇద్దరికి !!
౧. పొలసి పొలసి ఏమి పోదిగినీ యాపె నిన్ను
పిలిపించితివో నీవు ప్రియము తోడ
మొలక నవ్వులతో నీ మొగము దప్పక చూచి
కలవో వొడఁబాట్లు కడు మీ ఇద్దరికీ !!
౨. చేరి చేరి ఊడిగాలు సేయగఁవచ్చీ నీకు
కారణమేమైనా గద్దో కాఁగిటికి
నేరుపుతో సలిగలు నెరపీ నీ ముందరను
ఈ రీతి వేడుకాయనో యిట్టె మీ ఇద్దరికీ !!
౩. పెనఁగి పెనఁగి యాపే బెరసి నవ్వీ నీతో
చనవు నీవొసంగిన ఛందమో యిది
యెనసితి శ్రీవేంకటేశ యింతలో నన్ను
మనసు లొక్కటాయనో మరి మీ ఇద్దరికీ !!

భావమాధుర్యం:
స్వామీ ! నీవు శ్రీదేవి సొత్తువని నాకు తెలియును. మీఇద్దరికీ కూడా మధ్య మధ్య ఇటువంటివి జరుగుతాయా?
అతిశయముతో ఆమె ఏమి బెట్టు చేస్తున్నది. తప్పేమున్నది? నీవే ఆమెను పిలువనంపితివి. మొలక
నవ్వులతో ఆమె నిన్ను చూచిందంటే ఇక మీఇద్దరికీ ఒడంబడికలు తప్పవు.
ప్రభూ! ఆమె నీకు చేరికయై సేవలు చేయగల నేర్పరి. సేవాకార్యక్రమంలో ఈ కౌగలింతల వ్యవహారం ఏమిటి? ఆమె నీ ముందరే తన నేర్పరితనంతో అతి చనువు ప్రదర్శిస్తుంది. మీ ఇద్దరికీ ఇటువంటి చిలిపి పనులు వేడుక ఏమో మరి!
ప్రభూ! ఆమె నీకు చేరికయై పెనవేసి మనోహరంగా నవ్వుతున్నది. ఇదంతా నీవిచ్చిన చనువే కదయ్యా! మీ సంగతి ఇట్లుండగానే ఓ వేంకటేశ్వరా! నన్నూ (అన్నమయ్యను) దరి చేరితివి. మన మనస్సులు ఒకటైనవి. మరిమీ ఇద్దరికీ లోటే లేదాయెను. ఆమె నీ హృదయనివాసిని కద

Friday, 20 May 2016

అన్నమయ్య జయంతి



నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి.

