Thursday, 8 June 2017

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు - అన్నమయ్య కీర్తన.


వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు
ఇర్రి దీము భోగముల నెనసేము

మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక
పొరి బరిమళములు పూసేము
పరగ పునుకుతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

పుక్కిట పంచేంద్రియపు పుట్టు పుట్టి యందరిలో
మొక్కించుక దొరలమై మురిసేము
అక్కరనజ్ఞానమనే అంధకారమున నుండి
దిక్కుల నెదిరి వారి దెలిపేము.

దినసంసారమే మాకు దేవుడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీ వేంకటేశ! మమ్ము గావగాను
 తనిసి తొల్లిటిపాటు దలచేము.

ఒకతనికి వెర్రి(పిచ్చి) బాగా వచ్చింది. నాకు వెర్రి తగ్గిపోయిందని అతగాడు చెపుతూ - రోకలిని తలకు చుట్టమన్నాట్ట. అంటే వాడి వెర్రి ఏ మాత్రం తగ్గలేదని అందరికీ స్పష్టమౌతుంది. వెర్రి తగ్గితే రోకలిని తలకు చుట్టమంటాడా?

ఆ రకంగానే ఓ వేంకటేశా! మేము కూడా ఈ లోకంలో ఎండమావుల్లాంటి భోగాలకోసం తెగ తాపత్రయపడతాం. ఎండమావుల్లో నీరు కనబడుతుంది కానీ అంతా భ్రాంతి. అలాగే మా భోగాల్లో సుఖమనే భ్రాంతి కనబడుతుంది. ప్రతీ భోగం ఈ శరీరానికి కొంతకాలానికి దుఃఖ కారణమే. కనుసైగ చేస్తే చాలు పదులకొద్దీ సేవకులుండే భోగము. కానీ అలాగే కూర్చొని సేవలందుకొంటుంటే ఊబకాయం, రక్తప్రసరణ సమస్యలు .. ఇలా ఎన్నో.. ఈ రకంగా ప్రతీభోగం కూడా రాను రానూ దుఃఖాంతమే కాబట్టి భోగాన్ని ఎండమావితో పోల్చాడు అన్నమయ్య.

వేంకటేశా! ఈ మురికి శరీరాన్ని మోస్తూ, అసహ్యం లేకుండా శరీరపు మూలలలో బాగా సువాసనలు, సుగంధ ద్రవ్యాలు దట్టిస్తాం. ఈ తలపుర్రెను (కపాలాన్ని) బాగా అలంకరిస్తాము. ఎంతో ఆసక్తితో ప్రతిరోజు నీటిలో ముంచుతాము. (ఠపీమని పేలిపోయే ఈ కపాలానికి తలంటి పోసి,  సుగంధపు నూనెల మర్దనలు చేసి చక్కగా అలంకరిస్తామని అన్నమయ్య భావన).

కన్ను, ముక్కు, చెవి మొదలైన అయిదు ఇంద్రియాల శక్తిని వ్యర్ధం చేసుకుంటున్న జన్మ పొందాము. ఇతరులచేత దండాలు పెట్టించుకొని మేము పెద్దదొరలమని మురిసిపోతుంటాము. కోరికలతో అజ్ఞానమనే చీటిలో ఉండి ఇతరులకు పెద్ద తెలిసినవాళ్ళలా నీతులు చెపుతుంటాము. మనకే అంతా తెలుసునని గర్వం అజ్ఞానం

వేంకటేశ్వరా! ప్రతిరోజూ చేసే సంసారంలోనే నువ్వు దేవుడవని కొలిచి ముక్తిని పొందకుండా గొప్ప ముక్తి ఎక్కడో ఉన్నదని వెతుకుతుంటాము. సాటిలేని విధంగా నీవు మమ్మల్ని రక్షిస్తుంటే  పూర్వజన్మ పాపాలను తలుచుకుంటూ కుములిపోతుంటాము. ఏ కష్టం వచ్చినా స్వామీ! నీదే భారమని ఆయనను శరణు పొందాలని అన్నమయ్య భావన.

(అన్నమయ్య మృగతృష్ణ (ఎండమావి) కి తెలుగులో ఇర్రి దీము అని పేరు పెట్టాడు. మృగానికి ఇర్రి అని పేరు ఉంది. కనుక మృగతృష్ణ ని అన్నమయ్య 'ఇర్రి దీము' అన్నాడు).

వ్యాఖ్యానం.. డా. తాడేపల్లి పతంజలి. సేకరణః పొన్నాడ లక్ష్మి.

No comments:

Post a Comment