Friday, 12 April 2019

రామ మిందీవర శ్యామం, పరాత్పర ధామం సురసార్వ్వ్భౌమం భజే. - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన..

రామ మిందీవర శ్యామం, పరాత్పర
ధామం సురసార్వ్వ్భౌమం భజే.      !!

సీతావనితా సమేతం
పీత వాసర బల వ్రాతం
పూతకౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం             !!

వీరం రణరంగ ధీరం
సారధర్మ కులోధ్ధారం
క్రూర దానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం      !!

పావనం భక్త సేవనం
దైవిక విహగవధావనం
రావణానుజ సంజీవనం
శ్రీవేంకట పరిచిత భావనం            !!

ఈ కీర్తనలో పదకవితాపితామహుడు పరిపరి విధాలుగా ఆ పట్టాభిరాముడిని ప్రస్తుతించాడు. ఆ పరంపరలో రచించినదే ఈ సంస్కృత కీర్తన. అన్నమయ్య ఈ పదామృతంలో అయోధ్య రాముడి వైభవాన్ని అద్భుతంగా అక్షరీకరించాడు.

ఓ రామా! నీవు నల్లకలువల శ్యామవర్ణంతో కూడిన శరీరచాయను కలవాడవు. నీవే ముక్తి స్థానానివి. దేవతలకే సార్వభౌముడి వంటి వాడవు. అలాంటి నిన్ను భజిస్తున్నాను స్వామీ..

రామా నీవు సీతాదేవితో కూడి ఉన్నవాడవు. పసుపుపచ్చని దేహవర్ణం కల వానర సైన్యమంతా నిన్ను కొలుస్తూ ఉంటారు. కౌసల్యాదేవి గర్భాన జనియించి సూర్యవంశానికే దీప్తిమంతుడవయ్యావు. నీవు మునిజనుల భయాలని పారద్రోలి, తేజోవంతంగా ప్రకాశించావు.
ఆ లక్ష్మణాగ్రజుడు వీరాధివీరుడు రణరంగధీరుడు. ధర్మం అనే కులాన్ని ఉధ్ధరించడానికి ఈ భువిలో అవతరించినవాడు. క్రూరమయిన రాక్షసులను సంహరించినవాడు. శూరత్వానికి, సుగుణాలకు, సదాచారాలకు నెలవైనవాడు. ఆ అయోధ్యరాముడు అసురులపాలిట ఎంత అరివీర భయంకరుడో, ఆప్తులపాలిట అంత ఆశ్రితపాలకుడు.
నిరంతరం భక్తులచే సేవలందుకుని ఆ పావనమూర్తి మానవులకే కాదు మూగజీవాలకూ ముక్తినిస్తాడు. ఇందుకు నిదర్శనం జటాయువే. సీతాపహరణ వేళలో రావణుని చేతిలో హతమైన ఆ విహంగానికి శ్రీరాముడు అంత్యేష్టి సంస్కారాలు చేసి దేవతలకిచ్చే స్థానాన్ని ఇచ్చాడు. చివరకు తన ప్రత్యర్ధి అయిన రావణుడు సోదరుడు విభీషణుని సంజీవనిగా రక్షించాడు. ఇన్ని ప్రాభవాలతో కూడిన ఆ కల్యాణరాముడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిగా వెలిసాడు. ఆ ఘట్టాలన్నింటినీ గుర్తుచేస్తూ ఈ సంకీర్తనకు ముక్తాయింపు పలుకుతున్నాడు పదకవితా పితామహుడు.

Friday, 15 March 2019

ఆది దైవుఁడై అందరిపాలిటి – కీ దేవుఁడై వచ్చె నితడు - అన్నమయ్య కీర్తన





ఈవారం అన్నమయ్య కీర్తన

ఆది దైవుఁడై అందరిపాలిటి –
కీ దేవుఁడై వచ్చె నితడు ||పల్లవి||

కోరినపరమయోగుల చిత్తములలోన
యేరీతినుండెనో యీతఁడు
చేరవచ్చినయాశ్రితులనెల్లఁ బ్రోవ
యీరీతి నున్నవాఁ డీతడు ||ఆది||

కుటిలదానవుల కోటానఁగోట్ల
యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు
ఘటియించి యిటువంటికారుణ్యరూపుఁడై
యిటువలె నున్నవాఁడీతడు ||ఆది||

తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా-
నెక్కడ నుండెనో యీతఁడు
దిక్కుల వెలసినతిరువేంకటేశుఁడై
యిక్కడ నున్నవాఁడీతఁడు ||ఆది||

ప్రకృతిమాత ఒడిలో జనావాసానికి దూరంగా ఎక్కడో ఒక మూల ఎవరికీ తెలియకుండా వుండి, తనకు తానుగా ఏ హడావుడీ అట్టహాసమూ లేకుండా, సవ్వడిలేకుండా పారుతూ, అందులోనే ఆనందాన్నంతా పొందుతున్న సెలయేరులాగా వుంటుంది ఈ సంకీర్తన పదం. దానికదే ఏ గొడవతోనూ సంబంధం లేకుండా పాట సాగిపోతున్నట్లు, మాటతో మాట చాలా సహజంగా ఒకదానితో ఒకటి ముడిపడిపోయినట్లు ఒకదానితో ఒకటి చాలా ఇష్టంగా అల్లుకుపోయి ఆవంతున అంతలోనే పాట పూర్తయిపోయినట్లుగానూ వుంటుంది చదవడం పూర్తయేటప్పటికి.

ఏమీ కష్టమయిన మాటలు లేవు ఇందులో. తెలీని, అర్ధంగాని సంగతులు కూడా లేవు. అందుకే అంత అత్మీయంగా వుంటుందనుకుంటాను. ఎంత ఆత్మీయత అనుభవించకపోతే, వెంకటేశ్వరుని ‘ఇతడూ… ఇతడూ’ అని ఏదో స్నేహితుని గురించి చెబుతున్నది అన్నట్లు – సంబోధిస్తాడు అన్నమయ్య! అంతరంగంలో చాల తాదాత్మ్యము, స్వచ్చత ఉండాలిగదా ఆ చొరవ, ధైర్యం రావడానికి!

రాగం ‘సామంతం’ లో పాడబడుతుందట ఈ సంకీర్తన!

ఈ సంకీర్తనలో, విశేషమైన తెలివితేటలూ, యోచనా అనేవి ఏమీ లేకుండా నిర్దేశిత మార్గంలో జీవితాన్ని గడుపుతూ, రోజువారి బ్రతుకులో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆటుపోట్లనూ ఏలాగో తట్టుకుంటూ బ్రతుకులను ఈడుస్తూ, కష్టం వచ్చినప్పుడల్లా బ్రోవవయ్యా స్వామీ అని మనసులో కోటి దండాలు పెట్టుకుంటూ దరి చేరే సామాన్య భక్తుడి పట్ల వేంకటేశ్వరుని కరుణామయ ద్రృష్టి ఆవిష్కృమైంది అని నేను అర్ధంచేసుకున్నది.సాంసారిక జీవితాన్ని త్యజించి కఠినమైన నియామలతో, జ్ఞానవంతమైన బుధ్ధితో సేవించే పరమ యోగులైన వారికి ఏ రూపంలో దర్శనమిస్తాడో గాని, ఇవేవీ లేకుండా మామూలు జీవితం గడిపే సామాన్య సంసారికి మాత్రం కష్టాలనుంచి గట్టెక్కించడానికి వున్నాడు గదా ఇతడు అని అన్నా, బలవంతులయిన కోటానుకోట్ల దానవులను నిర్జించగలిగేంత విశేష శౌర్యవంతుడవైనా ఇక్కడ అలాంటి బలమేమీ లేని దుర్బలుడైన మామూలు సంసారికి ఇతడిది ప్రసన్నమైన కరుణామయ రూపం అని అన్నా, సకల భువనాలను తానుగా మోసి అప్పుడు తానెక్కడ వున్నాడో తెలియదు గాని, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండ నాయకుడై కరుణతో ఇక్కడ వెలిశాడు అని అన్నా…. ఇవన్నీ సామాన్య భక్తుని మీద శ్రీ వేంకటేశ్వరునికి వున్న కరుణామయ దృష్టిని విశదం చెయ్యడానికే!

(అంతర్జాలం నుండి సేకరణ )

Saturday, 9 March 2019

కరుణానిధిం గదాధరం శరణాగతవత్సలం భజే - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.
కరుణానిధిం గదాధరం
శరణాగతవత్సలం భజే !!
శుకవరదం కౌస్తుభాభరణం
అకారణప్రియ మనేకదం
సకల రక్షకం జయాధికం
సేవక పాలక మేవం భజే !!
వురగ శయనం మహోజ్వలం తం
గరుడారూఢం కమనీయం
పరమపదేశం పరమం భవ్యం
హరిం దనుజ భయదం భజే !!
లంకా హరణం లక్ష్మీ రమణం
పంకజసంభవ భవప్రియం
వేంకటేశం వేదనిలయం
శుభాంకం లోకమయం భజే !!
భావ మాధుర్యం. శ్రీమాతి బి. కృష్ణకుమారి.
ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీమహావిష్ణువుని కరుణానిధిగా ఆర్తత్రాణపరాయణుడిగా అభివర్ణిస్తున్నాడు.
ఆ సర్వేశ్వరుడు తన వైభవాన్ని లోకానికి వినిపించే అరుదైన వరాన్ని శుకమహర్షికి ప్రసాదించాడు. పరీక్షత్తుకు శ్రీమద్భాగవతంగా ప్రభోదించేలా చేసాడు. అదేవిధంగా ఆయన ఏకారణమూ లేకుండానే ఈ లోకంలో ఎల్లరినీ ప్రేమిస్తూ అకారణప్రియుడిగా ఆరాధనలను అందుకుంటున్నాడు.
సర్వజీవులనూ రక్షించడమే కాదు, ఆయన సకల విజయాలనూ అందించేవాడు కూడా..తనను సేవించుకునేవారిని పరిపాలించుకునే సర్వసమర్ధుడు.
శ్రీమహావిష్ణువు పవళింపుసేవకు తన పాన్పుగా మారి శేషుడు తన జన్మని సార్ధకం చేసుకున్నాడు. ఉరగశయనుడు అన్న స్వామి నామంలో తను ఇమిడిపోయాడు. అవసరమైనప్పుడల్లా ఆ మహోజ్వలమూర్తిని మోస్తూ గరుడుడు చిరకీర్తిని ఆర్జించాడు. అలాగే భయంకరమైన అసురలను అంతమొందించి ఆ హరి వారికి మోక్షప్రాప్తిని కలిగించాడు. తన భక్తులకుమాత్రం తనే పరమపదమై ప్రకాశిస్తున్నాడు.
ఆ లక్ష్మీనాథుడు శ్రీరామునిగా అవతరించి రావణలంకను జయించాడు. పద్మంనుంచి పుట్టిన బ్రహ్మదేవుడి చేత, శుభంకరుడైన శంకరుడి చేత
పూజలందుకున్నాడు. కలియుగంలో వేంకటేశుడై వేదనిలయమైన వేంకటాచలంపై వేంచేసి ఉన్నాడు. శుభ చిహ్నాలు కలిగినవాడై లోకాలన్నీ తనే వ్యాపించి ఉన్నాడు.

Monday, 25 February 2019

అన్నియు నందే యున్నవి అదిగో మాట - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన :

అన్నియు నందే యున్నవి అదిగో మాట
ఎన్నుకొనే దినములు ఇదిగో మాట ॥

సీత నీకు జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె
నాతల నే మెరంగము అదే మాట
చేతి నీ ఉంగరమును శిరసున నెత్తుకొనె
ఏ తలంపు నెట్లవునో ఇదిగో మాట ॥

తాడుపడ్డమేనితోడ తలంపు నీకొప్పగించి
ఏడవుతా నెరంగదు ఇదివో మాట.
పాడిదప్ప దించుకంతా పదిల మాకెగుణము
ఆడ నేమి జోటులేదు అదిగో మాట. ॥

తెరవ నీకు బాసిచ్చె దేవతలమాట విను
ఎరింగినదే ఇందరు ఇదిగో మాట.
గురుతై శ్రీవేంకటాద్రి గూడితి రిద్దరు మీరు
అరిమురి రామచంద్రా అదిగో మాట.
భావ మాధుర్యం :

ఈ కీర్తన విశ్లేషణ అనుకున్నంత సులభం కాదు. ఎవరు ఎవరికి చెబుతున్నారో కూడా అంత తేలికగా అర్ధం కాదు. ఇది హనుమంతుడు శ్రీరామునికి వినిపిస్తున్న లంకలో సీతాదేవి దర్శనం. 

