Wednesday, 24 June 2015

మహాకవి పోతన



మహాకవి పోతన:

రాజుకాని మహారాజు, రాజ్యంలేని కవిరాజు, రాజభోగాలు ఆశించని రాజరాజు, ఆడంబరాలకూ, అహంకారాలకూ త్రోసిరాజు మన బమ్మెర పోతరాజు.

“ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరే! అదేమి చిత్రమో
 పోతన యన్నచో కరిగిపోవు నెడంద; జోహారు సేతకై
 చేతులు లేచు; ఈ జనవశీకారణాద్భుతశక్తి చూడగా
 నాతని పేరులో గలదో! ఆయన భాగవతాన నున్నదో!”

“విద్యావతాం భాగవతే పరీక్షా” అనే కొమ్ములు తిరిగిన పండితులకు కూడా “కొరకరాని కొయ్య”అయినా సంస్కృత భాగవతం సహజ పాండిత్యుని హస్త స్పర్శతో “బాలరసాలం” గా పరిణమించి, పల్లవించి, పుష్పించి, ఫలించి ఆబాలగోపాలానికీ రసానందాన్ని అందించింది.

కవిత్వమనే పాలల్లో భక్తి అనే పంచదార కలిపి భాగావత రసాయనాన్ని పాకం చేసి లోకానికి అందించిన అమృత హస్తం పోతనగారిది. ఆయన కావ్యకన్యక తెలుగువారి గుండెల్లో “మందార మకరందాలు” చిందించింది. తెలుగు జాతిని “నిర్మల మందాకినీ వీచికల్లో” ఓలలాడించింది.

పోతనగారు మనలో ఎంతగానో కలసిపోయారు. మనసులో, మాటలో, పాటలో, పద్యంలో నుడికారాలలో, ఆచారాలలో వెలుగులా  వెన్నెలలా మలయమారుతంలా కలిసిపోయారు. తెలుగువారి నిత్యజీవితాలలో, నిండుహృదయాలలో, ఉచ్చ్వాస నిశ్వాసాలలో ఆ మహాకవి నిండి ఉన్నారు.

ఉదయభానుని కిరణాలలో, యదుకిశోరుని మృదుచరణాలలో చల్లలమ్మే గొల్లభామల్లో, విలుపట్టిన సత్యభామలో, వల్ల వాంగనల వలపుల్లో, పిల్లనగ్రోవి పిలుపుల్లో ఆ మహాకవి కనిపిస్తాడు, వినిపిస్తాడు.. ”ఆహా” అనిపిస్తాడు.

సేకరణ “ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన పోతన భాగవతం (ప్రవేశిక)”
- పొన్నాడ లక్ష్మి

Friday, 19 June 2015

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే - అన్నమయ్య కీర్తన





ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
..
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన .. చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార .. వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
..
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి .. తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార .. వొచ్చెలి వాపోవువాని నూరడించరే
..
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని .. చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన .. తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే

భావం:
శ్రీ కృష్ణుని అల్లరి పనులు, ఆగడాలు మనకు తెలియనివి కావు. ఏమీ ఎరగనట్లు చేసేవన్నీ చేసి అమ్మ దగ్గిర గారాలు పోవడం కూడా వింత ఏమీకాదు. అదే ఈకీర్తనలో అన్నమయ్య మనకు చెప్తున్నాడు.
          ముద్దులు కురిపించే ఇటువంటి బాలుడు ఎక్కడ ఉన్నాడో ? వానిని పట్టి తీసుకువచ్చి కడుపునిండా పాలు పొయ్యమని యశోదమ్మ చెప్తూంది.
          అల్లరిచేసి కట్లు తెంచుకుని వచ్చి కాగుతున్న వెన్నలలో చేమంతిపూల కడియాల చెయ్యిపెట్టి, చిర చిరలాడుతున్న చెయ్యిని చూపించి “చీమలు కుట్టేసాయమ్మా!” అని చెక్కిళ్ళ నిండా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న ఆ చిన్ని బాలుని కాస్త ఓదార్చమని చెప్తూంది ఆ పిచ్చితల్లి.
          దొంగలాగా వచ్చి తన బంగారుమురువులు తొడిగిన చేయిని కవ్వంతో చిలుకుతున్న పెరుగులో పెట్టి ఆ కవ్వముతాకిడికి  “అబ్బా! నొప్పెడుతున్నాదమ్మా!”  అని చెయ్యి బయటికి తీసి నోరంతా చొల్లు కార్చుకుంటూ వాపోవు వానిని ఊరడించమని అంటున్నది.
          ఎప్పుడు వచ్చేడో, మాఇంట్లో జొరబడి పెట్టిలోన ఉన్న వాటికోసం తన ఉంగరాల చేయి పెట్టాడు. మనందరికీ తండ్రి అయిన  వేంకటేశ్వరుడు శక్తిమంతుడు కావున ఆ పెట్టి అతని తలమీదకి ఎత్తమని చెప్తూంది.
          శ్రీ వేంకటేశ్వరుడు అన్ని విధములయిన శక్తియుక్తులు కలవాడు కావున మన బరువు బాధ్యతలున్న పెట్టిని అతని తలపై పెట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చని అన్నమయ్య అభిప్రాయమేమో.        
(పొన్నాడ లక్ష్మి)