ఆంధ్ర వాగ్గేయకారకుల్లో ప్రప్రధముడు, అగ్రగణ్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
          “సకలవేదములు – సంకీర్తనలు చేసి
           ప్రకటించి నిను బాడి – పావనుడైన
           అకళంకుడు తాళ్ళపా – కన్నమాచార్యుల
           వెకలియై ఏలిన శ్రీ – వేంకటనిలయ.
          ఇది అన్నమయ్య సంతతివారు శ్రీ  వేంకటేశ్వర స్వామినుద్దేశించి పాడిన కీర్తన. పదకవితాపితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు పాడిన పదాలన్నీ వేదాలకు మారు రూపాలే అని దీనివల్ల తేటతెల్లమవుతున్నది.
భగవదంశంలో జన్మించిన అన్నమయ్య చెప్పే మాటలు, చేసే పనులు దైవత్వాన్ని సంతరించుకున్నాయి. అన్నమయ్య అమరుడైనా ఆయన కీర్తి అజరామరం. ఆకృతి అశాస్వతమైనా కృతి శాస్వతమే కదా!
          ఈ సంకీర్తనాచార్యుడు 32,000 వేల కీర్తనలతో వేంకటనాధుని కీర్తించాడు. పరమపద ప్రాప్తికి భగవద్విశ్వాసాన్ని  మించిన ఉపాయం లేదని అన్నమయ్య సిద్ధాంతం.
          “నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నింపుకొని
           ఉన్నవాడ నిక వేరే – ఉపాయ మేమిటికి ?”
అని స్వామితో చెప్పుకున్నాడు. ఆ విశ్వాసమే అన్నమయ్యను ఆడించింది, పాడించింది, అద్భుతమైన పదకవితా సాహిత్యాన్ని సృష్టింప జేసింది. భక్తిభావంతో ఆయన పాడిన పదాలు అందరికీ తారకమంత్రాలయాయి.
          అన్నమయ్య పదాలలో చమత్కార వాగ్దోరణిలో ఎన్నో వింత పోకడలు కనిపిస్తాయి. పదాల మేళవింపులో, అర్దాల పోహళింపు లో అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు. వివరణ లేకున్నా సాధారణ పాఠకలోకానికి  తేలికగా అర్ధమయ్యే పాటలు ఎన్నో ఉన్నాయి. అలాగే విపుల వివరణ లేకుండా ఏమాత్రం అర్ధంకాని కీర్తనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాళ్ళపాక వారి పదసాహిత్యం అర్ధభావ ప్రధానమైనదనీ, త్యాగరాజాదుల కృతుల వలె నాదరచనా
ప్రధానం కాదనీ శ్రీ రాళ్ళపల్లివారు తెలిపియున్నారు.
          అమ్మ చేతి ప్రసాదం తిన్న మహాత్మ్యమేమో మరి, అలమేలు మంగమ్మ మీద అతి మధురమైన కీర్తనలను రచించాడు. అన్నమయ్యకు అయ్యవారి మీద కన్నా అమ్మవారి మీదే అభిమానమెక్కువ. ఆమెతో చనువూ ఎక్కువే. అమ్మగా భావించినా అన్నమయ్య అలమేలుమంగమ్మను చక్కని తల్లిగా, నవరసముల మూర్తిగా, పుష్పవల్లిగా, స్వామిని అలరించే శృంగార మూర్తిగా, కన్నతల్లిగా  ఇంకా ఎన్నోవిధాలుగా స్తుతించి పరమానంద భరితుడయ్యాడు. 
          అన్నమయ్య రచనల్లో ఆధ్యాత్మిక, వేదాంత, భక్తి, శృంగారాలతో బాటు ప్రత్యేకంగా స్త్రీలకోసం రాసిన కీర్తనలు ఉన్నాయి. పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, సువ్వి పాటలు, దంపుళ్ళ పాటలు , కోలాటం పాటలు, సోది చెప్పే పాటలు, జోల పాటలు ఇలా స్త్రీలు మాత్రమె పాడుకొనేలా ఎన్నో కీర్తనలను రచించాడు. ఈవిధంగా స్త్రీల మనోభావాలకు అనుగుణంగా రచనలు చేసిన మొదటి వ్యక్తీ అన్నమయ్యే.  స్త్రీ విద్యని ప్రోత్సహించి స్త్రీల చేత కూడా కవితలల్లించిన ఉత్తముడు అన్నమయ్య. ఈతని భార్య తిమ్మక్క “సుభద్రాకల్యాణం”  అనే కళ్యాణ కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవయిత్రి అయినది. ఈ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది. 
          అంతే కాక  ఎంతో ప్రాచుర్యం కలిగిన “చేత వెన్నముద్ద  చెంగలువ పూదండ”  పద్యం కూడా అన్నమయ్య సుదర్శన కృష్ణ శతకం లోనిదే. ఈ  శతకంలో కొన్ని పద్యాలు మాత్రమె లభించాయట.
          “చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ
                   బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
          కొండెప సిగముడి – కొలికి నెమలిపురి
                   ముంగురుల్ మూగిన – ముత్తియాలు
          కస్తూరికింబట్టు – కన్నులన్ కాటుక
                   చక్కట్ల దండలు ముక్కుపోగు
          సందిట తాయెతుల్ – సరిమువ్వ గజ్జెలు
          అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు
          కాళ్ళనందె – ఘల్లు ఘల్లు మనగ
          దోగి దోగి యాడ – తాళ్లపాకన్నన్న
          చిన్నికృష్ణ నిన్ను – చేరికొలుతు.
కాలానుగుణంగా ఈ పద్యం లో కొన్ని పాదాలు తగ్గి చిన్నపద్యం గా రూపుదిద్దుకుని తెలుగు తల్లుల నోళ్ళలో నాట్యం చేస్తూంది.
          స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో, శుభకార్యాలలో పాడుకునే అనేక విధాలయిన పాటలను రచించి, స్త్రీల పాటలకు ఉన్నత స్థితినీ, ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.  స్త్రీ జాతిని  ఇంతగా గౌరవించి,  స్త్రీల అభ్యు దయానికి  ఆరాటపడి,  ప్రత్యేకంగా స్త్రీల కోసం ఇంతమంచి సాహిత్యాన్ని కూర్చిన కవి, వాగ్గేయకారుడు, లక్షణకర్త అయిన అన్నమయ్యకు స్త్రీ జాతి ఎంతో ఋణపడి ఉంది.  ఆ మహా మహునకు ఇదే నా శతకోటి వందనాలు.
- పొన్నాడ లక్ష్మి 

Friday, 13 May 2016

ఎన్ని వేదాలు చదివిన యెంత సోమయాజులైన - అన్నమయ్య కీర్తన.






ఈ వారం అన్నమయ్యకీర్తన.
ప. ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
     కన్నెలు వద్దనుండగా కాంక్షలేల తీరును.                   ||
౧.   కొరకుండేవా నీవు గొల్లెతలఁ గనుఁగొంటే
      పారదా మనసు వారి పాలిండ్లపై
      ఊరదా నీ నోరు తేనెలొలికే మోవి పండ్లకు
      పేరదా వలపు వారి బెల్లింపు మాటలకు                    ||
౨.   చిక్కవా వారికి నీవు చేతులు పైఁ జాఁచితేను
      చొక్కకుండేవా మేనులు సోఁకించితేను
      చక్కనుండేవా వారు సరసము లాడితేను
      పక్కన రేగఁడా తమి భావించి నవ్వితేను                   ||
౩.    పాయగాలవా సతులు భ్రమియించి కూడితేను
      అయినా తనివి నీకు నంతలోననే
      యేయడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
      మాయలకు లోను గాదా మంతనమాడితేను     || 

భావ మాధుర్యం :
          అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీకృష్ణుని శృంగారాన్ని సమర్ధిస్తున్నారు. ఎన్ని వేదాలు చదివినా, ఎంత సోమయాజివైనా కన్నెపిల్లల సాంగత్యం ఉంటె కోరికలు రేగక తగ్గుతాయా అంటున్నారు.
          గొల్లెతలు కావాలని నీ వద్దకు చేరితే వారి పాలిండ్లపై నీ దృష్టి పడి నీ మనసు చలించదా? తేనెలొలికే వారి పెదవులను చూస్తె నీ నోరు ఊరదా? మైమరపించు వారి మాటలకు వారిపై నీకు వలపు కలుగదా?
          వారు ప్రేమతో చేతులు చాచితే వారికౌగిట్లోకి చేరవా? వారు సరసములాడుతూ చక్కగా నవ్వితే నీకు మోహము కలుగదా?
          వాళ్ళు కలిగించే భ్రమలకి లొంగక వదలి ఉండగలవా? అయినా నీ తనివి తీరుతుందా? నేడు శ్రీ వేంకటేశ్వరా! నీవు నన్నుయేలితివి. నీ మాయలకు లోనై నేనూ నీతో మంతనాలాడేను.

Friday, 6 May 2016

ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని -- అన్నమయ్య కీర్తన.

ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని -- అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన:

ప. ఎట్టు సింగారింత మమ్మ ఈ ఇంతిని
ముట్టని సింగారము ముందు ముందె యమరె ||

౧. పొలితి చంద్రవంకబొట్టు వెట్టఁ బోయి సంది
మలసే గోరొత్తు చూచి మాని(ని) నవ్వెను.
కలిమిఁ జంద్రగావి గట్టఁబోయి అద్దములో
సొలపుఁ గన్నులగావి చూచి నవ్వెను. ||

౨. అమరిన ముత్యాలహారములు వెట్టఁ బోయి
చెమటముత్యాలు చూచి చెలి నవ్వెను.
కొమరె యరవిరులు కొప్పున ముడువఁ బోయి
తమిఁ బులక విరులు తాఁ జూచి కొంకెను. ||

౩. వీఁగుచుఁ బరిమళము వెలఁది పూయఁగఁ బోయి
కాఁగిట వాసన జూచి కడు నవ్వెను.
సోగల శ్రీవెంకటేశు సురతసింగారము
వాగమై యమరెఁ గాన వన్నెలెల్ల నమరె. ||

భావం: అన్నమయ్య వినిపిస్తున్న ఈ శృంగార కీర్తనలో దేవి చెలికత్తెలు, శృంగార క్రీడా పరితప్తమైన తనకు చెలులు చేస్తున్న సింగారంలో తన విభుని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి తమకించి దేవి నవ్వుకుంటున్నదేలనో తెలియక ఈ విధముగా తలపోస్తున్నారు.

ఈ ఇంతిని మనమేతీరున సింగారింతమమ్మా! మనము చేయని సింగారములు కూడా ఈమెకు మునుముందుగానే అమరి యున్నవి.

ఈ పొలతి తన నుదిటిపై చంద్రవంక బొట్టు పెట్టబోతున్న చెలులను చూచి పక్కున నవ్వింది. తన మేనిపై నున్న గోరోత్తులు గురుతుకు వచ్చినవేమో మరి! సిరులోలికే సిందూరపు చీర గత్తబోతుంటే అద్దములో చూచి తన సోగకనులు నిద్రలేమిచే ఎరుపెక్కిన వైనం గుర్తుకు వచ్చినదేమో! ఆమె పక్కున నవ్వింది.
చక్కటి ముత్యాలహారం వెయ్యబోతే, తనకు ముత్యపుబిందువుల వంటి చెమటలు పట్టిన కథనం గుర్తుకు వచ్చి చెలి నవ్వుకొంటూంది. అరవిచ్చిన పూలను తన కొప్పున అమర్చబోతే తనమేనిపై అరవిరులవంటి పులకలు దేలిన సంగతి గుర్తుకు వచ్చి సిగ్గుతో కుంచించుకు పోయింది.

ఈ వెలది తన ఒంటిపై చెలులు పరిమళ ద్రవ్యములు పూయుచుండగా తన విభుని కౌగిట పరిమళము గుర్తుకు వచ్చి ఆమె నవ్వింది. శ్రీ వేంకటేశుని సురత శృంగారము లోని మధురిమలను నెమరు వేసికొనిన ఆమె పలు వన్నెలతో అలరారినది.

Wednesday, 4 May 2016

మరల నిదేల రామాయణం బన్నచో - కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (క్రీ.శ.1895 – 1976)
ఇంతకుముందే ఎందరోమహాకవులచే విరచింప బడిన రామాయణాన్ని మరల తమరెందుకు రాస్తున్నారని అడిగిన వారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ఇది.
మరల నిదేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల వేళలయందు
తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే చేయుచున్నది
తనదైన యనుభూతి తనది కాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.

మరల రామయణమిదేల అన్నచో ఈ ప్రపంచములో అందరూ ఎల్లవేళలా తినుచున్న అన్నమే రోజూ తింటున్నారు విసుగులేకుండా ఎవరి రుచులు వారివి కనుక, చేసిన సంసారమే చేయుచున్నారు ఎవరి అనుభూతులు వారివి కనుక, అలాగే తలచిన రాముడినే మరల నేను తలచెదను. నా భక్తి రచనలు నావి కనుక. రామాయణ కథ ఎవరైనా చెప్పవచ్చు. కానీ ప్రతిభానుసారియైన రసపోషణలో వైలక్షణం ఉంటుంది.
సంకలనం: శ్రీ బాలాంత్రపు వెంకట రమణ.: తెలుగు పద్య మధురిమలు.