రామచంద్రా ! ఇదిగో ఈ మాట విను. అన్ని భావాలు ఈ సందేశంలోనే ఉన్నవి. ఈ ఒక్క మాట విను. సీతమ్మ కడసారి ఆశతో దినములు లెక్కించుకుంటున్నది. సీతమ్మ తన శిరోమణి నా చేతికిచ్చి ఈ సందేశం వినిపించింది. ఆ తరువాత ఏమి కానున్నదో నేనెరుగను. ప్రభూ ! నీ చేతి ఉంగరము తన శిరసున ఉంచుకుని, తన ఆశలేమౌతాయోనని రోదించింది. ఇదిగో ఈ మాట విను ప్రభూ. ఆమె కృశించిన మేనితో తలపులన్నీ నీపై నిలిపి రోదించుచున్నది. ఆమె సుగుణరాశి. అణుమాత్రమూ ధర్మము తప్పని సుశీల. కదులుటకు వీలు లేని చోటున ఉన్నది. ఆ వనితామణి నీకు దేవతల బాసను గుర్తు చేసింది.
అందరికీ నీ ప్రతిజ్ఞ రాక్షస సంహారం అని తెలుసు. శ్రీ వేంకటాద్రి మీద నీకు ఏదబాటు లేదు రామచంద్రా. యుగాల పర్యంతం నీకదే స్థిర నివాసం.

భావ విశ్లేషణ : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.

Friday, 15 February 2019

కొట్టరో ఉట్టులు గోపాలబాలురు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన.
కొట్టరో ఉట్టులు గోపాలబాలురు
ఇట్టే కృష్ణుని ఎదుటను
పట్టరో వారలు పాలు నేతికిని
గట్టిగ జోరున గారీ నవిగో ॥
కూడరో మూకలు కోలలవారలు
వేడుక గృష్ణుని వెంటవెంట
ఆడుచు మెసగరో అడుకులు జక్కిలాలు
వాడల వాడల వరుసతోను ॥
నిక్కితీసుకోరో నెరవారికాండ్లు
మక్కువ గృష్ణుని మరంగునను
ఎక్కరో శ్రీవేంకటేశు కొండమీద
పెక్కు నురుగులు పెరుగులు నివిగో ॥
భావ మాధుర్యం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తన అధ్యాత్మ కీర్తన అంటే బాగుంటుంది. శ్రీ కృష్ణుడు ఎక్కడ చూసినా అలిమేలుమంగను మచ్చికతో కలిసి ఉన్నవాడే. ఉట్ల పండగ జరిగే కృష్ణాష్టమి నాడు దీనిని చెప్పి ఉంటారు.
గోపాల బాలుల్లారా ! ఉట్లను పగులగొట్టండి. ఇట్టే శ్రీకృష్ణుడు మీ ఎదుటనే ఉన్నాడు. పాలు, నెయ్యి కారిపోతున్నాయి జోరుగ ధారగ. దోసిలిపట్టి తాగండి. గుంపుగా కూడి కోలాటాలు వేడుకగా కృష్ణునితో కలిసి ఆడండి. ఆడుతూనే రేపల్లెలోని ప్రతి వాడకూ పోయి అటుకులు, చక్కిలాలు తినండి. ఓ సామర్ధ్యంగల కుర్రవాండ్లూ! ఎత్తుగా ఎగిరి ఈ ఉట్టిని కొట్టండి. కావాలంటే కృష్ణుడు మీ ముందున్నాడు. శ్రీ వేంకటేశ్వరుని కొండ ఎక్కారంటే బోలెడంత పాల నురుగులు, పెరుగులు దొరుకుతాయి.

Wednesday, 16 January 2019

యిరవగుజీవుల కెంతగలిగినా పరధనకాంతలే బలుప్రియము - అన్నమయ్య కీర్తన






అన్నమయ్య కీర్తన :
ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? కనుక భగవంతుని శరణుజొచ్చి మాయ మేలిముసుగులో నుంచి మనం బయటపడాలి. ఏదో ఒక అద్భుత సంఘటన జరిగి ఆ శ్రీహరి కృప కలిగితే చెప్పలేము కానీ అన్యులకు ఇది దుస్సాధ్యం అంటున్నాడు అన్నమయ్య.
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము ॥కటకట ||
చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు ॥కటకట॥
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె ॥కటకట॥
విశ్లేషణ:
అయ్యయ్యో! ఈ మాయను దాటడం ఎటుల? అర్ధం కావడంలేదు. ఏదైన దైవ సంఘటన జరిగి ఆ శ్రీనివాసుని దయ కలిగితే వేరే విషయం కానీ మామూలుగా దాట శక్యమా!
చ.1.
ఆహా! శ్రీహరీ! ఈ భువిపై స్థిరంగా ఉన్న జీవులు ఎంత చిత్త చాపల్యం కలిగినవారు? వీరికి ఎంత ధనం ఉన్నప్పటికీ పరధనం మాత్రమే వీరికి ప్రియము. ఇంట సతి ఉన్నప్పటికీ పరకాంతలమీదనే వీరి ధ్యాస! ఈ భూమిపై పుణ్యకార్యాలు చేయాలంటేనే అందరికీ కష్టం. పాపకార్యాలు వరుసగా చేస్తూఆ విషయంలో మాత్రం ముందుంటారు కదా!
చ.2.
మనకు తినడానికి తయారుగా అనేక పదార్ధాలు ఉన్నప్పటికీ, మనకు కాని పదార్ధమే ఎక్కువ తీపుగా ఉంటుంది కదా! పొరుగింటి పుల్లగూర రుచి చందాన ఉంటుంది మన నైజం. అలాగే మనం ఎంతో కష్టపడి గురుశుశ్రూష చేసి వేద,వేదాంగాలను చదువుకుని నెమరు వేసుకోవడానికి భగవంతుడిని ధ్యానించడానికి నాలుకపై తయారుగా ఉన్నప్పటికీ, మనం అనకూడని మాటలు పాపపూరిత భాషణలే సదా చేస్తూ ఉంటాము. అవే మనకు ఇష్టంగా ఉండడం మాయకాకపోతే మరి ఏమిటి?
చ.3.
అందరి హృదయక్షేత్రాలలో స్థిరంగా నెలకొని శ్రీవేంకటేశ్వరస్వామి ఉండగా, తేలికగా అనుగ్రహం కలుగుతుందని వెళ్ళి చిల్లరదేవుళ్ళను చేరి ఇష్టప్రీతి కొలవడం ఎందుకు? తగిన సమయంలో గురువుగారి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదం పొందవలెను గదా! అలా చేసినట్లైతే మనకు అనేక సమస్యలు నశించి ధన్యులవడం తధ్యము అని అన్నమయ్య నివేదిస్తున్నాడు.

అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే - అన్నమయ్య కీర్తన




అన్నమయ్య కీర్తన
పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము
లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే
చ.1. దండితో దనకు గాని ధరణీసు రాజ్యంబు
యెండె నేమియది పండే నేమిరే
బెండు పడ గేశవుని బేరుకొనని నాలికె
వుండనేమి వుండకుండ నేమిరే ॥ అక్కర ॥
చ.2. యెదిరి దన్ను గానని యడపుల గుడ్డికన్ను
మొదల దెరచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతి సేవ వేడుక జేయని వాడు
చదివెనేమి చదువు చాలించె నేమిరే ॥ అక్కర ॥
చ.3. ఆవల నెవ్వరు లేని అడవిలోని వెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుని జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిన నేమిరే ॥ అక్కర ॥
భావం :
మనదగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ మనకు అవసరమైనప్పుడు అది మనకు అక్కరకు రావాలి కదా! అలా కానప్పుడు ధనం ఎంతవున్నా ఉపయోగశూన్యమే కదా! అసలు లేకపోయినప్పటికీ ఉపయోగం ఏమీ ఉండదు అని అర్ధాన్ని గూర్చిన గొప్ప సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
1. దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి లేక మహారాజుకు ధనం దండిగా ఉండాలి. అలా కాకపోతే ఆ రాజుగారికి ఏమి ఉపయోగం ఉండదు కదా! బలహీనుడైన మానవుడు కేశవుని నామం జపించి రక్షణ పొందాలి అలా కాని నాడు ఆ నాలుక ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?
2. విరోధులను ఎదిరించడానికి కండ్లు కావాలి. దానికి ఉపయోగించనటువంటి కన్నులు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అలాగే శ్రీపతిని కన్నులతో వెదకి వెదకి పట్టుకుని సేవించగలగాలి. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపయోగం ఏమిటి?
3. ఎటువంటి మనుష్య సంచారంలేని అడవిలో ఎంత పున్నమి వెన్నెలలు కాస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఆ వెన్నెల చీకటిని తొలగించినా ఏమీ ఎవరికీ ఉపయోగం ఉండదు కదా! మానవుడు ఏ ధర్మ శాస్త్రాలు చదివినా పురాణాలు చదివినా దానికి పరమార్ధం ఏమిటి? చదివినది ఏ చదువైనప్పటికీ అది శ్రీవేంకటేశ్వరుని దరికి జేరే మార్గం నేర్పాలి. అలా కానప్పుడు మన జీవనంలో ఎన్ని వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు పురాణాలు చదివితే నేమిటి? చదవకపోతే నేమిటి? అన్నీ వృధానే కదా!