ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని -- అన్నమయ్య కీర్తన.
ఈ వారం అన్నమయ్య కీర్తన:
ప. ఎట్టు సింగారింత మమ్మ ఈ ఇంతిని
ముట్టని సింగారము ముందు ముందె యమరె ||
౧. పొలితి చంద్రవంకబొట్టు వెట్టఁ బోయి సంది
మలసే గోరొత్తు చూచి మాని(ని) నవ్వెను.
కలిమిఁ జంద్రగావి గట్టఁబోయి అద్దములో
సొలపుఁ గన్నులగావి చూచి నవ్వెను. ||
౨. అమరిన ముత్యాలహారములు వెట్టఁ బోయి
చెమటముత్యాలు చూచి చెలి నవ్వెను.
కొమరె యరవిరులు కొప్పున ముడువఁ బోయి
తమిఁ బులక విరులు తాఁ జూచి కొంకెను. ||
౩. వీఁగుచుఁ బరిమళము వెలఁది పూయఁగఁ బోయి
కాఁగిట వాసన జూచి కడు నవ్వెను.
సోగల శ్రీవెంకటేశు సురతసింగారము
వాగమై యమరెఁ గాన వన్నెలెల్ల నమరె. ||
భావం: అన్నమయ్య వినిపిస్తున్న ఈ శృంగార కీర్తనలో దేవి చెలికత్తెలు, శృంగార క్రీడా పరితప్తమైన తనకు చెలులు చేస్తున్న సింగారంలో తన విభుని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి తమకించి దేవి నవ్వుకుంటున్నదేలనో తెలియక ఈ విధముగా తలపోస్తున్నారు.
ఈ ఇంతిని మనమేతీరున సింగారింతమమ్మా! మనము చేయని సింగారములు కూడా ఈమెకు మునుముందుగానే అమరి యున్నవి.
ఈ పొలతి తన నుదిటిపై చంద్రవంక బొట్టు పెట్టబోతున్న చెలులను చూచి పక్కున నవ్వింది. తన మేనిపై నున్న గోరోత్తులు గురుతుకు వచ్చినవేమో మరి! సిరులోలికే సిందూరపు చీర గత్తబోతుంటే అద్దములో చూచి తన సోగకనులు నిద్రలేమిచే ఎరుపెక్కిన వైనం గుర్తుకు వచ్చినదేమో! ఆమె పక్కున నవ్వింది.
చక్కటి ముత్యాలహారం వెయ్యబోతే, తనకు ముత్యపుబిందువుల వంటి చెమటలు పట్టిన కథనం గుర్తుకు వచ్చి చెలి నవ్వుకొంటూంది. అరవిచ్చిన పూలను తన కొప్పున అమర్చబోతే తనమేనిపై అరవిరులవంటి పులకలు దేలిన సంగతి గుర్తుకు వచ్చి సిగ్గుతో కుంచించుకు పోయింది.
ఈ వెలది తన ఒంటిపై చెలులు పరిమళ ద్రవ్యములు పూయుచుండగా తన విభుని కౌగిట పరిమళము గుర్తుకు వచ్చి ఆమె నవ్వింది. శ్రీ వేంకటేశుని సురత శృంగారము లోని మధురిమలను నెమరు వేసికొనిన ఆమె పలు వన్నెలతో అలరారినది.
No comments:
Post a Comment