Friday, 12 June 2015

దైవము దూరనేల ఎవ్వరూ నేమి సేతురు – మతి వారూ దమవంటి మనుజులే గాక.



13.6.15: ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. దైవము దూరనేల  ఎవ్వరూ నేమి సేతురు – మతి వారూ దమవంటి మనుజులే గాక.
చ. చేరి మేలు సేయగీడు సేయ నెవ్వరు గర్తలు – ధారుణిలో నరులకు దైవమే గాక
    సారె దన వెంటవెంట జనుదెంచె వారెవ్వరు బోరున జేసిన పాపపుణ్యాలే కాక!
2.  తొడగి పొడిగించను దూషించ ముఖ్యులెవ్వరు – గుడిగొన్న తనలోని గుణాలే గాక,
     కడుగీర్తి నపకీర్తి గట్టెడి వారెవ్వరు – నడచేటి తన వర్తనములే కాక!
3.  ఘనబంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు – ననిచిన జ్ఞానాజ్ఞానములే గాక,
     తనకు శ్రీ వేంకటేశు దలపించే వారెవ్వరు – కోన మొదలెరిగిన గురుడే గాక.
భావం:   తమకు చిక్కులెదురైనప్పుడు ఊరక ఇతరులను నిందించుట వలన ప్రయోజనమేమి? తమ విషయములలో ఎవ్వరైన నేమి చేయగలరు? ఆలోచించి చూస్తే వారు కూడా తమవంటి సాధారణ మనుజులే కదా!
          ఇలలో మనుజులకు మేలు చేయుటకైన, కీడు చేయుటకైన దైవమె కర్తగాని ఇతరులెవ్వరును గాదు. తన్ను వదలక వెంటపడి వచ్చునవి తాను వడిగా జేసిన పాపపుణ్యములే గాని పరులేవ్వరు కారు.
          తన్ను చుట్టుముట్టిన గుణదోషములే తన దూషణ భూషణములకు ముఖ్యహేతువు లగుచున్నవి గాని వేరెవ్వరు కారు. తనకు కలిగే కీర్తి అపకీర్తులకు తాను నడుచు నడతలే కారణములు గాని అన్యులు కారు.
          తనకు బంధమైనను. మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానాజ్ఞానములే హేతువులగుచున్నవి గాని తదితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించువాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొక్కడు లేడు.

