Thursday, 11 December 2014

సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.



సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.
          సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు దివంగతులయ్యారన్న వార్త చాలాబాధ కలిగించింది. వారు కర్నాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా గాయకులు. ఆయన వద్ద  ఎందరో మహానుభావులు శిష్యరికము చేసారు.  మేము విశాఖ వాస్తవ్యులము కావడం మూలాన, ఆయన దర్శనభాగ్యం, వారి కచేరి వినే భాగ్యం మాకు కలిగాయి. మొట్టమొదట్లో రాళ్ళపల్లివారు, నేదినూరి వారు అన్నమయ్య కీర్తనలను స్వరపరచి మనకి అందజేశారు. తిరుపతి దేవస్థానం వారి సహకారంతో అనేక  అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, పుస్తకాలను కూడా ముద్రణ చేయించారు. ఆ పుస్తకాలు ఎంతమందికో మార్గదర్శకం  అయ్యాయి. వారు స్వరపరిచిన కీర్తనలలో ముఖ్యమైనది ‘ముద్దుగారే యశోద’ అన్న కీర్తన. ఇది ‘పడమటి సంధ్యారాగం’ అనే సినీమాలోకూడా చిత్రీకరించారు. ఇంకొక కీర్తన ‘పలుకు తేనెల తల్లి’ శ్రీమతి శోభానాయుడు గారు కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు. ఇంకా ఎన్నో అన్నమయ్య కీర్తనలు వారు స్వరపరచినవి ఎందరో కళాకారులు గానంచేశారు.
          తెలుగు వారు  మరో మంచి కళాకారుణ్ణి కోల్పోయారు. ఈ మహాగాయకునికి ప్రపంచంలో అన్ని చోట్లా సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఇటువంటి మహోన్నత కళాకారునికి ఎటువంటి కేంద్ర ‘పద్మ’ పురస్కారాలు లభించకపోవడం శోచనీయం. ఇది మన ఆంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అనుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. (పొన్నాడ లక్ష్మి – 8.12.14)

Monday, 24 November 2014

అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు. - అన్నమయ్య కీర్తన



ప.         అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు.
౧.         లలితపు పది గొట్ల నొకడు గాని – కలుగడు శ్రీహరి గని మనగ.
            ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇల నొకడు గాని యెరుగడు హరిని.
౨.         శృతి చదివిన భూసురకోట్లలో – గతియను  హరినే యోకానొకడు,
            అతిఘను లట్టిమహాత్మ కోటిలో – తతి నొకడు గాని తలచడు హరిని.
౩.          తుద కెక్కిన నిత్యుల కొట్లలో – పొదుగు నొకడు తలపున హరిని,
            గుదిగొను హరి భక్తుల కొట్లలో – వెదకు నొకడు శ్రీ వేంకటపతిని.
భావము:
            శ్రీహరిని తెలిసికొనుట అందరికీ వశమా? ఒకానొక విజ్ఞానికి తప్ప పరమాత్ముని తెలుసుకోవడం సాధ్యం కాదు.
            పదికోట్ల మందిలో ఏ ఒక్కడో తప్ప మరెవ్వడూ శ్రీహరిని గుర్తించలేడు. అట్లు గుర్తించిన పుణ్యాత్ములలో ఒక్కడు మాత్రమే హరితత్వమును పూర్తిగా తెలిసినవాడగును.
            వేదములు చదివిన కోట్లకొలది విప్రులలో ‘హరియే గతి’  అని చెప్పువాడు ఒకానొకడు మాత్రమే. అట్లు చెప్పు మహా ఘనులలో ఏ ఒక్కడో తప్ప హరిని  నిక్కముగా మదిలో భావింపడు.
            విద్యావివేకాదులచే ప్రతిష్ఠ గాంచిన నిత్యస్వరూపులైన అనేక జీవులలో తలపున శ్రీ హరిని నిలుపు వాడొక్కడే. అన్నివిధముల అతిశయించిన హరిభక్తుల సమూహములలో శ్రీ వేంకటేశ్వరుని నిజముగా అన్వేషించి కనుగొను వాడెవడో ఒకడే అగును.




Saturday, 15 November 2014

పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు మరుగురుని మీదట మనసుండవలదా - అన్నమయ్య కీర్తన



పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదను

భావం:                                  
            పరమ సుజ్ఞానులకు ప్రపత్తి మార్గమును అనుసరించువారికి మాధవునిపై సదా మనస్సు లగ్నమై ఉండవలెను.
            ఆకలిగొన్నవానికి అన్నముపై నుండునట్లు భక్తునికి పరమేస్వరునిపై తీవ్రమైన ఆపేక్ష ఉండవలెను. కామార్తులైన విటుల చూపు కాంతల పైననే ఉండినట్లు జిజ్ఞాసువులకు దేవుని మీదనే ధృడమైన దృష్టి ఉండవలెను.
            పసిబిడ్డలకు పాలచన్ను పైననే ఆశ ఉన్నట్లు భక్తులకు గోవిందుని పైననే భక్తి స్థిరమై ఉండవలెను. బాటసారి ఆపేక్ష అంతయు తాను  విడినచోటనే ఉన్నట్లు ప్రపన్నునకు శ్రీనాధుని మీదనే లక్ష్యముండవలెను.
            ధనికుడు ఏమరుపాటులేక నేర్పుతో తన ధనపేటికను కాచుకొని యుండునట్లు శరణాగతుడు శ్రీవేంకటేశ్వరునే అనుసరించి యుండవలెను. ఆలజాలములకు(నీటిలోనే తిరుగాడే పురుగులు)నీటిపై ఎడతెగని భ్రమణ మున్నట్లు ఈ దేవునిపై సంతత ప్రేమ, భక్తి యుండవలెను.

భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే - అన్నమయ్య కీర్తన



భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో. IIపల్లవిII

అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేనిరతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో. IIభవII

పొలఁతులనెడిమహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారుక్షతా
అలరుచెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో. IIభవII

తరుణులకాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁగారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదుసుననుండే యంత్రమేదొకో
భావం:
        దేవా! ఆలోచించి చూడగా సంసారమను జబ్బుకు నీవొకడవే. ఓ వెన్నదొంగా!  నీకు దండము ,నీకు దండము.
        స్త్రీలనెడు పాములు పెదవులు గరచినంత పురుషులకు కామవిషములు తలకెక్కినవి.  అంతులేని రతిక్రీడలలో మునిగి తేలుటచే శరీరములు తిమ్మిరి పట్టినవి. మతిమరుపు కలిగినది. ఈ విషం దిగుటకు, ఈ తిమ్మిరి వదులుటకు తగిన మందేదో!
        స్త్రీ వ్యామోహం అనెడి పెద్ద భూతం సోకగా మనుజులు తలమొలలు వీడి ఒడలు తెలియక దిసమొలలుతో ఉన్నారు. కామక్రీడలకు సంబంధించిన నఖక్షత దంతక్షతాదులచే శరీరము అంతయు గీరలు పడినవి. ఈ దెయ్యమును విడిపించుటకు మంత్రమేదోకదా!!
        అంగనల ఆలింగనములనెడి తాప జ్వరములు పట్టి శరీరములెల్ల చెమటలు కారుచున్నవి. శ్రీ వెంకటేశ్వరా  ఈ విషమ పరిస్థితులలో ఉన్నవారికి నీవే రక్షకుడవు. ఈ చిక్కులనుండి విడివడి శాశ్వతమైన సుఖము పొందుటకు సాధనమైన యంత్రమేదో అనుగ్రహింప రాదా!!!


Friday, 31 October 2014

ఇందరు నీ కొక్కసరి ఎక్కువ తక్కువ లేదు – చెంది నీ సుద్దులు ఏమి చిత్రమో కాని. !!

 అన్నమయ్య కీర్తన:
ప. ఇందరు నీ కొక్కసరి ఎక్కువ తక్కువ లేదు – చెంది నీ సుద్దులు ఏమి చిత్రమో కాని. !!
౧. నీ నామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని, నీ నామము వినక నెరవేరె నొకడు,
పూని నిను నుతియించి భోగియాయె నొకడు, మోనమున నినుదిట్టి మోక్షమందే నొకడు. !!
౨. మతిలో నిన్ను దలంచి మహిమందే నొక యోగి, తతినిన్ను దలచకే తగిలె నిన్నొకడు,
అతిభక్తి బనిసేసి అధికుడాయె నొకడుమునీశ్వరుడు
, సతతము బనిగొని సఖుడాయె నొకడు. !!
౩. కౌగిటి సుఖములిచ్చి కలిసిరి గొందరు, ఆగి నినువెంట దిప్పి ఆవులు మేలందెను,
దాగక శ్రీవేంకటేశ దగ్గరైన దవ్వయిన మాగి నిన్ను దలపోసే మనసే గురుతు. !!
భావం:
దేవా!నీ యెడల అనుకూలముగా కొందరు, ప్రతికూలముగా కొందరు ప్రవర్తించినారు. ఎవరెట్లున్నను నీ దృష్టిలో అందరూ సమానులే. నీ చరిత్రలు యెంత చిత్రములో కదా!
ఒక మునీశ్వరుడు (నారదుడు) సతతము నీనామముచ్చరించి ముక్తి నొందెను. మరొకడు (ఘంటాకర్ణుడు) నీ నామము వినకయే ముక్తుడయ్యెను. ఒకడు (కుచేలుడు) భక్తితో నిన్ను స్తుతించి సంపన్నుడయ్యేను. మరొకడు (శిశుపాలుడు) దురాగ్రహముతో నిన్ను నిందించి మోక్షము పొందెను.
ఒకయోగి (శుకుడు) మనసులో నిన్ను సదా ధ్యానించి మహిమగల వాడయ్యెను. మరొకడు (అజామిళుడు) నిన్ను మదిలో తలపకయే నీ సాన్నిధ్యమునకు చేరెను. ఒకడు (ఉద్దవుడు) మిక్కిలి భక్తితో నీకు సేవ చేసి మహానీయుడయ్యెను. మరొకడు (అర్జునుడు) నీ సహాయము ఎల్లవేళలా పొంది నీకు మిత్రుడయ్యెను.
కొందరు (గోపికలు) నీకు ఆలింగన సౌఖ్యమునిచ్చి నిన్ను పొందిరి. ఆవులు కూడా నిన్ను తనవెంట తిప్పుకుని శుభములు వడసెను. శ్రీ వెంకటేశ్వరా! దగ్గరగా అయినను, దూరముగా అయినను నిన్ను చింతించు చిత్తమే నిన్ను పొందుటకు తగిన గురుతు.