ప. అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు
గాని యెరుగడు.
౧. లలితపు పది గొట్ల నొకడు గాని – కలుగడు
శ్రీహరి గని మనగ.
ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇల
నొకడు గాని యెరుగడు హరిని.
౨. శృతి చదివిన భూసురకోట్లలో – గతియను హరినే యోకానొకడు,
అతిఘను లట్టిమహాత్మ కోటిలో – తతి
నొకడు గాని తలచడు హరిని.
౩. తుద కెక్కిన నిత్యుల కొట్లలో – పొదుగు
నొకడు తలపున హరిని,
గుదిగొను హరి భక్తుల కొట్లలో – వెదకు
నొకడు శ్రీ వేంకటపతిని.
భావము:
శ్రీహరిని తెలిసికొనుట అందరికీ వశమా?
ఒకానొక విజ్ఞానికి తప్ప పరమాత్ముని తెలుసుకోవడం సాధ్యం కాదు.
పదికోట్ల మందిలో ఏ ఒక్కడో తప్ప
మరెవ్వడూ శ్రీహరిని గుర్తించలేడు. అట్లు గుర్తించిన పుణ్యాత్ములలో ఒక్కడు మాత్రమే
హరితత్వమును పూర్తిగా తెలిసినవాడగును.
వేదములు చదివిన కోట్లకొలది విప్రులలో
‘హరియే గతి’ అని చెప్పువాడు ఒకానొకడు
మాత్రమే. అట్లు చెప్పు మహా ఘనులలో ఏ ఒక్కడో తప్ప హరిని నిక్కముగా మదిలో భావింపడు.
విద్యావివేకాదులచే ప్రతిష్ఠ గాంచిన
నిత్యస్వరూపులైన అనేక జీవులలో తలపున శ్రీ హరిని నిలుపు వాడొక్కడే. అన్నివిధముల
అతిశయించిన హరిభక్తుల సమూహములలో శ్రీ వేంకటేశ్వరుని నిజముగా అన్వేషించి కనుగొను
వాడెవడో ఒకడే అగును.
భావం చక్కగా చెప్పారండీ.
ReplyDelete