Friday, 20 May 2016

అన్నమయ్య జయంతి



నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి.

ఆంధ్ర వాగ్గేయకారకుల్లో ప్రప్రధముడు, అగ్రగణ్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
          “సకలవేదములు – సంకీర్తనలు చేసి
           ప్రకటించి నిను బాడి – పావనుడైన
           అకళంకుడు తాళ్ళపా – కన్నమాచార్యుల
           వెకలియై ఏలిన శ్రీ – వేంకటనిలయ.
          ఇది అన్నమయ్య సంతతివారు శ్రీ  వేంకటేశ్వర స్వామినుద్దేశించి పాడిన కీర్తన. పదకవితాపితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు పాడిన పదాలన్నీ వేదాలకు మారు రూపాలే అని దీనివల్ల తేటతెల్లమవుతున్నది.
భగవదంశంలో జన్మించిన అన్నమయ్య చెప్పే మాటలు, చేసే పనులు దైవత్వాన్ని సంతరించుకున్నాయి. అన్నమయ్య అమరుడైనా ఆయన కీర్తి అజరామరం. ఆకృతి అశాస్వతమైనా కృతి శాస్వతమే కదా!
          ఈ సంకీర్తనాచార్యుడు 32,000 వేల కీర్తనలతో వేంకటనాధుని కీర్తించాడు. పరమపద ప్రాప్తికి భగవద్విశ్వాసాన్ని  మించిన ఉపాయం లేదని అన్నమయ్య సిద్ధాంతం.
          “నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నింపుకొని
           ఉన్నవాడ నిక వేరే – ఉపాయ మేమిటికి ?”
అని స్వామితో చెప్పుకున్నాడు. ఆ విశ్వాసమే అన్నమయ్యను ఆడించింది, పాడించింది, అద్భుతమైన పదకవితా సాహిత్యాన్ని సృష్టింప జేసింది. భక్తిభావంతో ఆయన పాడిన పదాలు అందరికీ తారకమంత్రాలయాయి.
          అన్నమయ్య పదాలలో చమత్కార వాగ్దోరణిలో ఎన్నో వింత పోకడలు కనిపిస్తాయి. పదాల మేళవింపులో, అర్దాల పోహళింపు లో అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు. వివరణ లేకున్నా సాధారణ పాఠకలోకానికి  తేలికగా అర్ధమయ్యే పాటలు ఎన్నో ఉన్నాయి. అలాగే విపుల వివరణ లేకుండా ఏమాత్రం అర్ధంకాని కీర్తనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాళ్ళపాక వారి పదసాహిత్యం అర్ధభావ ప్రధానమైనదనీ, త్యాగరాజాదుల కృతుల వలె నాదరచనా
ప్రధానం కాదనీ శ్రీ రాళ్ళపల్లివారు తెలిపియున్నారు.
          అమ్మ చేతి ప్రసాదం తిన్న మహాత్మ్యమేమో మరి, అలమేలు మంగమ్మ మీద అతి మధురమైన కీర్తనలను రచించాడు. అన్నమయ్యకు అయ్యవారి మీద కన్నా అమ్మవారి మీదే అభిమానమెక్కువ. ఆమెతో చనువూ ఎక్కువే. అమ్మగా భావించినా అన్నమయ్య అలమేలుమంగమ్మను చక్కని తల్లిగా, నవరసముల మూర్తిగా, పుష్పవల్లిగా, స్వామిని అలరించే శృంగార మూర్తిగా, కన్నతల్లిగా  ఇంకా ఎన్నోవిధాలుగా స్తుతించి పరమానంద భరితుడయ్యాడు. 
          అన్నమయ్య రచనల్లో ఆధ్యాత్మిక, వేదాంత, భక్తి, శృంగారాలతో బాటు ప్రత్యేకంగా స్త్రీలకోసం రాసిన కీర్తనలు ఉన్నాయి. పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, సువ్వి పాటలు, దంపుళ్ళ పాటలు , కోలాటం పాటలు, సోది చెప్పే పాటలు, జోల పాటలు ఇలా స్త్రీలు మాత్రమె పాడుకొనేలా ఎన్నో కీర్తనలను రచించాడు. ఈవిధంగా స్త్రీల మనోభావాలకు అనుగుణంగా రచనలు చేసిన మొదటి వ్యక్తీ అన్నమయ్యే.  స్త్రీ విద్యని ప్రోత్సహించి స్త్రీల చేత కూడా కవితలల్లించిన ఉత్తముడు అన్నమయ్య. ఈతని భార్య తిమ్మక్క “సుభద్రాకల్యాణం”  అనే కళ్యాణ కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవయిత్రి అయినది. ఈ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది. 
          అంతే కాక  ఎంతో ప్రాచుర్యం కలిగిన “చేత వెన్నముద్ద  చెంగలువ పూదండ”  పద్యం కూడా అన్నమయ్య సుదర్శన కృష్ణ శతకం లోనిదే. ఈ  శతకంలో కొన్ని పద్యాలు మాత్రమె లభించాయట.
          “చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ
                   బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
          కొండెప సిగముడి – కొలికి నెమలిపురి
                   ముంగురుల్ మూగిన – ముత్తియాలు
          కస్తూరికింబట్టు – కన్నులన్ కాటుక
                   చక్కట్ల దండలు ముక్కుపోగు
          సందిట తాయెతుల్ – సరిమువ్వ గజ్జెలు
          అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు
          కాళ్ళనందె – ఘల్లు ఘల్లు మనగ
          దోగి దోగి యాడ – తాళ్లపాకన్నన్న
          చిన్నికృష్ణ నిన్ను – చేరికొలుతు.
కాలానుగుణంగా ఈ పద్యం లో కొన్ని పాదాలు తగ్గి చిన్నపద్యం గా రూపుదిద్దుకుని తెలుగు తల్లుల నోళ్ళలో నాట్యం చేస్తూంది.
          స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో, శుభకార్యాలలో పాడుకునే అనేక విధాలయిన పాటలను రచించి, స్త్రీల పాటలకు ఉన్నత స్థితినీ, ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.  స్త్రీ జాతిని  ఇంతగా గౌరవించి,  స్త్రీల అభ్యు దయానికి  ఆరాటపడి,  ప్రత్యేకంగా స్త్రీల కోసం ఇంతమంచి సాహిత్యాన్ని కూర్చిన కవి, వాగ్గేయకారుడు, లక్షణకర్త అయిన అన్నమయ్యకు స్త్రీ జాతి ఎంతో ఋణపడి ఉంది.  ఆ మహా మహునకు ఇదే నా శతకోటి వందనాలు.
- పొన్నాడ లక్ష్మి 

1 comment:

  1. చాలా బాగా,క్లుప్తంగా,స్పష్టంగా వ్రాసినందుకు అభినందనలు!

    టీవీయస్.శాస్త్రి

    ReplyDelete