Thursday, 17 December 2015

ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల - అన్నమయ్య కీర్తన



ప.       ఎత్తరె ఆరతులీమెకు ఇంతులాల
          హత్తెను శ్రీవెంకటేసు కలమేల్మంగ.

౧.       హరి ఉరముపై సొమ్ము అరతగట్టిన తాళి
          సరిలేని దేవుని సంసారఫలము
          సిరులకు బుట్టినిల్లు సింగారములవిత్తు
          మెరుగుబోడి యలమేలుమంగ .              !!
౨.       పరమార్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
          కెరలుచునితని భోగించే మేడ
          సరసపు సముద్రము సతమైన కొంగుపైడి
          అరిది సంపదలది యలమేలుమంగ.                   !!
౩.       శ్రీ వేంకటేశుని దేవి చిత్తజుని గన్నతల్లి
          ఈవిభుని కాగిటిలో యేచిన కళ
          బూవపు పెండ్లి మేలు పొందిన విధానము
          ఆవల నీవల నీపె యలమేలుమంగ.                   !!.

భావము: (అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు).
                ఇది మంగళగీతము. శ్రీ వేంకటేశ్వరుడు అలమేలుమంగా, పరమాత్మ, ఆత్మలు. వారి సంగమమే జగన్మంగళము. ఓ ఇంతులారా ఆ దంపతులకి హారతులు ఇయ్యండి. స్వామి అలమేలుమంగను హత్తుకొనినాడు. ఈ దేవి ఎవరు? శ్రీహరి ఉరముపైన సొమ్ము, దేవి కంఠసీమనలంకరించిన మంగళసూత్రము. సిరులకు కాణాచి. సింగారములకు బీజము. శ్రీహరి సంసారఫలము పైడిఛాయతో విలసిల్లే అలమేలుమంగ.
          పరమాత్ముడైన హరి ఆత్మభావములో కీలుబొమ్మవలె నడుచునది. అతిశయించి ఆయన భోగాలనుభవించే దివ్యసౌధము. సరసాల సాగరము. శాశ్వతమైన శ్రీహరి కొంగుబంగారము. అరుదయిన సంపదలందించే శ్రీమహాలక్ష్మి ఈ అలమేలుమంగ.
          ఈ దేవియే శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణి. మన్మధుని కన్నతల్లి. శ్రీ వేంకటేశ్వరుని కౌగిలిలో ఒదిగిపోయిన కళ. మేలైన హరి పెండ్లి భోజనము. ఆయన పొందిన నిధానము. అటు తిరుమలలోను, ఇటు వైకుంఠం లోనూ ఆమె అలమేలుమంగ.

No comments:

Post a Comment