Friday, 22 May 2015

కలియుగ లక్షణాలు




హనుమ భీమునికి చెప్పిన కలియుగ లక్షణాలు:
భీముడు ద్రౌపది కోరికమేరకు సౌగంధిక పుష్పాల కోసం హిమవత్పర్వాతాలకి వెళ్ళినప్పుడు ఆంజనేయ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు స్వామి భీమునికి కలియుగ లక్షణాలు చెపుతాడు.
కలిలో కాలానుగుణంగా వర్షాలు పడవు. చల్లిన విత్తనాలు పొల్లులవుతాయి. ఎప్పుడూ ప్రజలను కరువు పీడిస్తుంది.పొట్ట గడవక ప్రజలు జన్మభూమిని విడిచి వలసలు పోతారు. పృధివి నిస్సారమవుతుంది. తినే పదార్ధాలలో సారం ఉండదు. ఆ కారణంగా ప్రజలు దుర్బలులు, రోగగ్రస్తులు, మరుగుజ్జులు అవుతారు. అల్పాయుష్కులవుతారు.
వివాహవ్యవస్త, దాంపత్య ధర్మం భ్రస్టు పడతాయి. భార్యలకి తమభర్తయందు సంపాదనననుసరించియే గౌరవం కాని వేరే గౌరవం ఉండదు.అందరిలోనూ స్వేచ్చాప్రవ్రుత్తి ఎక్కువవుతుంది. భార్యాభర్తలు ఇష్టసంచారం చేస్తారు. భార్యాభర్తలు, గురు శిష్యులు పరస్పర వంచకులవుతారు. అత్తమామలను కోడళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. తల్లితండ్రులను పిల్లలు గౌరవించరు.  
క్రయవిక్రయాలలో అంటా కపటమే. దాచుకొన్న సొమ్ము దోచుకుంటారు. పరస్త్రీ, పరధనాలను పటికబెల్లం ముక్కల్లా తినేస్తారు. పున్యపాపాలు, పూర్వజన్మ, పునర్జన్మలు, స్వర్గనరకాదులు లేవంటారు. ఎవరి దగ్గర శాస్త్ర పాండిత్యము ఉండదు. వాగాడంబరము మాత్రం ఉంటుంది. వేదనింద అధికమౌతుంది. శరీరం మీద శ్రద్దే కాని ఆత్మవిచారణ చెయ్యరు.
భగవంతుడు లేదంటారు.ధనవంతున్ని కొలుస్తారు. ఇచ్చేపాలని బట్టి గోవు మీద గౌరవం అంతేకాని గోవుయందు పవిత్రభావం ఉండదు.బ్బ్రాహ్మణునియందు  గౌరవభావముండదు. హింసాప్రవ్రుత్తి అధికమౌతుంది. స్వార్ధంతో స్వధర్మాని విడిచి భయావహమైన పరధర్మాన్ని ఆశ్రయిస్తారు.
ముఖ్యంగా స్త్రీలు దుష్టులౌతారు. వ్యభిచారిణులౌతారు మనసుకునచ్చినవాడే మగడంటారు. వివాహ విషయంలో కులగోత్రాలు పట్టించుకోరు. వర్ణవ్యవస్థ నడవదు. ధనవంతుడే రాజు. ధనంతో కొనలేనిది ఏదీ ఉండదు. నటులు ప్రభువులౌతారు. దొంగలే రక్షకులౌతారు. పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోరు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. అనాధలౌతారు.
దేవాలయ భూములను ఆక్రమించుకుంటారు. దైవదర్సానానికి ధనం గుంజుతారు. భక్తీ సంపాదనకు మార్గమౌతుంది. నిషిద్ధ పదార్ధాలను సేవిస్తారు. అందరూ మాంసాహారులౌతారు. బ్రాహ్మణులు అనాచారవంతులై కుక్కలను పెంచుతారు. దొంగలు, నాస్తికులు, పాషండులు ప్రభువులౌతారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులే భక్షకులై ప్రజలను దోచుకుంటారు.
ఇంకా ఎన్నో హనుమ చెప్పాడు. మహాభారత కాలంలోనే ఇప్పటి పరిస్థితులు ఊహించి రాసారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో వన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉన్నాయి.
అప్పుడు భీముడు వికలమనస్కుడై అన్నా! ఆంజనేయా! వింటుంటేనే భయోత్పాతాన్ని కలిగించే ఈ కలిప్రభావ్వాన్నుండి తప్పించుకొనే ఉపయమేమీ లేదా? అని అడిగాడు. సమాధానంగా హనుమ ధృడ గాత్రంతో “సోదరా! భవిష్యద్బ్రహ్మ ఐన నన్ను ఎవరు భక్తితో ఆరాధిస్తారో, కనీసం నా నామాన్నైనా సరే జపిస్తారో వారిని ఈ కలిదోషాలేమీ అంటవు. నా భక్తులంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ‘ఆంజనేయా!’ అని ఆర్తితో పిలిస్తే చాలు వారి చెంత వాలుతాను. ఆపన్నులను రక్షించడం కంటే నాకు వేరే కర్తవ్యమ్ లేదు అని చెప్పాడుట.  జయహో ఆంజనేయా!..
పొన్నాడ లక్ష్మి
 సేకరణ : అనుసృజన “సాహిత్య కళానిధి” విశ్వనాధం సత్యనారాయణ మూర్తి. సంపూర్ణ హనుమత్ చరిత్రము వచన కావ్యం నుండి.