ప. గోనేలే కొత్తలు - కొడెలేప్పటివి
నానిన లోహము – నయమయ్యీనా ? !!
1. మున్నిటి జగమే – మున్నీటి లోకమే
ఎన్నగ బుట్టుగు – లివె వేరు,
నన్ను నెవ్వరు – న్నతి బోధించిన
నిన్న నేటనే – నే నెరిఁగేనా . !!
2. చిత్తము నాఁటిదె – చింతలు నాఁటివె
యిత్తల భోగము – లివె వేరు,
సత్తగు శాస్త్రము – ఛాయ చూపినా
కొట్టగా నేనిఁక – గుణి నయ్యేనా. !!
3. జీవంతరాత్ముఁడు – శ్రీ వేంకటేశుఁడే
యీవల భావన – లివె వేరు,
దావతి కర్మము – తప్పఁదీసినా
దైవము గావక – తలఁగీనా. !!
భావము:
పైన కప్పిన గోనెలే (శరీరములే) కొత్తవి, గాని కోడెలు (ఆత్మలు) పాతవే .
ఇనుము నెంతగా నీట నానబెట్టినను దాని సహజస్వభావమైన గట్టిదనము వీడి మెత్తబడదు కదా!
ముందునుంచీ ఉన్నది ఈ జగమే. ఈ లోకమూ నిన్న మొన్నటిదికాదు. ఎప్పటికప్పుడు మరణించి మరల జన్మించుచున్న ఈ పుట్టుకలు మాత్రమె కొత్తవై వేరుగా ఉన్నాయి. ఇట్టి నాకు ఎంత పెద్ద గురువులెన్ని రీతుల తత్త్వము బోధించినను ఆదినుంచి అజ్ఞుడనై యున్న నేను నిన్న నేటిలో అనగా ఒకటి రెండు దినములలో పరమార్ధస్వరూపము తెలుసుకోగలనా?
చపలమైన నా చిత్తము నాటిదే. చింతలూ ఆ నాటివే. ఎప్పటికప్పుడు మారుతున్న భోగములు మాత్రం వేరు. సత్యస్వరూపమైన శాస్త్రము ఎంతగా త్రోవ చూపిననూ అజ్ఞానుడనయిన నేను ఇప్పుడు కొత్తగా గుణవంతుడిని కాగలనా?
జీవాంతరాత్ముడై ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు గూడ పురాతనుడే కానీ నవీనుడు కాడు. ఈ జీవుల భావనలె పలు విధములుగా నున్నవి. జీవులను ముప్పుతిప్పలు పెట్టు కర్మము ఎంతగా వారిని తప్పుద్రోవల నడిపించినను దైవము దయతలచి వారిని కాపాడునే గానీ వదిలిపెట్టునా?
ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. పైన కప్పుగొను వస్త్రముల వంటి శరీరములు మాత్రమె ఎప్పటికప్పుడు మారుచున్నవి గానీ ఆత్మలో ఎట్టి మార్పు లేదు. ఈ విషయమునే అన్నమయ్య తన సహజ ధోరణిలో ‘గోనెలె కొత్తలు కోడెలెప్పటివి’ అని చెప్పినాడు .
No comments:
Post a Comment