Thursday, 8 June 2017
తాపలేక మేడలెక్క దలచేము - అన్నమయ్య కీర్తన.
తాపలేక మేడలెక్క దలచేము
ఏపులేని చిత్తముతో ఈహీహీ నేము.
ఎరుకమాలినబుధ్ధి యెవ్వరైనా బతులంటా
తెర గెరగక వీధి దిరిగేము
పర చైన జవరాలు పరులెల్లా మగలంటా
వొరపు నిలిపిన ట్లోహోహో నేము.
యిందరును హితులంటా యెందైనా సుఖమంటా
పొందలేని బాధ బొరలేము
మందమతివారు ఎండమావులు చెరువులంటా
అందునిందు తిరిగిన ట్లాహా హా నేము.
మేటి వెంకటేశుబాసి మీద మీద జవులంటా
నాటకపు తెరువులు నడిచేము.
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా
యేటవెట్టి యేగిన ట్లీ హీ హీ నేము.
ఓ వేంకటేశా! మేము - మెట్లు లేకుండానే మేడలు ఎక్కదలుచుకొనే తెలివి తక్కువవాళ్ళం. ముందు ఏమి జరుగుతుందో అనే బాధ మనస్సులో కొంఛెం కూడా లేకుండా ఇహిహి (నవ్వునందు అనుకరణ ద్వని, వెకిలి నవ్వు) అని నవ్వుతూ ఉంటాము.
తెలివి కొంచెం కూడా లేకుండా, చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరికయినా బదులు (మాటకి మాట) చెపుతూ మార్గమేదో తెలియక వీధులలో తిరుగుతుంటాము. ఓ హో హో ! ఇది ఎట్లా ఉందంటే కులట అయిన పడుచు స్త్రీ పరాయిమగవాళ్ళను తన భర్తలుగా విలాసంతో నిలిపినట్లు ఉంది.(ఆ ధూర్తురాలికి ఉచ్ఛనీచాలు ఎలా తెలియవో మాకు కూడా ఎవరితో ఎలా మెలగాలో తెలియదని భావం)
వీరందరూ నా మేలుకోరేవారు అనుకుంటూ, ఎక్కడయినా సుఖము ఉందని భావిస్తూ కలుగకూడని, పొందకూడని బాధలలో పొర్లుతుంటాము. ఆ హా హా! తెలివితక్కువవాడు ఎండమావులను చూచి చెరువులనుకొని భ్రాంతితో అటు నిటు తిరిగినట్లు మేము కూడా సుఖాల భ్రాంతిలో తిరుగుతుంటాము.
గొప్పవాడయిన వేంకటేశ్వరుని విడిచిపెట్టి ఇంకా ఇంకా రాను రాను ఏవో రుచులున్నాయని భావిస్తూ అసత్యపు మార్గాలలో నడుస్తూ ఉంటాము. ఇహిహి!(నవ్వుత యందు అనుకరణ ద్వని) దూరంగా ఉన్న కొండలన్నీ నునుపని తలచుచూ గూట్లో ఉన్న దీపంలో వాటిని చూస్తూ ఆనందిస్తూంటాము. (గూట్లో ఉన్న దీపంతో దూరంగా ఉన్న కొండలను చూస్తే అవి నునుపుగా కనిపిస్తాయి).
ఈ అసత్యపు మార్గాలకు మన జీవితాలను బలిపెట్టి (ఏటవెట్టి) ఆ మార్గాలలో మనం వెళ్ళిపోతుంటాము. దగ్గరగా ఉన్న గొప్పవాడయిన వేంకటేశ్వరుని విడిచిపెట్టామని అన్నమయ్య ఆవేదన.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment