అన్నమయ్య కీర్తన..
నీ సందిమోహము గానవచ్చెను
చింతతీర
బుజ్జగించి చిత్తగించరాదా. !!
మొగమున
గళదేరె మోవిపైకి నవు వచ్చె
మగువ
నీతోనేమని మాట చెప్పెనో
సగటున
నటునిటు పరాకులేల సేసేవు
తగు
విన్నపములవధరించరాదా !!
కన్నుల
దేటలవారె కాయమెల్ల బులకించె
కన్నెనీతోనికనేమి
సన్న సేసెనో
చిన్ని
లేతసిగ్గులను శిరసేల వంచేవు
వన్నెల
నేకతాన కవసరమీరాదా !!
నిలువెల్ల జమరించె నిట్టూర్పులు రేగె
కలికి నిన్నుటువలె గాగలించెను
అలమి శ్రీవేంకటేశ అట్టే నీవు గూడితివి
మలసి ఇటువలెనే మన్నించరాదా !!
భావమాధుర్యం
అన్నమయ్య ఈ కీర్తనలో తనను చెలికత్తెగా
భావించుకుని స్వామితో ఇలా అంటున్నాడు.
స్వామీ ! ఈమధ్య ఒకరంటేఒకరికి ఎడతెగని మోహము
కానవస్తూనే ఉంది. మరింకా తటపటాయిస్తావెందుకయ్యా ? ఆమె దిగులు పోగొట్టి అనునయించి
ఆమెను స్వీకరించరాదా ?
నీవు మాట్లాడగానే నీకేమాట చెప్పిందోగాని ఆమె
మొగమున కళలన్నీ తాండవించాయి. అదే నీవు కాస్త పరధ్యానంగా పెడమొగము పెట్టుకుంటే ఆమె
తల్లడిల్లిపోతుంది. కాస్త మా మాట విని ఆమె చెప్పే విన్నపములు చెవిని పెట్టుకోరాదా
?
ఆ కన్యారత్నము నీకేమి సైగ చేసిందో మేము
చూడలేదుగాని ఆమె తీరు చూచినావా ? తన కాయమెల్ల పులకించిపోయింది. కన్నులు మిలమిలా
మెరుస్తున్నాయి. చిన్నగా సిగ్గులు చిందించే మోముతో తన శిరస్సును వంచింది. ఆమె నీతో
ఏకాంత సేవ కోరుతోంది. దానికి తగిన అవకాశమీయరాదా ?
స్వామీ ఆమెను చూసినావా ? ఆమె
నిలువెల్లా పులకరింతలతో చెమటలే. మాటిమాటికీ నిట్టూరుస్తున్నది. ఆమె నిన్నెంత
తమకంతో బిగి కౌగిలించిందో చూసితివా? ఆమెను చూచి వేంకటేశ్వరా ! నీవు కరిగిపోయి
ఆమెతో కూడినావు. ఎప్పుడూ ఇలాగే ఉండరాదుటయ్యా..?
No comments:
Post a Comment