Saturday, 25 May 2019

తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన

ఈ త్రిభువనాలలో శ్రీహరిని మ్రొక్కని వారెవరు? మునులు, ఋషులు నీకై ఎన్నో సంవత్సరములు కఠోర దీక్షతో తపమాచరించారు. కొందరు సప్త ఋషులలో స్థానం సంపాదించారు. కొందరిని రకరకాల పరీక్షలకు గురి చేస్తావు. కొందరిని వెంటనే అక్కున చేర్చుకుని కైవల్యం ప్రసాదిస్తావు. ఏదైనా వారి జన్మ కర్మలు పరిపక్వం కానిదే మోక్షం రాదు గదా స్వామీ! మానవులనే కాదు జగత్తులో ఉన్న అన్ని జంతువుల ఎడ ప్రేమ చూపిస్తావు. నీవు జగత్పాలకుడవు శ్రీనివాసా! అంటూ ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.

కీర్తన:

పల్లవి: తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా ॥పల్లవి॥

చ.1 ధరణీధర మందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁగాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా ॥తగు॥

చ.2 భవహర మురహర భక్తపాపహర
భువన భారహర పురహరా
కవిసిన వురుతను గద్దను మెచ్చితి-
వివల నీదయకు నివియా గురుతు ॥తగు॥

చ.3 శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా ॥తగు॥
(రాగం: ధన్న్యాసి, సం.2. సంకీ.315)


మునులు, ఋషులు ఎన్నో సంవత్సరాలనుండి తపమాచరించగా మోక్షం ప్రసాదించావు. ఆకాశాన్ని ఎత్తగలిగిన, అంటగలిగిన సామర్ధ్యం ఉన్నవారైనా వారి వారి జన్మ కర్మ బంధం పరిపక్వం కానిచో వారికి కైవల్యం ప్రసాదించవు.

ఈ భూమండలాన్ని పాలించే నాధా! మందరపర్వతం ఎత్తినవాడా! అత్యంత అరుదైన కౌస్తుభమనే ఆభరణమును ధరించిన శ్రీధరా! ఏనుగును రక్షించావు. కాకినీ రక్షించావు. నీ కరుణకు పాత్త్రము గాని జీవి ఈ సృష్టిలో ఉన్నదా!

ఓ శ్రీనివాసా! జనన మరణాలు లేనివారిగా చేయగల శక్తియుతుడా! మురాసురుని చంపిన ధీరుడా! ఈ భూమండలంపై ఉన్న జీవుల భారం వహించే వాడా! త్రిపురాసురుని జయించిన వాడా! నీకొరకు తపించిన ఉడుతను, గ్రద్దను మెచ్చి కైవల్యం ఇచ్చావు. నీదయకు గుర్తులు ఇవేనా స్వామీ!

శ్రీవేంకటేశ్వరా! శేషవాహనం పైన శయనిస్తూ, గరుడవాహనం పైనా పయనిస్తూ, ఈ భూమండలానికి అధిపతిగా ఉన్నావు. సకల చరాచర భూతములను రక్షిస్తున్నావు. గోవులను కాచావు. కోతులతో తిరిగావు. నీ పావనమైన కృపకు అన్నీ నోచుకున్నాయి స్వామీ!

విశ్లేషణ: శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య

No comments:

Post a Comment