Monday, 26 June 2017

చారు





‘చారు’ అంటే పూర్తిగా ఆంధ్రులదే అని చెప్పుకోవాలి. కొంచెం చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారు చేసే ఆరోగ్యకరమయిన, రుచికరమయిన వంట ‘చారు’! ఎన్ని వంటాకాలున్న ఆఖరికి మజ్జిగా అన్నం ముందు చారు అన్నం తిననిదే భోజనం పూర్తి అయినట్లు అనిపించదు.

ఓ సారి సినారె గారు అమెరికా వెళ్ళినప్పుడు వారి బంధువుల ఇంట్లో భోజనాల సమయంలో ‘రైస్’, ‘కర్రీ’. ‘కర్డ్’ వంటి ఆంగ్ల పదాలే వినిపించాయిట! ఒక్కటయినా తెలుగు పదం వినిపిస్తుందా అని రెడ్డి గారు ఆలోచిస్తూ వుంటే ఆ ఇంటి వాళ్ళ పాప ‘చారు’ అని అడిగిందట. ‘హమ్మయ్య, చాలు’ అనుకున్నారట. అన్నింటికీ పరభాషా పదాలు ఉన్నాయిగాని మన తెలుగింటి వంటకం ‘చారు’ కి మాత్రం లేదు.

చారుల్లో కూడ పప్పు చారు, టమాటో చారు, ఉలవ చారు, నిమ్మకాయ చారు, మిరియాల చారు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. జలుబు చేసినప్పుడు మిరియాల చారు ఘాటుగా గొంతు దిగుతూ ఉంటే ఎంతో ఉపశమనంగా వుంటుంది. ఎక్కడయినా రెండు రోజులు విందు భోజనం చేసి ఇంటికి వచ్చాక కమ్మగా కొంచెం చారు అన్నం తింటే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. చారుకి పోపు వేస్తె ఇల్లంతా ఆ ఘుమఘుమలే .. !! ఇంక కుంపటిమీద సత్తుగిన్నెలో కాచిన ‘ఆ రుచే వారు’ అంటారు బాపు గారు.. ఆ అనుభూతి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది.

చాలామంది తెలుగువారికి చారంటే మహా ఇష్టం .. మా చిన్ని మనవరాలికి కూడానూ. ‘చారే కదా’ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొందరు. అది కూడా కొందరి చేతిలోనే రుచి పడుతుంది సుమండీ!

మాత్రుహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,
శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం !!
తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.

ఇంతటి మహత్తరమయిన చారు అంటే కొందరికి ఎందుకో చులకన?
.. పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment