Thursday, 8 June 2017

నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే - అన్నమయ్య కీర్తన.

నీవే సేసిన చేత  - నీవే చేకొనుటింతే
ఈవల నీ సొమ్ము నీకే  - యియ్య సిగ్గయ్యీ నయ్యా!

ఆలుబిడ్డలఁగని - యటు దన మగనికి
సీలాన సమర్పణము నేయవలె నటయ్యా,
తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు
యే లీల సమర్పించే - విందుకే నవ్వు వచ్చీనయ్యా!

అంకెల గన్నకొడు - కటు దమ తండ్రికిని
తెంకి నీ వాడవని - తెలుపఁగవలె నటనయ్యా,
నా లోపల నున్న లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా!

తన నీడ యద్దములోఁ - దానె యటు చూచి
పనివడి ఊరకే - భ్రమయువలె నటయ్యా,
అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలయ్యా!

దేవా! నే నొనర్చు పనులన్నియు నీ ప్రేరణచే కలిగినవే. నా స్వరూపముకూడ నీ కల్పనయే. నీ వస్తువులను నీవే చేకొనవలను గాని ఇతరులు నీకీయవలసిన పనిలేదు. కాబట్టి నీ సొమ్మును నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను మిక్కిలి సిగ్గుపడుతున్నానయ్యా!

సతి పతితో కాపురముచేసి బిడ్డలను కన్నది. ఇక ఆ బిడ్డలు ఆయనకు చెందినవారే కదా! ఈ బిడ్డలను నీకు సమర్పించుచున్నాను అని ఆమె వారి నతనికర్పించవలెనా?   దేవా! నేనెన్నొ పుణ్యకార్యములు నీ ప్రేరణచే చేయుచున్నాను.  అవి నీకు చెందినవే గాని నావి కావు. నీ పుణ్యములను మరల నీకే నేనెట్లు సమర్పింపగలను? ఈ వింతపనికే నాకు నవ్వు వచ్చుచున్నదయ్యా!

తండ్రిచెంత నున్న కొడుకు ఆయనతో 'నేను నీ కుమారుడను' అని తెలుపుకొనవలసిన పని ఏమున్నది? నాహృదయములో ప్రభువువై నన్నేలుచున్న లక్ష్మీశ్వరా!నేను నీకు పొందికైన బంటునని వేరే చెప్పుకొనవలెనా? అట్ట్లు చెప్పినచో అది పునరుక్తియే కదా!

తన నీడను తానే అద్దములో చూచుకొని ఎవరో మరొకరు అందున్నారని ఊరక భ్రమపడుట తగునా?  ఓ ప్రియమైన శ్రీ వేంకటేశ్వరా! నా అత్మలో నీవున్నావు.  నిన్నుజూచి ఆనందించి  నీకు నేను శరణాగతుడనైతిని.  మరల ప్రత్ర్యేకముగా నీవెందో ఉన్నావని తలచి అక్కడ నీకు పూజలొనర్చ వలెనా?

జీవులు స్వతంత్రులు  కారు. జీవులొనర్చు సత్కర్మలు దేవుని ప్రేరణాఫలములే.. అందరి హృదయపీఠముల నధిష్ఠించిన ప్రభువు ఆ పరమాత్ముడొక్కడే. కావున సర్వదా భగవత్భావనతో జీవుడు పవిత్రుడు కావలెను. అని అన్నమయ్య భావము.

వ్యాఖ్యానంః సముద్రాల లక్ష్మణయ్య. ఎం.ఏ.      సేకరణః పొన్నాడ లక్ష్మి.

No comments:

Post a Comment