Wednesday, 23 December 2015

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి


నా అభిమాన నటి గాయని భానుమతి గారి వర్ధంతి నేడు. ఆమెకు నా స్మృత్యంజలి.
        నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, స్టూడియో యజమాని,
చిత్రకారిణి, ఇన్ని ప్రతిభా పాటవాలు కలిగిన వారు తెలుగు చిత్రసీమలోనే
కాదు, భారతదేశం లో మరెక్కడా లేరనడంలో అతశయోక్తి లేదేమో! సంగీత సాహిత్యాలు
ఆమెకి రెండు కళ్ళు. ఆమె గళంలో జాలువారిన మధురగీతాలు, ఆ సహజ గమకాలూ ఆమెకి
మాత్రమె సొంతం.
        పద్మ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డ్ (అత్తగారి కథలు),
ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, తమిళనాడు
ప్రభుత్వం ఇచ్చిన కలైమామణి వంటి బిరుదులు ఎన్నో, ఎన్నెన్నొ!
M.G. రామచంద్రన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెను ప్రభుత్వ
సంగీత కళాశాలకు డైరెక్టర్ గా, ప్రిన్సిపాల్ గా నియమించారు. అంతకుముందు
ఉన్న ప్రిన్సిపాల్ తెలుగులో ఉన్న త్యాగరాజు కీర్తనలు ఒక్కొక్కటిగా
తగ్గించేసి, తమిళ వాగ్గేయకారులైన పాపనాశం శివం మొదలైన వారి కీర్తనలను
బోధించేవారుట అదితెలిసి భానుమతి cylabus సమూలంగా మార్చి త్యాగరాజ కృతులను
తప్పనిసరిగా  బోధించేటట్లు చేసారుట. అదీ భానుమతి అంటే! ఆ పదవిని చాలా
సమర్ధవంతంగా నిర్వహించారని M.G.R గారు ఒక సభలో అభినందించారట. అది తనకి
లభించిన ప్రత్యేక గౌరవంగా తలచి మురిసిపోయేవారట. ఆమెకి ఆంద్ర దేశంలో ఎంత
పేరుప్రఖ్యాతులున్నాయో, తమిళనాడులో కూడా అంత గౌరవం, పేరుప్రఖ్యాతులు
ఉన్నాయి.
        భానుమతి ముక్కుసూటి మనిషి, నిర్మొహమాటి. ఆడంబరాలకు ఆమె వ్యతిరేకి.
రామకృష్ణగారి నిరాడంబరత, సీదా సాదా మనస్తత్వం, ఉన్నత సంస్కారం,
విధినిర్వహణ పట్ల చూపే శ్రద్ధ, పట్టుదల, దీక్ష ఆయన్ను ప్రేమిచేతట్లు
చేసాయి. ఆమె వివాహం ఓ గొప్ప సాహసకృత్యం. సినిమా నటి అయినా ఆ గ్లామర్ కి
ఆమె లొంగి పోలేదు.  ప్రేక్షకులు ఆమె పాత్రలని కాదు, ఆమెని చూడటానికి
వచ్చేవారు. చురకత్తిలాంటి  చూపు,  కంఠంలో అధికారం, మాట విరుపులో వెటకారం,
పాత్ర ఏదయినా ఫార్ములా ఇదే.  గిట్టని వాళ్ళు దీన్ని పొగరంటారు. నిజానికి
అది ఆమె వ్యక్తిత్వంలో పవరు. అందుకే ఆ రోజుల్లోనే స్టార్ అట్రాక్షన్ ఆమె
సొంతం. ఈ మాటలు ఆమెకు అత్యంత ఆత్మీయులైన డి.వి. నరసరాజు గారు ఒక వ్యాసంలో
రాసారు.  సినీరంగంలో అష్టావధానం చేస్తూనే వ్యక్తిగత ఆనందాన్ని సంపూర్ణంగా
పొంది, గృహనిర్వాహణ కూడా బాధ్యతాయుతంగా నిర్వహించిన ఉత్తమ వ్యక్తి ఆమె.
సినీరంగంలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె సూపెర్ స్టారే! ఆ మహా
కళాకారిణికి ఇదే నా ఘన నివాళి.

No comments:

Post a Comment