Saturday, 18 May 2019

అందుకే పో నీ పై నాశపుట్టి కొలిచేది - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన
అందుకే పో నీ పై నాశపుట్టి కొలిచేది
మందిలిచితి నిక మరి నీ చిత్తం ॥
ఇందరు జెప్పగా వింటి ఎవ్వరికైనా విష్ణుడే
కందువ మోక్ష నియ్య గర్త యనగా,
ముందే వింటి నారదుడు ముంచి నిన్ను బాడగా
పొందుగ లోకములోన బూజ్యుడాయ ననుచు ॥
అప్పటి వింటి లోకము లన్నిటికీ హరియే
కప్పి రక్షకత్వానకు గర్త యనగా,
ఇప్పుడె వింటి ధృవుడు ఇటు నిన్ను నుతించే
ఉప్పతిల్లి పట్టమేలు చున్నాడనుచును ॥
ఇదె వింటి శ్రీ వేంకటేశ బ్రహ్మపు దండ్రివై
కదిసి పుట్టించ దెంచ గర్త ననుచు,
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలో బ్రసిధ్ధుడాయెననుచు ॥
భావం :
దేవా ! నిన్ను భజించిన వారికెందరికో నీవు పూర్వము మేలుచేసితివని విన్నాను. అందువలన నీ సేవ వ్యర్ధము కాదని నమ్మినాను. అందుకే నీపై ఆశపుట్టి నిన్ను సేవించుచున్నాను. నీతో నా నమ్మకమును సవినయముగా మనవి చేసుకునుచున్నాను.
ఇక నీ చిత్తము.
ఎవరికైనను మోక్షమిచ్చుటకు విష్ణుడొక్కడే ముఖ్యకర్త అని ఎందరో చెప్పుచుండగా వింటిని. నారదుడు భక్తితో నీ నామములు కీర్తించి లోకములో పూజ్యుడైనాడని ముందే వింటిని.
లోకముల్లనిటికీ శ్రీ హరియే రక్షణ చేకూర్చు కర్త. గాని ఇతరులు కారని అప్పుడే వింటిని. ధృవుడు నిన్ను స్తుతించియే మహోన్నతుడై శాశ్వతమైన పట్టమును ఏలుచున్నాడని ఇప్పుడే వింటిని.
శ్రీవేంకటేశ్వరా ! నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రివై లోకములను పుట్టించుటకును పోషించుటకును ముఖ్య కర్తవుగా
ఉన్నావని ఇదిగో ఇప్పుడే వింటిని. అంతేకాదు, వాల్మీకి మహర్షి నీ మీద కావ్యము చెప్పి ఆదిమునీంద్రులలో అగ్రేసురుడైనాడని కూడా వింటిని

వ్యాఖ్యాత : సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మనయ్య

No comments:

Post a Comment