13.6.15: ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. దైవము దూరనేల ఎవ్వరూ నేమి సేతురు – మతి వారూ దమవంటి మనుజులే
గాక.
చ. చేరి మేలు సేయగీడు సేయ నెవ్వరు
గర్తలు – ధారుణిలో నరులకు దైవమే గాక
సారె దన వెంటవెంట జనుదెంచె వారెవ్వరు బోరున జేసిన పాపపుణ్యాలే కాక!
2.
తొడగి పొడిగించను దూషించ ముఖ్యులెవ్వరు – గుడిగొన్న తనలోని గుణాలే గాక,
కడుగీర్తి నపకీర్తి గట్టెడి వారెవ్వరు – నడచేటి తన వర్తనములే కాక!
3.
ఘనబంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు – ననిచిన జ్ఞానాజ్ఞానములే గాక,
తనకు శ్రీ వేంకటేశు దలపించే వారెవ్వరు – కోన మొదలెరిగిన గురుడే గాక.
భావం: తమకు చిక్కులెదురైనప్పుడు ఊరక ఇతరులను నిందించుట వలన ప్రయోజనమేమి? తమ
విషయములలో ఎవ్వరైన నేమి చేయగలరు? ఆలోచించి చూస్తే వారు కూడా తమవంటి సాధారణ మనుజులే
కదా!
ఇలలో
మనుజులకు మేలు చేయుటకైన, కీడు చేయుటకైన దైవమె కర్తగాని ఇతరులెవ్వరును గాదు. తన్ను
వదలక వెంటపడి వచ్చునవి తాను వడిగా జేసిన పాపపుణ్యములే గాని పరులేవ్వరు కారు.
తన్ను
చుట్టుముట్టిన గుణదోషములే తన దూషణ భూషణములకు ముఖ్యహేతువు లగుచున్నవి గాని
వేరెవ్వరు కారు. తనకు కలిగే కీర్తి అపకీర్తులకు తాను నడుచు నడతలే కారణములు గాని
అన్యులు కారు.
తనకు
బంధమైనను. మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానాజ్ఞానములే హేతువులగుచున్నవి
గాని తదితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి
కలిగించువాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొక్కడు లేడు.
No comments:
Post a Comment