Sunday, 24 January 2016

శ్రీ పారుపల్లి సత్యనారాయణ - Sri Parupalli Satyanarayana



మా సంగీతం గురువుగారు శ్రీ పారుపల్లి సత్యన్నారాయణ గారు – నా అభ్యర్ధన మేరకు మా శ్రీవారు Pvr Murty (పొన్నాడ మూర్తి) వేసిన పెన్సిల్ చిత్రం.

శ్రీ సత్యన్నారాయణ గారి దగ్గర విశాఖలో రెండు సంవత్సరాలు అన్నమయ్య కీర్తనలు అభ్యసించాను. వారి బృందంతో కలసి తిరుమల కొండపై, ఒంగోలు లో వకుళమాత దేవాలయంలో అన్నమయ్య కీర్తనలు పాడే అదృష్టం కలిగింది.

వీరు మంచి గాయకులు, అంతకు మించి మంచి గురువుగారు. వారిది సంగీత కుటుంబం. వారి తాతగారు ప్రఖ్యాత సంగీత కళాకారులు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారు. వారి పినతండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రంగనాద్ గారు. .శ్రీ సత్యన్నారాయణ పాడిన కీర్తనలు కొన్ని youtube లో లభ్యం. youtube search లో Parupalli Satyanarayana అని టైప్ చేసి వారి కీర్తనలు వినవచ్చును.
 — with Pvr Murty.

Wednesday, 20 January 2016

సీత క్షేమమను శుభవార్త నేడు - సుందరకాండ


“సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలపకుండిన
నేటితోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా 
మమ్మీ తీరుగ ఉద్ధరించిన
మారుతికి ఏమివ్వగల” నని
సర్వమిదేనని – కౌగిట జేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు.


కౌగిలింతల దినోత్సవం సందర్భంగా నాకు గుర్తుకొచ్చిన సుందరకాండ పద్యం 

శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం



మహా వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజును స్తుతిస్తూ  రచించిన  కీర్తన. ఈ కీర్తన మైసూర్ వాసుదేవాచారి రచించినదని అనుకుంటున్నాను.  మా గురువుగారు వీణమీద చెప్పారు.
రాగం : కల్యాణి,  తాళం: రూపకం.
పల్లవి.   శ్రీమదాది త్యాగరాజ గురువరం. . నమామ్యహం.

అ.ప.    భూమిజా.. రమణ చరణ
          కమల భజన దురం ధరం...         !!శ్రీ!!
చ.       సకలలోక సంసేవిత  సంగీత సాహిత్య
          సారభరిత సులలితపద  సమ్మెళన సంశోభిత
మ.కా.సాహిత్యం:
          సంకీర్తన సురజన సముపార్జిత సత్కీర్తిం
          సురమునివర కారుణ్య సంజాత సుజ్ఞానం
          సామగానలోల వాసుదేవ హృదయ సుస్థితం
          సుజన హృదయ జలధి చంద్ర మమల వంశ సంజాతం
చి.స్వరం:
          సరినిరిని పదనిదమ| పగమరి గమనిదదా..|
          మగరినిదా రిగమనిదా| నిదమగమద గరినిదనిరి|
          దగరినిరీ| దరినిమదా| మగరి మగరి నిరి దగారి|
          సనిదరీ, సనిద పదనిస |రిమపద నిసరిగమపదని ||శ్రీ||

Wednesday, 6 January 2016

కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి- సులభుడిన్నిటా నిండే సుగ్రీవ నరహరి. - అన్నమయ్య కీర్తన






కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి- సులభుడిన్నిటా నిండే సుగ్రీవ నరహరి.

౧. కంభములోన పుట్టి కనకదైత్యుని గొట్టి – అంబరపు దేవతలకు అభయమిచ్చి
    పంబి సిరి తన తొడపై బెట్టుక మాటలాడి – అంబుజాక్షుడైనట్టి యాదిమ నరహరి.

౨. నానాభూషణములు ఉన్నతి తోడ నిడుకొని – పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
    మానవులకెల్లను మన్నన చాలా నొసగి – ఆనందముతో నున్నాడదిగో నరహరి.

