Sunday, 29 July 2018

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద
పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. !!

పడఁతి నీ గుణాలకు పలుమారు మెచ్చి మెచ్చి
వుడివోని సంతోసాన నూలలాడీని,
కడు నీ చక్కఁదనాలు కాంతలతోఁ జెప్పి చెప్పి
వెడఁగుఁ బులకలతో విర్రవీగీని. !!

నేరుపుల మీ చేతలు నెమ్మదిఁ జూచి చూచి
కోరికలు కొనసాగ గుబ్బితిలీని,
కూరిమి తోడుత నీ కొలువులు సేసి సేసి
చేరి నీతో వేడుకలఁ జెలరేఁగీని. !!

సేసవెట్టి నీపై నిదె సెలవులు నవ్వి నవ్వి
ఆశలఁ గాఁగిట నిన్ను నప్పళించీని,
రాసికెక్కి నీవేలఁగా రతుల శ్రీ వేంకటేశ
పోసరించి ఇన్నటాను భోగించీనీ.. !!

భావమాథుర్యం...
అన్నమయ్య స్వామివారి చెలికత్తెవలె భావించుకుని  ఆయన దేవేరికి ఆయనపై గల ఆరాధన, అనురాగం వలపులను వివరిస్తున్నారు.
ప్రభూ! ఇదిగో నీపై ఎంతో ఆరాధన, భక్తి మెండుగా గల అలమేల్మంగ. నీపై ఆవరించి వలపులను కుమ్మరించినదయ్యా!
ఈ పడతి పదే పదే నీ సుగుణాలను మెచ్చి తరగని సంతోషాలలో ఓలలాడినదయ్యా! నీ చక్కదనములను చెలులతో చెప్పి చెప్పి మితిమీరిన పులకరింతలతో విర్రవీగుతున్నదయ్యా!
ప్రభూ నీ చేతల నేర్పునూ, నెమ్మదితనమునూ చూచి చూచి కోరికలు కొనసాగగా అతిశయంతో పరవశించెనయ్యా! అనురాగముతో నీకు సేవ చేసి చేసి నీతో వేడుకలు పంచుకొని చెలరేగినదయ్యా!
నీపై తలంబ్రాలు పోసి, ఆపైన మనోహరమైన చిరునవ్వులు చిలికించి ఆశలతో నీ కౌగిట పరవశించినదయ్యా! గణతకెక్కిన నీ సురతులకు గర్వించి, శ్రీ వెంకటేశ్వరా! అన్ని విధములా ఆ దేవి నిన్ను భోగించెనయ్యా!


No comments:

Post a Comment