సరిగమపదనిస సంజ్ఞ స్వరంబుల
మహతి
నభో వాయు నిహతి మొరయు
భాగీరథీ పయః పరిపూర్ణ మణి కమం
డలుపు హస్తంబున జెలువుమిగుల
బ్రణవ మంత్రావృత్తి పావన స్ఫటికాక్ష
వలయంబు కర్ణ శష్కులిక వ్రేల
సమారా నృత్యోచిత చమర వాలంబును
గక్షపాలయ భుజాగ్రమున మెరయ
దేహకాంతు లకాల చంద్రికల నీన
జడలు మోక్షద్రుపల్లవశంక సేయ
గగనమున నుండి వచ్చె నాకస్మికముగ
నారి వేరంపు దరసి దైత్యారి కడకు.
శ్రీకృష్ణుని
(దైత్యారి – దైత్యుల శత్రువు – శ్రీకృష్ణుడు) వద్దకు ఒకసారి అకస్మాత్తుగా ఆకాశం
నుండి దిగి నారదమహర్షి వచ్చాడు. ఆ దేవర్షి యొక్క మహతి అనే వీణ నుండి సప్తస్వరాలు
సుస్వరంగా జాలువారుతున్నాయి. అవి
గాలివాటువల్ల ఆకాశమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకచేత్తో పవిత్రమైన ఆకాశగంగ జలాన్ని
కలిగిన మణిమయ కమండలం అందంగా ధరించాడు. నిరంతరం ఓంకారయుక్తమంత్రాన్ని (ప్రణవమంత్ర)
వల్లెవేయడం వలన పావనమైన స్ఫటికాల జపమాల చక్కిలంవంటి (శష్కులి) ఆయన కుడి చెవికి
వేలాడుతూంది. (అందమైన చెవుల్ని చక్కిలాలతోనూ, శ్రీకారంతోనూ పోలుస్తారు కవులు.
జపమాలని కుడి చెవికే తగిలించుకుంటారు. స్ఫటికమాలని తిప్పుతూ జపం చేస్తే
ఉత్కృష్టమైన ఫలమట.)
యుద్ధసమయంలో నృత్యానికి అర్హమయ్యే (అంటే శ్రేష్టమైన) చామరం ధరించాడు. సంచీ
(కక్షపాల) ఒకటి భుజాన వేలాడుతోంది. నారదుని తెల్లని దేహకాంతి, యెర్రని జడలు కట్టిన
జుట్టూ, ఈ రెండూ మోక్షవ్రుక్షం చిగురులా అనిపిస్తున్నాయి.
ఆయన మహా తేజస్వి. అందుకే ఆయన దిగి వస్తుంటే కాలం కాని కాలంలో వెన్నెలకాంతి
కురిసినట్లయింది. కలహప్రియుడు (అరి వేరంపు తపసి) అయిన నారదుడు అంత తేజస్సు
ఉట్టిపడుతుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి దిగి శ్రీకృష్ణ దర్శనానికి ద్వారక
వచ్చాడు.
నంది
తిమ్మన పారిజాతాపహరణం నుండి సేకరణ.
(తెలుగుపద్య మధురిమలు.)
No comments:
Post a Comment