౩.  మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతో అక్కజపు మహిమలను అలరుచు
    తక్కక శ్రీ వెంకటాద్రి దాపుకొని – జక్కదనములకేల్లా చక్కని నరహరి.

భావం:  కోరిన వరములను  సులభముగా నొసగే సుగ్రీవ నరసింహుని కొలువరో మొక్కరో!
          స్థంభములో పుట్టి హిరణ్యకశిపుని సంహరించి, ఆకసాన దేవతలందరికీ అభయమునిచ్చి, లక్ష్మీదేవిని తన తొడపై నుంచుకొని మాటలాడే అంబుజాక్షుడయిన నరహరిని కొలువరో!
          వివిధరకములైన ఆభరణములను ఉన్నతముగా ధరించి, ప్రేమతో ప్రహ్లాదుని అనునయించి, మానవులందరి కోర్కెలు తీర్చి ఆనందముగా నున్ననరహరిని సేవించరో!
          అమిత ప్రతాపముతో మించిన కాంతులతో గొప్ప మహిమలతో అలరుచూ, చక్కగా శ్రీ వెంకటాద్రి మీద నెలకొని చక్కదనములకెల్లా చక్కనైన నరహరిని కొలువరో!
         

పరిదానమిచ్చితే పాలింతువేమో - పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కృతి.



పరిదానమిచ్సితే పాలింతువేమో – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్.
రాగం బిలహరి - 29 మేళకర్త, శంకరాభరణ జన్యం. – మిశ్రజాతి ఝంపెతాళం.
ఆ: స రి గ ప ద స -  అ: స ని ద ప మ గ రి స.
ప.     పరిదానమిచ్చితే పాలింతువేమో  !!

అ.ప.  పరమపురుష శ్రీపతి నాపై నీకు
         కరుణ గల్గకయున్న- కారణమేమయ్యా  !!

చ.      రొక్కమిచ్చుటకు నే – ముక్కంటి చెలి గాను
         చక్కని చెలిని యొసగ – జనక రాజును గాను.
         మిక్కిలి సైన్యమివ్వ – మర్కటేంద్రుడ గాను
         అక్కటిక మెటుగల్గు – ఆది వెంకటేశ నీకు   !!

భావం:  నీకు పరిదాన(బహుమానం, లంచం) మిస్తే నన్ను కరుణిస్తావేమో! పరమపురుషా! శ్రీహరీ! నాపై నీకు కరుణ కలుగుటలేదు. కారణమేమయ్యా?

          ధనమును నీ కిద్దామంటే నేను కుబేరుడిని కాదు. చక్కని కన్యని ఇద్దామంటే నేను జనక మహారాజును కాను, మిక్కిలి సైన్యమిద్దామంటే నేను మర్కటేంద్రుడను (సుగ్రీవుడను) కాను ఇంకా నీ అనుగ్రహము నా కెలా కలుగుతుంది? ఆది వెంకటేశా! (వీరు తమ రచనలను వెంకటేశ ముద్రతో రచించిరి.)

Saturday, 2 January 2016

సమబుద్దే యిందరికి – సర్వవేద సారము.- అన్నమయ్య కీర్తన

2.1.15.ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. సమబుద్దే యిందరికి – సర్వవేద సారము.
సముడిందరికి హరి – సాధనమో యయ్యా !!
౧. చీమకు దన జన్మము – చేరి సుఖమై తోచు
దోమకు దన జన్మము – దొడ్డసుఖము.
ఆమని ఈగకు సుఖ – మా జన్మమై తోచు
ఏమిటా నెక్కువ సుఖ – మెవ్వరి కేదయ్యా! !!
౨. జంతురాసులకు నెల్లా – జననము లొక్కటే
అంతటాను మరణము – లవి యొక్కటే ,
చెంత నాహార నిద్రలు – స్త్రీ సుఖా లొక్కటే
ఇంతతా నిందుకంటే – నెవ్వరేమి గట్టిరయ్యా! !!
౩. ఇందులోన నెవ్వరైనా – నేమి శ్రీ వేంకటపతి
నందముగా దలిచిన – దది సుఖము.
ఎందు జూచినా నిత – డిందరిలో నంతరాత్మ
చందముగా నెవ్వరికి – స్వతంత్ర మేడయ్యా.. !!

భావము: సర్వ ప్రాణుల యెడ సమబుద్ధి కలిగి యుండుటయే సర్వవేదసారము. అందరిలో సముడైయున్నవా డొక్క శ్రీహరియే అందరికి ముక్తి సాధనమై యున్నాడు.
స్థూలదృష్టికి చీమ, దోమ మున్నగునవి అల్పప్రాణులుగా కనబడవచ్చును. కానీ చీమ తన జన్మమునే సుఖముగా భావించును. దోమకు తన పుట్టుకయే సుఖకరము. ఈగకు దాని జన్మమే సంపూర్ణ సుఖమైనదిగా అనిపించును. ఇందులో ఎవ్వరికి దేనివలన ఎక్కువ సుఖమున్నది? ఈ సుఖములో తారతమ్యమును నిర్ణయించుట కెట్టి అవకాశము లేదు కదయ్యా!
పుడమిలో జంతురాసు లన్నిటికీ జనన మరణములు ఒక్క తీరుననే యున్నవి. అట్లే ఆహారము, నిద్ర, కామసుఖము కూడా అన్నింటికీ సమానములే. ఇంతకంటే ఈ లోకమున ఎవ్వరేమి మూట గట్టిరయ్యా!
ఈ సృష్టిలో ఎవ్వరైనను సరే ! శ్రీ వేంకటేశ్వరుని చక్కగా స్మరించినచో వారి కదే నిజమైన సుఖము. ఎక్కడ చూచినను ఆ శ్రీహరే అందరికీ అంతరాత్మగా ఉండి సర్వము నడిపించుచున్నాడు. ఇంక ఎవ్వరికి మాత్రము ఏమి స్వతంత్రము కలదయ్యా!
జీవులు వారి వారి కర్మల కనుగుణముగా ఎన్నో జన్మలు దాల్చుచున్నారు. అన్ని ప్రాణులలోనూ అంతరాత్మగా నున్నవాడు పరమాత్ముడొక్కడే. కావున జ్ఞానులు సర్వత్ర సమభావమునే కలిగియుందురు. అజ్ఞులు మాత్రమె జీవులలో ఎక్కువ తక్కువలను పరిగణింతురు. సమస్త వేదములు ఎల్లెడల సమబుద్ధినే బోధించుచున్నవి. ఇట్టి సమబుద్ధిని కలిగి యుండవలెనని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోదించినాడు.

Tuesday, 29 December 2015

పురందర దాసు


హంపీ పర్యటనలో శ్రీ పురందరదాసుగారి భజన మంటపము దర్సించాము. విశాలమైన మంటపము తుంగభద్రా నదీ తీరములో ఉంది. అక్కడ కూర్చుని పురందరదాసుగారు విఠలుని మీద కీర్తనలు రచించి పాడుకొనే వారుట. అక్కడ వారి చిత్రము రాతిమీద చెక్కబడి ఉంది. అది చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ మహావాగ్గేయకారుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు పొందుపరిచాను.
శ్రీ పురందర విఠల దాసు (కర్నాటక సంగీత పితామహ).
వీరు పదహారవ శతాబ్ధమువారు. పాండురంగ విఠలుని భక్తులు. సంగీత సాహిత్యములలో ప్రావీణ్యము గలవారై ఒక్కొక్క సమయమునందు వీరు రచించిన కీర్తనలచే శ్రీ పాండురంగ విఠలుని కటాక్షమును పొందిన వారై ఉండిరి. సంగీతములో మాయామాళవగౌళ రాగములో ప్రారంభకులకు అనువుగా ఒక క్రమములో స్వరావళి, జంటస్వరములు, అలంకారములు, గీతములు, సూళాదులు, ప్రబంధములు రచించిరి. కర్నాటక సంగీతమును క్రమబద్ధీకరణ చేసి, సంగీత విద్యార్ధులకు అందజేసినందువలన వీరికి కర్నాటక సంగీత పితామహుడు అన్న బిరుదు లభించినది. వేదోపనిషత్తులు జనులకు బోధించిరి. వీరి కీర్తనలు ఎక్కువగా వేదాంతపరముగా నుండును.
- పొన్నాడ లక్ష్మి