Friday, 18 December 2015

సీతా పరిత్యాగ ఘట్టంలోని పద్యాలు.



సీతా పరిత్యాగ ఘట్టంలోని పద్యాలు.
ఆ భద్రుండు వినమ్రుడై పలికె, దేవా! నీవు పల్మారు న
న్నీ భంగిన్ నిజమేమిదేల్పు మనినన్, హీనాత్మకుల్ పల్కుప
ల్కే భావ్యంబని విన్నవింతు ? అది మీ కేలా వినన్? మూర్ఖులై
ఏ భూపాలుర మేచ్చిరీ నరులు! వీరేపాటి పాటింపగన్.

తన పరిపాలన గురించి శ్రీరాముడు భద్రున్ని అడుగుతాడు. అప్పుడు భద్రుడు వినమ్రుడై పలికాడు. దేవా! నువ్వు మాటిమాటికీ ఇలా నిజం చెప్పు అని నన్ను ఇలా నిలదీస్తుంటే నేనేమి చెప్పను? హీనాత్మకులు ఏవో కూస్తుంటారు. ఆ పలుకులు ఏమంత భావ్యమని నీకు విన్నవించను? అసలు అవివినడం ఎందుకు? ఆ ప్రజలు మూర్ఖులు. ఏ భూపాలురనైనా ఎనాడైన వీళ్ళు మెచ్చుకున్నారా?వీళ్ళు ఏపాటి మనుషులు కనక వీళ్ళ మాట పట్టించుకోవడానికి!

కరుణ గల్గిన రాజకంఠీరవుని గన్న
          మెత్తనివా డంచు మెచ్చ రతని
దురుసు దండనలతో ధరనేలు దొర గన్న
          హింసాపరుండని యెంచ రతని
ధైర్య సంపన్నుడౌ ధరణీశ్వరుని గన్న  
          కలన చిత్తుండని కదియ రతని
సుజనుల బ్రోచు భూభుజుని గన్నను పక్ష
          పాతియం  చలతిగా జూచురతని
నీ వివేకవంతు లే మెరుంగుదు రట్టి
యెరుక లేని జనులా సరుకు చేసి
మొరకు పలుకు  వినెడికొరకు మేకొనగ దే
వరకు దగునె? యాజివరకుమార !!

          అశ్వమేథ పుత్రకామేష్టి యాగాలు చేసిన (యాజి) ఓ దశరథకుమారా! ప్రజల మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. వారు ఎటువంటి రాజునైనా మెచ్చుకోరు .

          దయగలిగిన రాజసింహాన్ని మెత్తని వాడు పొమ్మంటారు. దురుసుగా ఉంటే హింసాత్మకుడంటారు. ధైర్యంగా  రాజ్యాన్ని విస్తరిస్తే  కఠినహృదయుడంటారు. సజ్జనుల్ని కాపాడుతున్న రాజుని పక్షపాతి అని లోకువగా (అలతిగా) చూస్తారు. ఈ మహా వివేకవంతులికి ఏం తెలుసు?  అటువంటి అజ్ఞానుల మాటల్ని లేక్కజేసి, వాళ్ళ మూర్ఖపు మాటలు వినిపించు వింటాను అని దేవరవారు పూనుకోవడం (మేకొనుట) సమంజసమా చెప్పండి!
సేకరణ:  కంకంటి పాపరాజుగారి చే విరచితమైన ఉత్తర రామాయణం లోని పద్యాలు.

పాలకుల్ని మూర్ఖంగా విమర్శించే ఇప్పటి ప్రజలకూ కనువుప్పు కలిగించే ఆణిముత్యాలు.

No comments:

Post a Comment