Saturday, 8 June 2019

అదేనంటా వచ్చే నారగించలేదింకా వాడవార చేడలాల వనజాక్షు జూపరో - అన్నమయ్య కీర్తన


అదేనంటా వచ్చే నారగించలేదింకా
వాడవార చేడలాల వనజాక్షు జూపరో.  !!

మందనున్న పసులాల మంచిగోపబాలులాల
కందర్పగురుడు వచ్చె గంటిరా మీరు
కెందమ్మివనములాల కృష్ణుడు యమునలోన
చింద్ల నీడాడునట చెప్పరో సుద్దులు.             !!

గొల్లవారిఇండ్లాల గొందిపాలువెన్నలాల
కొల్ల అదే హరి వచ్చె గొండించరో
చల్లలమ్మే సతులాల సరసపురచ్చలాల
ఇల్లీడ నేడనున్నాడో యెరిగించరో                 !!

గోవర్ధనముదండ గుంపులపూ బొదలాల
కోవిదుడేమిసేసీ గుట్టు చూపరో
శ్రీవేంకటాద్రి మీద జేరి కంటుమింతలోనె
పూవువలె నెత్తుకొంటి భోగించీ నింకను.         !!

భావమాథుర్యం..
          ఈ కీర్తనలో అన్నమయ్య యశోదమ్మ కన్నయ్య కోసం వెదుకుతూ గోపెమ్మలను అడుగుతూ ఆరాటపడడం వివరించాడు.

          గోవర్ధనగిరిపైనున్న పూపొదలను, గోపబాలురను, తామర సరస్సులను, గొల్లవారిండ్లలో నున్న పాలు వెన్నలను, చల్లలమ్మే సతులను, గోవర్ధనగిరిపై పూపొదలను, మా చిన్నారి కృష్ణయ్య ఆడుకుంటానని ఇటువేపు వచ్చాడు. ఇంతవరకూ అన్నం కూడా తినలేదు. ఎక్కడున్నాడో కాస్త చూడండమ్మా.. అని యశోదమ్మ బతిమాలుతోంది.

మందలోనున్న పశువుల్లారా! మంచి గోపబాలుల్లారా! మన్మథుని తండ్రి అయిన హరి ఇటు వచ్చాడా? మీ కంట బడ్డాడా? ఎర్రతామరపూలున్న సరస్సుల్లారా తామరపూలకోసం మీ దగ్గరికి వచ్చాడా? ఈత కొట్టడానికి బయలుదేరాడట. యమునా నదిలో లేడు. వాని సంగతి మీకు తెలుసా? వానికి కాస్త మంచిబుధ్ధులు చెప్పి ఇంటికి రమ్మనరో..

గొల్లవారిండ్లలో బానలందున్న పాలూ, వెన్నలూ కొల్లగొట్టడం కోసం కన్నయ్య వస్తే కాస్త నా దగ్గరికి తీసుకువచ్చి పట్టించవచ్చు కదా! చల్లలమ్మే సతులారా! రచ్చబండలమీదసంభషణలు జరిపే పెద్దలారా! ఇక్కడెక్కడో ఉన్నాడట! కాస్త ఎరిగించడమ్మా! గోవర్ధన సమీపముననున్న పూపొదరిళ్ళలారా! ఆ గ్రంథసాంగుడు కృష్ణయ్య ఇక్కడే ఎక్కడో రహస్యంగా దాగి ఉన్నా కాస్త నాకు చూపించమేలు చేయండి. శ్రీవేంకతాద్రినెకి చూస్తే ఇదిగో ఇక్కడే వానిని చూసాము. పూవుల అతని నెత్తుకున్నాను. ఇంక ఊరుకుంటాడా.. గారాలు మొదలుపెట్టాడు.




No comments:

Post a Comment