Thursday, 8 June 2017

చాలు చాలు నీ జాజర నన్ను - జాలి బరచె నీ జాజర. - అన్నమయ్య కీర్తన.


చాలు చాలు నీ జాజర నన్ను - జాలి బరచె నీ జాజర. ॥
వలపు వేదనల వాడెను యీ - తలనొప్పులచే దలకేను
పులకల మేనితో బొరలేను కడు - కలిగొని చల్లకు జాజర ॥
ఒల్లని నినుగని వుడికేను నీ - చిల్లర చేతల జిమిడేను
కల్ల గందవొడి గా గేనుపై - జల్లకు చల్లకు జాజర. ॥
తివిరి వేంకటాధిప నేను నీ - కవుగిట కబ్బితిగడు నేను
రవ రవ చెమట గరగినేడు యిదె - చవులాయెను నీ జాజర ॥
వేంకటేశునితో ఆత్మీయత పెంచుకొనే మధురభక్తి అనే రహదారిలో అన్నమయ్య ఒక నాయకిగా మారిపోయాడు.
ఆయనతో మాటలతో ఆడుకొన్నాడు, పాడుకొన్నాడు. చివరలో ఆయనలో తాను కరిగిపోతున్నానని మురిసిపోయాడు. దేవునితో ఆత్మీయంగా మసలగలిగితే ఆయనలో ఐక్యమయిపోవడం ఎంత సులువో నిరూపించాడు.
బాబూ! తిరుపతి సామీ! నీ జాజర చాలు. జాజర అంటే ఏమిటో తెలియనట్టు అడుగుతున్నావా? జాజర అంటే మోసం, వంచన. నీకు అలవాటయిందే కదా స్వామీ! నీ జాజర నన్ను దుఃఖ పెట్టింది, బాధ పెట్టింది. ఇక చాల్లే..
వలపు వేదనలతో వాడిపోతున్నాను. ఇదివరకు ఎంత కాంతిగా ఉండేదాన్నో.. తమరు చేసిన తలనొప్పు పనులతో వణికిపోతున్నాను. ముందు ముందు ఇంకా ఎలాంటి వేషాలు వేస్తావో అని భయపడి పోతున్నాను. నా ఖర్మ! నా మటుకు నేను అంటూనే ఉంటాను. దొంగ వేషాలు వేసి నన్ను కౌగలించుకొని పారిపోతావు. ఆ తరువాత ఆ పులకరింతలు ఆగి చావవు. నీకు దూరమై ఈ పులకల శరీరంతో పక్కమీద అటూ, ఇటూ దొర్లుతున్నాను.
సరిగ్గా ఇప్పుడే సమయం కుదిరిందా నీకు? అతిశయించిన ఉత్సాహంతో జాజర -రంగుల ఉత్సవం - చల్లుతావేమిటీ?
నీ తప్పులు క్షమించి దగ్గరకు నీ పక్కకు వచ్చినా నన్ను ఒల్లవు. ఇష్టపడవు. అలాంటి నిన్ను చూసి ఉడికిపోతున్నాను, ఏమనుకున్నావో? కనపడకుండా ఎన్ని చిన్ని చిన్ని పనులు చేస్తావో నా తండ్రీ! నీ చిల్లర చేతలు ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుతో చితికిపోతున్నాను.
గంధపుపొడి చల్లుతావేమిటి? అది నీ అబధ్ధాల సుగంధము కలిపిన గంధపు పొడి. అది మీద పడుతుంటే చల్లదనం కాదు. ఒళ్ళు మండిపోతూంది. ఆ గంధపు పొడి మీద చల్లకు.
ఓ వేంకటాచలపతీ! ఇదుగో! ఈ రోజు నీ కౌగిలిలో చెమటలు మిల మిలా మెరిసిపోతుండగా కరిగిపోయాను. ఆలోచించి ప్రయత్నపూర్వకముగా త్వరపడి, నేను నీ కౌగిలిని దక్కించుకున్నాను. ఇందాకటినుంచి ఏదో అన్నాను కానీ - ఏమనుకోకు. నీ చేతలు, రంగులు చల్లే ఉత్తుత్తి మోసాల కార్యక్రమం బాగానే ఉంది.
మహిళల మనసుని అన్నమయ్య ఎంతబాగా అర్ధం చేసుకున్నాడో చూడండి.
సంకలనం, వ్యాఖ్యానం డా॥ తాడేపల్లి పతంజలి గారు
 సేకరణః పొన్నాడ లక్హ్మి

No comments:

Post a Comment