Sunday 29 July 2018

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? !!

తొలికారు మెరుపులు తోచిపోవు గాక
నెలకొని మింటనవి నిలిచీనా?
పొలతుల వలపులు పొలసి పోవుగాక
కలకాలంబవి కడ తీరీనా? !!

ఎండమావులు చూడ నేరులై పారుగాక
అండకు పోవ దాహమణిగీనా?
నిండినట్టి మోహము నెలతలమదిచూడ
వుండినట్టే వుండుగాక ఊతయ్యీనా? !!

కలలోని సిరులెల్ల కనుకూర్పులే కాక
మెలకువ చూడనవి మెరసీనా?
అలివేణుల మేలు ఆసపాటే కాక
తలపు వేంకటపతి తగిలీనా? !!

లౌకికమైన జీవనంలో ఈ ప్రేమలూ, ఈ పరిచయాలు, ఈ ప్రమాణాలు బహుప్రియమైనవని మనం భ్రమపడుతూ ఉంటాము. కానీ లోతుగా ఆలోచిస్తీ కపటపూరితమైన ఈ కవ్వింపులు ఏవీ కాలపరీక్షకు నిలవలేవు. అదే భావనతో ఆ భక్తశిఖామణి ఈ సంకీర్తనకు శ్రీకారం చుట్టాడు.
ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఈ ప్రమాణాలు ఎంతవరకు నిజం. మనం అనుకునే మాటలన్నీ నిజాలేనా?
తొలకరిలో మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి. కానీ అవి కనీ కనిపించి మాయమౌతాయి. తరుణి ప్రేమ కూడా అటువంటిదే అంటున్నాడు అన్నమయ్య. యౌవనపు పొంగులో కనిపించేవి ఇవన్నీ..ఇలా మనుష్యుల మధ్య కలిగే బంధాలన్నీ పరిమితకాలమే అని ప్రస్ఫుటం చేస్తున్నాడు.
ఎండమావులను చూస్తే అక్కడ నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. తీరా దరికి పోతే నీరుండదు. దాహం తీరదు. నెలతల మీది మోహము కూడా మనసులో మరులు గొలుపుతుంది. మాయ చేస్తుంది.కానీ ఏమాత్రం ప్రియం కలిగించదని అన్నమయ్య చెప్తున్నాడు.
కలలో కనిపించే సిరులు, భోగాలు కల ఉన్నంతవరకు నిజమే అనిపిస్తుంది. కల చెదిరి వాస్తవంలోకి రాగానే మాయమైపోతాయి. అలివేణులపై ఆపేక్ష కూడా అంతేనని అన్నమయ్య అంటున్నాడు. ఆ భ్రమలో శ్రీ వెంకటేశుని పై ఆశ తగలీనా ? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. కాంతా కనకాలపై మోహం భగవంతుని తలపును కూడా దూరం చేస్తుంది. అని అన్నమయ్య కీర్తనలోని అర్ధం పరమార్ధం.

No comments:

Post a Comment