Friday, 28 February 2020

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామయణాలై పరగె నీ కధలు ॥ - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి
భారత రామయణాలై పరగె నీ కధలు ॥

భువిమీద రావణుడు పుట్టగాగా రాముడవై
తవిలి ఇందరికి బ్రత్యక్షమైతివి,’
వివరింప నంతవాడు వెలసితేగా నీవు
అవతార మందితే నిన్నందరును జూతురు ॥

రమణ గంసాది యసురలు లూటి సేయగాగా
తమి గృష్ణావతార మిందరి కైతివి,
గములై ఇంతటి వారు గలిగితేగా నీవు నేడు
అమర జనించి మాటలాడుదు విందరితో. ॥

ఎంత ఉపకారియో హిరణ్య కశిపుడు
చెంత నరసింహుడని సేవ ఇచ్చెను,
ఇంతట శ్రీ వేంకటేశ ఇన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని బ్రతికితి మిదివో ॥

భావ మాథుర్యం..

ఈ కీర్తనలో అన్నమయ్య పాపాత్ములను, రాక్షసులను కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు భూమి మీదకు రాబట్టేగా పరమాత్ముడు వాళ్ళను సంహరించడం కోసం వివిద రూపాలలొ అవతరించి, జనులనందరినీ కటాక్షించాడు. ఇదీ అన్నమయ్య అంటే..

ఓ పరమాత్మా! నిన్ను భూమి మీద అవతరింపజేసేలా చేసిన వారిదే పుణ్యము. అందుమూలముగా నీ కథలు బారత రామాయణాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ భూమి మీద రావణుడు పుట్టబట్టి ఆనిని సంహరించుటకు నీవు శ్రీరాముడిగా అవతరించితివి. వివరంగా చెప్పాలంటే అంతటివాడు జన్మించబట్టే నీవు అవతరమెత్తితివి. నిన్ను అందరూ దర్శించుకొనే భాగ్యం కలిగింది.

శ్రీ రమణా! కంసాది అసురులు మానవులను దోపిడీచేయబూనగా, నీవు కృష్ణావతారమెత్తితివి. పాపాత్ములైన వారు జనించబట్టేగా నీవు భూమీద జన్మించి అందరితో మాటలాడేవు. మంతనాలాడేవు.

ఇంక హిరణ్యకశిపుడు ఎంత ఉపకారము చేసినాడొ.. అతను కోరిన వింత వరము వల్ల అద్భుతమైన నరసింహావతార మెత్తితివి. నీ సేవ చేసుకొనే భాగ్యం మాకు కల్పించితివి. శ్రీ వేంకటేశా ఇన్ని రూపులూ నీవే. నిన్నే శరణని మేమందరమూ బ్రతుకుతున్నాము.

Friday, 7 February 2020

నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. - అన్నమయ్య కీర్తన

 అన్నమయ్య కీర్తన
నదులొల్లవు నా స్నానము కడు
సదరము నాకీ స్నానము.
ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరించుటే నా స్నానము,
ధరపై నీ నిజదాసుల
చరణధూళి నా స్నానము.
తలపులోన నినుదలచినవారల
తలచుటే నా స్నానము
వలనుగ నిను గనువారల శ్రీపాద
జలములే నా స్నానము..
పరమభాగవత పదాంబుజముల
దరిసనమే నా స్నానము.
తిరువెంకటగిరి దేవా..
కథాస్మరణమే నా స్నానము...
భావవ్యక్తీకరణ..
నదులలో చేసే స్నానమొక్కటే కాదని, అంతకుమించిన స్నానమే తాను ఆచరిస్తున్నానని ఈ కీర్తనలో అన్నమయ్య స్పష్టం చేస్తున్నాడు.
భుజాలపై రెండువైపులా చక్రాoకితాల ముద్రలను ధరించడమే తనకు నిజమైన స్నానం అంటున్నాడు. పరమాత్మకు దాసులైన వారికి దాస్యం చేయడం అసలైన జలకస్నానం అని అన్నమయ్య విసదీకరిస్తున్నాడు.
మనసులో నిన్ను తలుచుకున్నవారిని తరుచూ మననం చేసుకోవడం, నిన్ను కనులారా చూసిన వారి పవిత్రజలాలను తలపై చల్లుకోవడం నాకు మహత్తరమైన స్నానం అంటున్నాడు అన్నమయ్య.
పరమాత్మే పరమావిధిగా జీవించే పారమార్థిక మూర్తుల పాదపద్మాలను దర్శించుకోవడం, తనకు గురియైన శ్రీనివాసుని దివ్యగాథను స్మరించుకోవడం నిత్యం నదీస్నానం చేయడంతో సమానమని పాడుకుంటూ పులకించిపోతున్నాడు అన్నమయ్య.

Saturday, 1 February 2020

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. కదిసితేనే ఇనుము కనకమై మించెను. !! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!
సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!
తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!
చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!
భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.

అణుమాత్రపుదేహి నంతే నేను మొణిగెద లేచెద ముందర గానను - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను
చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
విశ్లేషణ:
మొణిగెద శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
(భావార్ధం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో)

Saturday, 11 January 2020

ఏఁటిఁకిఁ దలఁకెద రిందరును గాఁటపు సిరులివి కానరో ప్రజలు !!




భావము :శ్రీహరి స్మరణ అన్ని సిరిసంపదలకు మించిది.


ఏఁటిఁకిఁ దలఁకెద రిందరును
గాఁటపు సిరులివి కానరో ప్రజలు !!

ఎండలో బొంలక యేచిన చలిలో
నుండక చరిలో నుడుకక
అండనున్న హరి నాత్మఁ దలఁచిన
పండిన పసిఁడే బ్రతుకురొ ప్రజలు
||ఏటి||

అడవుల నలయక ఆకుపలముఁ దిని
కడుపులు గాలఁగఁ గరఁగక
బడిబడి లక్ష్మీపతికి దాసులై
పొడవగు పదవుల బొందరొ ప్రజలు

||ఏటి||
పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ
దిక్కుల నంతటఁ దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతిఁ గని
వొక్కమనసుతో నుండరో ప్రజలు

||ఏటి||


ఎందుకు జనులందరు ఈ అశాశ్వతమైన సిరిసంపదలు వెనుక పడతారో తెలియదు.

శాశ్వతమైన శ్రీవేంకటేశ్వరుని భక్తి చెంతనుండగా చాలును.
ఎండలో వేడి భరించక్కరలేదు, చలిలో వణకక్కరలేదు, మంటల్లో ఉడుకక్కరలేదు అండగా వున్న శ్రీహరిని అంతరాత్మ లో తలచుకుని వుంటే. ఇదే పండించే పచ్చని పసిడి బంగారం. ప్రజలారా! తెలుసుకుని చక్కగా బ్రతుకులు సాగించండి.

అడవుల్లో ఉండక్కరలేదు. ఆకులు, అలములు తిని కడుపులో ఆకలి చంపుకుని, తిన్నది అరగక కుండా వుండక్కరలేదు. లక్ష్మిదేవి పతి అయిన నారాయణునికి నిరంతరం దాసులై వుండండి చాలును. ఓ ప్రజలారా! అప్పుడు మీరు గొప్ప గొప్ఫ పదవులు, పుణ్యాలు ఇహపరాలు రెండింటిలోను పొందవచ్చును.

మీరు దేవుళ్ళను, దేవాలయాలు దర్శించ డానికి దేశము నాలుగు దిక్కుల తిరిగి తిరిగి, పాదాలు పై పుండ్లు వచ్చేటట్లు, పొంగిపోయేటట్టు తిరగక్కరలేదు. ఓ ప్రజలారా! మీరు ఒక్క మనస్సు తో చక్కున తిరు వేంకటగిరిపతి అయిన శ్రీవేంకటేశ్వరుని చూసి భక్తి తో పూజించిన చాలు. పుణ్యాలు, స్వర్గాలు, ముక్తి అన్నీ వాటంతటవే లభిస్తాయి.

Saturday, 28 December 2019

అందుకే సుమ్మీ నే జేసే ఆచారాలు - అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.


అందుకే సుమ్మీ నే జేసే అచారాలు దైవమా!
నిందవాయ నా మనసు నాపై నిలుపవె..

బట్టబయట దోలితేను బందెమేయు బసురము
పట్టి మేపితేను తన పనులు సేయు,
ఇట్టె వదిలితేను ఎందైనా బారు మనసు
కట్టుక నేమస్తుడైతే కైవసమై యుండును.

బండి దప్పితే బంట్లు పరదేశు లౌదురు
యెడయక కూడుకొంటే హితు లౌదురు,
విడిచితే ఇటులనే కడకు బారు మనసు
ఒడలిలో నణచితే ఒద్దికై ఉండును.

చే వదలితే పెంచిన చిలుకైన మేడలెక్కు
రావించి గూట పెట్టితే రామా యనును,
భావించకుండితే ఇట్టె పారునెందైనా మనసు
శ్రీ వేంకటేశు గొలిచితే చేతజిక్కి ఉండును.

భావముః    ఈ కీర్తనలో అన్నమయ్య మనసును నిగ్రహించుకుని పరమాత్ముని మీదకు ఏ విధంగా మళ్ళించుకోవాలో   విశదీకరించాడు.

ఓ దైవమా! చంచలమైన నా మనస్సు ఎన్నో నిందలపాలై ఉన్నది. నీవు కరుణించి నీపై నామనస్సు నిలబడేలా చెయ్యి. అందుకే సుమా ఈ ఆచారాలన్ని నేను పాటిస్తున్నాను.

