Friday, 18 December 2015

పెంచంగఁ పెరిగినవా పృథివిపైఁ కొండలు - పెద తిరుమలయ్య నీతి శతకం



పెంచంగఁ పెరిగినవా పృథివిపైఁ కొండలు
          విత్తిరా యడవులు వివిధగతులఁ
గాలువల్ వెట్టిరా ఘన సముద్రములకు
          నేతంబు లెత్తిరా యేరులకును
మేతలు వెట్టిరా మృగములకెందైన
          మరియీఁత నేర్పిరా మత్స్యములకు
పెండిండ్లు సేసిరా బెరయబక్షులకును
          బూసిరా వాసన పుష్పములకు
నెవ్వ రెవ్వరిఁ బోషించి రించి చూడఁ
దలఁప నీదైన రక్షకత్వమునఁగాక
కలిత లక్ష్మీశ! సర్వజగన్నివేశ!
విమల రవికోటి సంకాశ ! వేంకటేశ!

భావం: శ్రీ వేంకటేశ్వరా! ఎవరో పెంచితే పెరిగినవా భూమి మీద కొండలన్నీ? రకరకాలుగా ఎవరైనా విత్తనాలు వేస్తె పెరిగినవా ఈ అడవులన్ని? కాలువలు పెట్టారా ఎవరైనా గొప్ప సముద్రాలకు? ఏతములెత్తి నీరు పారించారా నదులకు? తిండి పెట్టారా మృగాలకు? ఈత నేర్పారా చేపలకు? పెండ్లిండ్లు చేసేరా అసంఖ్యాకమైన పక్షులకు? పూశారా సుగంధాలు పుష్పాలకు? ఆలోచిస్తే ఎవరు ఎవరిని పోషించారని? లేదు. స్వామీ! శ్రీ వేంకటేశ్వరా! బాగుగా విచారిస్తే ఇవన్నీ నీ రక్షకత్వంలో జరిగినవే.
          చాలా మనోజ్ఞమైన పద్యం ఇది. చెప్పిన రీతి ఎంతో రమణీయంగా ఉన్నది. ఈ ప్రకృతికీ, ఈ జీవులకూ భగవంతుడైన శ్రీ వేంకటేశ్వరుడే ఆత్మ. సర్వాధారుడూ, సర్వపోషకుడూ, సర్వరక్షకుడు ఆ పరమాత్ముడే. లెస్సగా విచారిస్తే అన్నీ సృష్టి స్థితి లయ కారకుడైన ఆ దేవుని లీలావిభూతియే. ఆ స్వామి సంరక్షణలోనే ప్రకృతి సర్వం ప్రఫుల్లమై శోభిస్తున్నది. సర్వప్రాణుల జీవనాదులకు హేతువులైన ధారక పోషక భోగ్యపదార్ధాలను ఇచ్చి పాలించి, పోషించేవాడు శ్రీ మహావిష్ణువు.  

No comments:

Post a Comment