Sunday, 22 September 2019

ఇచ్చుటలో ఉన్న హాయి. కథానిక.


ఇచ్చుటలో ఉన్న హాయి..

“అమ్మా” అన్న పనిమనిషి రమణమ్మ పిలిపుతో ఆలోచనలలోనుండి బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టింది లలిత.
అమ్మో అప్పుడే ఎనిమిది అయిపోయిందా? రమణమ్మ వచ్చేసింది అనుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది. సూర్యచంద్రులే గతులు తప్పినా, ప్రపంచమే తల్లకిందులయినా రమణమ్మ మాత్రం సరిగ్గా ఎనిమిది గంటలకి గుమ్మంలో ప్రత్యక్ష్యం అవుతుంది. అంత చక్కని సమయపాలన ఆమెది.  పిల్లలు స్కూల్  కి  వెళ్ళాక కాసేపు విస్రాంతిగా కాఫీ తాగుతూ సేద తీరుతూంటుంది లలిత. రమణమ్మ వచ్చాక మళ్ళీ దినచర్య మొదలు.
రోజూ నవ్వుతూ పలకరించి, గలగలా మాట్లాడుతూ, కాస్త లలితను సాధిస్తూ చకచకా తనపని తాను చేసుకుపోతూ ఉంటుంది రమణమ్మ..   కానీ ఈ రోజు మాత్రం ముభావంగా దిగులుగా కనిపించింది. మొహం చిన్నబోయి ఉంది. “ఏమయింది రమణమ్మ అలా ఉన్నావు? ఒంట్లో బాగులేదా” అని అడిగింది లలిత. “ఏటోనమ్మా మేము ముసలోళ్ళం అయిపోనామంట! మమ్మల్ని పనిలోంచి తీసేసి వేరే వయసోళ్ళని పన్లోకి పెట్టుకుంటారట” అంది దీనంగా.
రమణమ్మ వాళ్ళది గొదావరి జిల్లాలో చిన్న గ్రామం. అక్కడ జీవనోపాధి కుదరక బందువులసాయంతో హైదెరాబాద్ వచ్చి అపార్త్మెంట్లో పనికి కుదురుకున్నారు. లలిత వాళ్ళ పక్క అపార్త్మెంట్ లో రమణమ్మ భర్త వాచ్ మెన్ గా చేస్తున్నాడు. రమణమ్మ నాలుగిళ్ళలో పని చెసుకుంటూ భర్తకు చేదోడు వాదోదుగా ఉంటూ గుట్టుగా కాలం గడుపుతున్నారు. వారిక్ ముగ్గురు కుమార్తెలు. వారికి పెళ్ళిళ్ళు చేసి ఉన్నలో ఉన్నంత ముద్దుముచ్చట్లు, పెట్టుపోతలు చూస్తుంటారు. వాళ్ళు కూడా హైదెరాబాద్లోనే వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు, పండక్కి, పున్నానికి వచ్చి పోతుంటారు.
కాలం ఎప్పుడూ ఒక్కలా నడవదు. రమణమ్మ భర్తకి రెండేళ్ళక్రితం క్షయ వ్యాధి సోకి సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. రమణమ్మే ఇటు భర్తను చూసుకుంటూ, అటు అపార్త్మెంట్ పని కూడా తనే చేసుకుంటూంది. ఆమె పనితో సంతృప్తి చెందని వారు,  వీరిని తొలగించి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రమణమ్మకి పుట్టెడు బెంగ పట్టుకుంది.  తన గోడంతా లలితకి చెప్పుకుని బాధపడింది. మరి నీ పిల్లలు ఉన్నారుగా వారికి చెప్పలేక పోయావా? వారి దాపునే ఉండి నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చుగా అంది లలిత. “అయ్యో తల్లే ఏం చెప్పమంటావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి చెప్తే “మా సంసారాలు  మేమే ఏదుకోలేకపోతన్నం. ఇంక నిన్నూ ఆ రోగిష్టి ముసలాడిని ఎక్కడ సూడగలం? మా మొగోళ్ళు ఒప్ప్పుకుంటారేట్?” అని కుందబద్దలుకొట్టినట్లు చెప్పేసారమ్మా అంది బాధగా..సరే.. ఏదో మార్గం అలోచిద్దాంలే! నువేమీ బెంగపడకు రమణమ్మా! అని ఆమెకు ధైర్యం చెప్పి పంపించింది.
లలిత యోగా టీచెర్. ఉదయం సాయంత్రం క్లాసులు చెప్తూ ఉంటుంది. మిగతాసమయం ఖాళీ కదా అని ఈమధ్యే ఒక ప్లే స్కూల్ ఆరంభించి నడుపుతూంది. స్కూల్ ని తన చాకచక్యంతో, తెలివితేటలతో  కొద్ది కొద్దిగా అభివృధ్ధి పథంలోకి తీసుకు వెల్తూంది. భర్త పిల్లలు వెళ్ళాక మిగత సమయాన్ని ఇలా వినియోగించుకుంటూంది. రమణమ్మ సమస్యని విని, ఆమెకెలాగయినా  ఏదో ఒక మార్గం చూపాలని ఆలోచిస్తూంది. రాత్రి భర్త తో కూడా ఈ విషయం  ప్రస్తావించింది.
ఈ మధ్యే లలిత ప్లే స్కూల్ అభివృధ్ధి చేసే ఉద్దేశంలో పిల్లల సామానులు, ఆట బొమ్మలు కొన్ని పెట్టుకుందికి పక్కనే ఒక గది తీసుకుంది. అది మదిలో మెదలి లలిత ఆలోచనకి ఒక రూపు వచ్చింది. మర్నాడు రమణమ్మతో ‘నువ్వు ఏం బెంగ పెట్టుకోకు  మా స్కూల్ లో ఆయాగా చేద్దువుగాని, నీకు అక్కడ ఒక గది ఇస్తాను. నువ్వు మీ ఆయన అందులో ఉండొచ్చు.ఓపికను బట్టి  మీ ఆయన ఏదైనా చిన్న పని చెయ్యొచ్చు. నువ్వు కూడా అక్కడ ఒకటి రెందు ఇంటి పనులు చేసుకో” అని చెప్పింది. ఒక్కసారి రమణమ్మ కళ్ళలో నీళ్ళు చిప్పిలాయి. సొంతపిల్లలు కూడా మా గురించి ఈపాటి అలోచించలేదమ్మా.. నామీద ఇంత నమ్మకంతో, సానుభూతితొ దారి చూపిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవలమ్మా “ అన్న రమణమ్మతో “అంత పెద్ద మాటలు వద్దు ఏదో నాకు తోచిన సాయం చేస్తున్నాను అంది లలిత.  రమణమ్మ ముఖంలో సంతోషం, ధీమా చూసి ‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’ అని సన్నగా పాడుకుంటూ సంతృప్తిగా, ఉత్సాహంగా దినచర్య ప్రారంభించింది.



No comments:

Post a Comment