మహాకవి పోతన:
రాజుకాని మహారాజు,
రాజ్యంలేని కవిరాజు, రాజభోగాలు ఆశించని రాజరాజు, ఆడంబరాలకూ, అహంకారాలకూ త్రోసిరాజు
మన బమ్మెర పోతరాజు.
“ఖ్యాతి గడించుకొన్న కవు
లందరు లేరే! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద; జోహారు సేతకై
చేతులు లేచు; ఈ జనవశీకారణాద్భుతశక్తి చూడగా
నాతని పేరులో గలదో! ఆయన భాగవతాన నున్నదో!”
“విద్యావతాం భాగవతే పరీక్షా”
అనే కొమ్ములు తిరిగిన పండితులకు కూడా “కొరకరాని కొయ్య”అయినా సంస్కృత భాగవతం సహజ
పాండిత్యుని హస్త స్పర్శతో “బాలరసాలం” గా పరిణమించి, పల్లవించి, పుష్పించి, ఫలించి
ఆబాలగోపాలానికీ రసానందాన్ని అందించింది.
కవిత్వమనే పాలల్లో భక్తి అనే
పంచదార కలిపి భాగావత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృత హస్తం
పోతనగారిది. ఆయన కావ్యకన్యక తెలుగువారి గుండెల్లో “మందార మకరందాలు” చిందించింది.
తెలుగు జాతిని “నిర్మల మందాకినీ వీచికల్లో” ఓలలాడించింది.
పోతనగారు మనలో ఎంతగానో
కలసిపోయారు. మనసులో, మాటలో, పాటలో, పద్యంలో నుడికారాలలో, ఆచారాలలో వెలుగులా వెన్నెలలా మలయమారుతంలా కలిసిపోయారు. తెలుగువారి
నిత్యజీవితాలలో, నిండుహృదయాలలో, ఉచ్చ్వాస నిశ్వాసాలలో ఆ మహాకవి నిండి ఉన్నారు.
ఉదయభానుని కిరణాలలో,
యదుకిశోరుని మృదుచరణాలలో చల్లలమ్మే గొల్లభామల్లో, విలుపట్టిన సత్యభామలో, వల్ల
వాంగనల వలపుల్లో, పిల్లనగ్రోవి పిలుపుల్లో ఆ మహాకవి కనిపిస్తాడు, వినిపిస్తాడు..
”ఆహా” అనిపిస్తాడు.
సేకరణ “ తిరుమల తిరుపతి
దేవస్థానం వారు ప్రచురించిన పోతన భాగవతం (ప్రవేశిక)”
- పొన్నాడ లక్ష్మి
No comments:
Post a Comment