చెంగట నీవే యిది చిత్తగించవయ్యా ॥పల్లవి॥
కలికి నిన్నుఁ దలఁచి గక్కున లోలోఁ గరఁగి
జలజలఁ జెమరించి జలకమాడె
బలుతమకాన నీకుఁ బక్కన నెదురువచ్చి
నిలువునఁ గొప్పువీడి నీలిచీర గప్పెను ॥అంగ॥
సుదతి నిన్నుఁ జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాఁకాఁ బూసె గంధము
మదనమంత్రములైనమాటల మర్మము సోఁకి
ముదురుఁబులకలను ముత్యాలు గట్టెను ॥అంగ॥
గక్కన గాఁగిట నిన్నుఁ గలసి యీమానిని
చొక్కి చంద్రాభరణపుసొమ్ములు వెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలఁబాలు వోసెను ॥అంగ॥
భావం..
ఈ కీర్తనలో అన్నమయ్య అలమేలుమంగమ్మ విరహాన్ని స్వామికి విన్నవిస్తున్నాడు. అలమేలుమంగ కు విరహమే సింగారమయ్యింది.ఇక నీవే చిత్తగించవలనయ్యా..!
నీ అందమైన భార్య నిన్ను మనసులో తలచుకోగానే ఆ వెచ్చని తలపులకు సున్నితమైన శరీరం లోలోపలే కరిగిపోయి, చెమటలు పట్టి ఆ చెమటల్లో స్నానం చేసినట్టుంది. నీపై తమకంతో నీ ఎదురుగా వచ్చేటప్పటికి నిటారుగా పెట్టుకున్న కొప్పును విడదీసి నల్లని పొడవాటి జుట్టుతో తన శరీరమంతా చీరలా కప్పేసింది. (ఆయనంటే సిగ్గు మరి .. మన్మధుని తండ్రి కదా ! ఎలాగూ ఆ కొప్పు కాసేపు పోతే ఉండదని ఆమెకు తెలుసు).
నీ ఆలోచనల్లో ఉండి సుదతి అయిన ఆమె సిగ్గులతో ఎరుపెక్కిన చెక్కిళ్ళపై ఎక్కువగా గంధాన్ని పూసింది. నీ శృంగారపు మాటలలో ఉన్న లోతైన అర్ధాన్ని పసిగట్టి, ఆమె మేను పులకరించి చెమట బిందువులన్నీ ఆమె శరీరమంతా ముత్యాలు పేర్చినట్టుగా ఉంది.
అభిమానం కలిగిన ఆ పడతి వెంటనే నీ కౌగిట్లో కలిసిపోయి, పరవశంతో నీ మెడలో చంద్రాభరణంలా ప్రకాశించింది. ఆపై అలమేలుమంగ నీ ఉరముపైకి చేరి నీపై మురిపంపు సరసాలు అనే తలంబ్రాలు పోసింది
No comments:
Post a Comment