Wednesday 17 July 2019

ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయె - అన్నమయ్య కీర్తన


ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయె
వింతలేక ఎపుడూ వినోదించవయ్యా              !!

కన్నుల కొలుకులను కడగి మదరాగం
చన్నుల తుదల రేగి జవ్వనం
నున్నని చెక్కుల వెంట నూలు కొనీని కళలు
పిన్నది నీకే తగు బెండ్లాడవయ్యా                 !!

నెట్తుకొని మొగమున నిండెను చక్కదనము
అట్టే తేనియ లూరి నాకై మోవిని
తెట్టెలై వినయమెల్లా దేరి నిలువునను 
పెట్టెను సొమ్ములు నిండా బెండ్లాడవయ్యా        !!

పిరుదు బటువునను బెనగొని సింగారము
కరకమలమును గైకొనె సేస
ఇరవై శ్రీవేంకటేశ యెదబెట్టితి వీకెను
బెరసితివి నిచ్చలు పెండ్లాడవయ్యా                !!

భావ మాధుర్యం :

ఇది శీనివాసుని పెండ్లి పాట. ఆడపెండ్లివారి ముత్తైదవులు పాడుతున్నారు. వారిలో అన్నమయ్య ఒకరు.

ఓ వేంకటేశ్వరా ! నీవు ఎంత భాగ్యవంతుడివి ! అలమేలు మంగమ్మ నీకు దేవేరి అవుతోంది. ఎటువంటి సందేహాలు లేక ఎప్పుడూ వినోదించవయ్యా.

ఈ పెండ్లికూతురు ఎలా ఉందో చూడవయ్యా ! ఈమె కనుకొలుకులలో గర్వం తొణికిసలాడుతోంది. చనుకొనలు యవ్వన మదము రేపుతున్నాయి.  చెక్కిళ్ళు నవనవలాడుతూ కళలు నింపుకున్నాయి. ఈ చిన్నదాన్ని పెండ్లాడవయ్యా..!

ఈమె వదనములోంచి చక్కదనము తొంగి చూస్తోంది. అధరాలు మధురంగా తేనెలూరుతున్నాయి. వినయము నిలువునా రాసిపోసినట్లుంది. ఒంటినిండా ఆభరణాలు ధరించిన ఈమెను పెండ్లాడవయ్యా !

గుండ్రని నితంబములు ఈమె శృంగారాజ్ఞ్ని అని సూచిస్తున్నాయి. పద్మములవంటి చేతులలో అక్షతలు పట్టుకొన్నది. నీ హృదయనివాసినియై నిత్య పెళ్ళికూతురయినది. ఈమెను పెండ్లాడవయ్యా ..!

No comments:

Post a Comment