ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఇది
యెంతగర్వియని ఎంచేవు గనక నీకు నేను
పెదవులతుదనే పిలిచితిజుమ్మీ..
౧.
కన్నుల మొక్కితి జుమ్మీ గక్కన నీకు నేను
కిన్నెరా వాయించుకొంటా కేంగేలను
సన్నలు జేసితిజుమ్మీ సముకాననే యపుడు
చిన్ని చిన్న నగవులసిగ్గు తోడను
౨. అంది
చోటిచ్చితి జుమ్మీ అండనే నీకు నేను
గందము పూసుకింటా గద్దేమీడను
విందులు జెప్పితిజుమ్మీ వేడుకతోడ నిలిచి
మందలించి చెలికత్తె మాటుననే ఉంది.
౩.
యెదురుకొంటి జుమ్మీ ఇంపుల చూపుల నీకు
ముదమున నాతురుము ముడుచుకొంటా
ఇదివో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
కదిసితి విటు నన్ను కాదు సంతోసించితి.
భావమాధుర్యం.
దేవి
మితభాషి. తనని వేడుకోనివారిని తలతిప్పియైనను చూడదు. శ్రీ వేంకటేశుని దేవేరినని
ఆమెకు గర్వమున్నా అది ఎన్నడూ స్రుతి
మించదు. ఈ కీర్తనలో ఆమె స్వామితో ఏమంటున్నదో అన్నమయ్య బాణిలో వినండి.
స్వామీ!
నేను ఎలుగెత్తి పిలిస్తానని నన్ను గర్విష్టిగా అంచనా వేస్తున్నావు. అందుకే నేను
నిన్ను నా పెదవుల చివరినుంచి పిలిచాను సుమా! నేను కన్నులతోనే నీకు మ్రొక్కెదనని
నీకు తెలియదా? నేను కిన్నెరా వాయిస్తున్నప్పుడు తొందరలో చేతిసైగతో పిలిచానేమో. అది
తప్పేనా స్వామీ! నీ సముఖాన చిన్నచిన్న నవ్వులతో సిగ్గులోలికిస్తూ ఉంటాను.
స్వామీ!
నీవు నా వద్దకు వచ్చినప్పుడు నేను ఎదురువెళ్ళి ఆహ్వానించి కూర్చోబెట్టి చందన
తాంబూలాదులిస్తే .. నీవు గంధము పూసుకొనుచు అక్కడే ఉన్న సింహాసనము మీద కూర్చుంటే
నీకు విందు
పురమాయిస్తాను. చెలికత్తె మాటున ఉండి ఇది వేడుకగా
చూస్తుంటే గట్టిగామందలించాను. అంతమాత్రాన నేను
గర్విష్టినా?
ఇవాళ నా శిఖ తురుము ముడుచుకొంటుంటే నీవు
వచ్చావు. నా ఇంపైన చూపులతో నిన్ను స్వాగతించాను. ఓ శ్రీ వేంకటేశ్వరా! నేను నీ
దేవేరి అలమేల్మంగను నీవు నాకెంతో దగ్గిరైనావు.. నాకింత కంటే సంతోషమేముంటుంది?
No comments:
Post a Comment