అన్నమయ్య ఆత్మవిమర్శ.
దురదృష్టవశాత్తు నేడు ఆత్మవిమర్శకు ప్రాధాన్యం
తగ్గిపోతూ ఉంది. ప్రతివారూ తమకంటే మించిన గొప్పవారు లేరనే భ్రాంతిలో ఉన్నారు. ఈ
భ్రాంతి వల్ల తామెంత నష్టపోతున్నారో గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అందువల్లనే
ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఆశించని
దుష్ఫలితాలు వస్తున్నాయి. ఈ తీరు మారాలంటే ఆత్మ విమర్శ ఎంతైనా అవసరం. మహనీయులైన
మనపూర్వులేందరో ఆశించిన ఫలితాలను అవలీలగా సాధించుకున్నారు. దీని కంతటికీ కారణం
వారంతా ఎప్పటికప్పుడు తమ స్థితిని గుర్తించడమే. తమ లక్ష్యానికనుగుణంగా తమను
మార్చుకుని పురోగమించడమే. ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నవారిలో అన్నమయ్య ఒకడు.
అన్నమయ్య వేంకటేశు నుద్దేశించి చెప్పిన కీర్తనలలో
తన కీర్తిని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆర్తిగా తన లోపాలను తెలియజేసాడు. దీనస్థితిలో
ఉన్న తనను ఆదుకొని అండజేర్చుకొమ్మని అర్ధించాడు. ఎంత చదువుకున్నా, ఎన్ని విషయాలు
తెలుసుకున్నా వాటిని అనుభవంలోకి తెచ్చుకుని ఆచరణలో పెట్టలేకపోతున్నాం అని
వాపోతాడు.
“విడిచితినా
పాపము వేవేలు చదివినయంతనే”
“తెలిసితినా
తత్వరహస్యం తిరమగ కులజుడయి నంతనే”
“వదలితినా
నా దుర్గుణములు వరుసతో జుట్టాలు గలిగి నంతనే”
“పురుషోత్తముడవీవు,
పురుషాధముడనేను “
మొదలైన ఎన్నో కీర్తనలలో తన లోపాలు, బలహీనతలు పరమాత్ముడికి చెప్పి తన అవగుణాలను
పారద్రోలి తనకు జ్ఞానోదయం చేయమని ప్రార్ధిస్తాడు అన్నమయ్య. అందుకే అన్నమయ్య అంత
మహనీయుడయ్యాడు.
పొన్నాడ లక్ష్మి .
No comments:
Post a Comment