Wednesday 17 July 2019

ఎవ్వరెట్టయినా ఉండనీ ఇదివో నేను - అన్నమయ్య కీర్తన


ఎవ్వరెట్టయినా ఉండనీ ఇదివో నేను
నవ్వుతా నీ సేవ సేతు నడుమ నేను.            !!

మనసున నొకమాట మరగున నొకమాట
యెనసి నేనయములు యెరుగ నేను
వనితనై నీ మీద వలపే గతియని
తనివోక బదికేటిదానను నేను.                     !!

వొలసితే నొకటియు నొల్లకుంటె నొకటియు
చలివేడివేసాలు  జరప  నేను
కలికితనాన నేతో కాపురమే గతి యని
తలచి పొందులు సేసే దానను నేను.              !!

నొక్కపరి ఇచ్చకము వొక్కపరి మచ్చరము
ఇక్కడా నక్కడ యెలయించను నేను,
గ్రక్కున శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
మక్కువ నిటు వలనే మరుగుడు నేను.         !!

భావమాథుర్యం..

అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీవేంకటేశుని వలచిన అమ్మ అలమేలుమంగ నిస్వార్ధమైన  వలపు ఎటువంటిదో స్వామికి వివరిస్తున్నారు.

ఎవ్వరెలా అనుకుంటే నాకేమిటయ్యా.. నేను మాత్రం మధ్యలో వచ్చి నువ్వు మనసారా కావాలనుకొన్న చిన్నదాన్నే. నవ్వుతూ నీ సేవలోనే తరిస్తాను.

మనసులో ఒక మాట చాటుమాటగా చెప్పి, పైకి మాత్రం నీతొ కల్లబొల్లి మాటలు చెప్పటం నాకు రాదు. నేను మామూలు వనితనే, నీపై తనివితీరని పొందు కావాలనుకొని బ్రతికేదానను నేను.

ప్రభూ! నేను కావాలనుకొంటే ఒకమాట, వద్దనుకొంటే వేరొకమాట చెప్పి ద్వంద్వ ప్రవృతిలో వేషాలు వేయను. అతివలందరిలాగే నా స్వామివైన నీవే నా పరమావధి  అని నీతో కాపురంచేస్తూ బ్రతుకుతాను.

ఒకసారి ఇష్టం, ఇంకొకసారి అయిష్టం చూపిస్తూ ఇక్కడా అక్కడా యెలయించను నేను. శ్రీ వేంకటేశ్వరా! నీపై నా మక్కువ మరుగున వుంటే ఉండనీ. నాకు మాత్రం సర్వస్వమూ నీవే స్వామీ!

No comments:

Post a Comment