ఈ వారం అనమయ్య కీర్తన..
ఈ కీర్తనలో గోపికల అమాయక మనస్తత్వం అన్నమయ్య ఎంతబాగా వివరించాడో చూడండి.
అంతదొడ్డవారమా అందుకు దగుదుమా
మంతనపుమాటల మరగించేవు ॥
నిన్ను బోలు వారమా నీఅంతవారమా
వెన్నలు జల్లలు నమ్మువెలదులము
పనినఈరత్నాల బంగారుతిండ్లలో
యెన్నకైనతూగుమంచ మెక్కు మనేవు ॥
చెప్పరానివారమా చెమటపై వారమా
కప్పురంపుజని యేరుగనివారమా
చిప్పిలేటితేనెల సేమంతివిరుల
చప్పరములోనికి సారే బిలిచేవు. ॥
జంకెనలవారమా సరసపువారమా
మంకుమంకు మాటల మందవారమా
వెంకటాద్రి విభుడా వేడుకలరాయడా
తెంకికి నెప్పరిగమీదికి రమ్మనేవు. ॥
భావం:
అన్నమయ్య ఈ మధురకీర్తనలో ఒక గోపికవలె భావించుకుని కృష్నయ్యతో నిష్టూరంగా ఏమంటున్నాడో ఆకర్ణించండి. కృష్ట్నయ్యా ! నీ వలపుజల్లులలో తడిసేతంట అదృష్టం మాకు ఉన్నదా? మేము అంత గొప్పవారమా? నీతో మంతనములాడే మాటల చాతుర్యము మాకు గలదా? మేము అందుకు తగినవారమా? మమ్మల్ని మాటలతో మైమరపించుట నీకు తగునా? కృష్ట్నా ! మేము నిన్ను పోలినవారమా? నీ అంతటివారమా? మేము వెన్నలు చల్లలు, అమ్ముకునే వనితలము. రత్నాలు తాపడంచేసిన బంగారపు ఇండ్లలో ఊయల చమునెక్కమని అనేవు. మాకంత అదృష్టం దక్కుతుందా? మాతో నీకు సంబంధం ఉన్నదని చెప్పగలవారమా? చెమటపోవునట్లు పన్నీటి స్నానాలు చేయగలవారమా? కర్పూరం తింటూ రుచినాస్వాదించలేని గొల్లవారము. తేనెల మాధుర్యము తెలియనివారము. చేమంతిపూలు విస్తరించిన పందిట్లోకి రమ్మని మాటిమాటికీ మమ్మల్ని పిలుస్తావు. ఇది బాగున్నదా? కృష్ట్నా మేము నిన్ను బెదిరించగలవారమా? పోనీ సరసములాడగల చతురలమా? పైగా పుష్కలంగా మంకుతనమున్న గొల్లవారము. ఓ వేంకటాద్రినాధుడా! వేడుకలరాయుడా! మమ్మల్ని మిద్దె మీదకు రమ్మనేవు. అది నీ స్థానమని మేమెరుగమా? ఇది నీకు న్యాయమా? (వ్యాఖ్యానం : అమరవాది సుబ్రహమణ్య దీక్షితులు, సేకరణ : పొన్నాడ లక్ష్మి).
No comments:
Post a Comment