21..9..19..ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఆతడే ఇన్నియును నిచ్చు
నడిగిన వల్లాను
చేతిలోనే ఉండగాను చింతించరు హరిని. !!
చ. వలెనంటే సంపదలు వట్టి యలమట బెట్టు
అలసి నోపనంటేను అండనే ఉండు.
తలచి ఇందరు నీ తరితీపుల జిక్కి
తలచ రెందును బరతత్వమైన హరిని. !!
౨. ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి.
పోసరించి ఇందరు నీ పొందుల భ్రమలబడి
పాసివున్నారదే తమ పతియైన హరిని. !!
౩. గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
పట్టపగలైతే తమ పాల నుండును.
బట్టబయలు సందిలి పెట్టేరు గాని చే
పట్టరు శ్రీ వేంకటాద్రిపైనున్న హరిని. !!
భావము.. ఆ పరమాత్ముని భక్తితో ప్రార్ధించినచో జీవుల
కోరికలనెల్లా తానే నెరవేర్చును. అందుబాటులో అనగా తమ హృదయమునందే ఉన్న హరిని గూర్చి
చింతించలేరు.
కావలెనని సంపదలను ఆశిస్తే అవి
మనల్ని తిప్పలు బెట్టి అందకుండా పోతాయి. వాటిపై విసిగి, అవి నాకక్కర్లేదు అనుకొని
ఆశ వదలిపెట్టి భగవంతునిపై భారముంచినచో తమకు తామే అవి మన చెంతకు వచ్చి చేరును. ఈ
సూక్ష్మమును తెలియక సంపదల వ్యామోహములో పడి పరతత్వమైన హరిని నమ్మలేకున్నారు.
పురుషులు ఆశపడి వెంటబడిన
పడతులు బిగువు చూపుదురు. కాస్త నిగ్రహము చూపి వారే బెట్టుగానున్నచో అ పడతులే తమ
చెంతకు చేరుదురు. కాని జనులందరూ స్త్రీలపై వ్యామోహముతో వారికై ఆతాటపడి తమ
స్వామియైన శ్రీహరిని వీడి యున్నారు.
రాత్రి గాఢనిద్రలో నున్నప్పుడు
ఈ ప్రపంచమంతా కలవలె తోచును. కానీ తెల్లవారేసరికి అంతా ఎప్పటిలాగే కనుపించును.
ఇంతగా అశాశ్వతమైన ఈ ప్రపంచములో జీవులు బట్టబయలు పందిలి వదిలిపెట్టినట్లుగాఏమో
సాధింపగోరి వ్యర్ధ ప్రయత్నములు చేయుచున్నారే కానీ శాశ్వతుడై శ్రీ వెంకటాద్రి మీద
నున్న శ్రీహరినిమాత్రము విశ్వసించరు.
No comments:
Post a Comment