పశువును బట్టబయటకు దోలిన పైరు మేసి బందులదోడ్డి పాలబడి బందీ అగును. అదే మన ఇంటిలో పట్టి ఉంచి మేపితే  మనకు  అవసరమైన పనులు చేయును. అట్లే మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడితే దాని ఇష్టమువచ్చినట్లు తిరిగి, తిరిగి చెడిపోవును. అట్లు వదలక నియమము గల వాడు మనస్సును నిగ్రహించుకొనినచో స్వాధీనమై ఉండును.
కట్టుబాటు తప్పించి వదిలిపెట్టినచో సేవకులు పరదేశులై విచ్చలవిడిగా సంచరింతురు. వారిని అదుపులో పెట్టుకుని, వారితో హితముగా సంచరిస్తే సనిహితులై సేవలు చేయుదురు.ఇట్లే విడిచిపెట్టినచో మనస్సు కూడా మన మాట వినదు. తనలోనే నిగ్రహించినచో చెప్పిన మాట వినును.

తాను ముద్దుగా పెంచుకొన్న చిలుకైనను చేయి వదిలినచో ఎగిరిపోయి మేడలేక్కి, చెట్లెక్కి తిరుగాడును. చేరదీసి పంజరములో నుంచిన మనము చెప్పినట్లు రామా! రామా! అనును. అట్లే భగవంతునిపై మనస్సును నిలపకున్నచో, ఇటు అటూ పరుగులు పెట్టును.   శ్రీవేంకటేశుని పై మనస్సును నిలిపి ధ్యానించినచో స్వాధీనమై మేలు గూర్చును.

Saturday, 21 December 2019

నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
కీర్తన:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే ॥పల్లవి॥
చ.1 మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు ॥ పారేటి ॥
చ.2 పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు ॥ పారేటి ॥
చ. 3 తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
(రాగం: సామంతం; ఆ.సం. సం.3; 286 వ రేకు; కీ.సం.494)
విశ్లేషణ:
ఓ శ్రీవేంకటేశ్వరా! ఒక్కసారి నీ నారాయణ మంత్రాన్ని మంత్రించి జీవులపై వదలినట్లైతే జీవన వ్యాపారాలలో, అనేక మోహాలలో, అనేక అనవసర వ్యాసంగాలతో ఉండే మనుష్యులు తమ తమ భ్రమలను వీడి నీశరణు వేడి కైవల్యం పొందరా! కానివ్వండి…. నారాయణమంత్రరాజాన్ని వదలండి అని జీవులజీవితోద్ధరణకై అన్నమయ్య స్వామిని శరణువేడి ప్రార్ధిస్తున్నాడు
.
ఓ శ్రీనివాసుడా! ఈ జీవులకు మదనభూతం సోకింది. తత్కారణంగా పురుషులు, స్త్రీలు వివశులై విచక్షణ నశించి దిగంబరులై, పెదవులలో రక్తము చిమ్మే దాకా, గోళ్ళతో శరీరంపై గోట్లు పడేదాకా రక్కుకుంటూ, అతిశయించిన మదనోత్సాహంతో అవతలి వారి కుత్తుకలు తెగే వరకూ తెగిస్తున్నారు. దంతక్షతాలు నఖక్షతాలు అనే శృంగార క్రీడ బరితెగించినదని, బజారున పడిందని..వాపోతూ… నిరశిస్తున్నాడు అన్నమయ్య. ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత దౌర్భాగ్య స్థితి.
ఓ పరంధామా! ఈ సృష్టిలోని పంచభూతములు వీరిని పూర్తిగా వశపరచుకొన్నవి. బయటపడలేని భ్రమలలో మునిగి కన్నుమిన్ను గానక కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత హేయమో చూసారా! ఒడలికి మట్టిని పూసుకుని వెర్రి ఆనందంపొందేవాడు ఒకడు. తాంబూల సేవనమే ముఖ్యం అని తలుస్తూ ఆ రసాస్వాదనే జీవిత పరమార్ధం అనుకునేవారు మరికొందరు. జీవులందరికీ ధనపిశాచము పట్టింది. ఉఛ్చనీచాలు పుడమిలో నశించాయి. ధనసంపాదనకు ఏపనికైనా సిద్ధపడుతున్నారు. ఇక మీరు నారాయణ మంత్రం వదలవలసినదే!
ఓ పరాత్పరా! పరంధామా! విపరీతమైన ధనదాహం, కామదాహం కారణంగా జీవులకు మాయా భూతం సోకింది. తద్వారా “తానెవరో!” తెలిసికోలేని స్థితికి దిగజారాడు. నేను అంటే ఎముకలు…తోలు… ఇదే… ఇదే నాజాతి…ఇదే నేనంటే అనే భ్రమ సోకింది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమనే విషయం విస్మరణకు గురి అయినది. అందువల్ల అరిషడ్వర్గాల వలలో చిక్కాడు. జననమరణ చక్రంలో పడి తిరుగుతున్నాడు. వేల సంవత్సరాలు ఇదే తంతు కొనసాగుతోంది. దీని నుంచి “నారాయణ మంత్రం” ప్రసాదించి జీవులను బయటపడవేయ వలసినదిగా ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
భావం..శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.