ఈ వారం అన్నమయ్య కీర్తన.
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా!
ఊరుకున్న జీవునికి ఒక్కఒక్క స్వతంత్రమిచ్చి
కోరేటి అపరాధాలు కొన్నివేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా
దూరువేసే వింతగా దోషమెవ్వరిదయ్యా?
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి
ఘనముసేసే విందు కర్తలెవరయ్యా?
వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే
కన్న కన్న భ్రమతలే కల్పించి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఏలితివి మిమ్మునిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసు నయ్య!
భావం.. స్వామీ! ఓ వెంకటేశా! నీవు సర్వాత్మకుడవు. నేను నీ శరణు కోరేవాడినై సర్వపరాధాలకు కారణభూతుడైతిని. చాలు చాలయ్యా!
ఊరకే ఉన్న జీవునికి ఎంతో స్వతంత్రమిచ్చి కొన్ని విషయాలు సృష్టించి, అవి చెయ్యకుంటే నరకము, చేస్తే స్వర్గము అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వింతగా నిందిస్తున్నావు. ఇందులో దోషమెవరిదయ్యా?
మనసుతో చూడవలసిన వచ్చినవాటికి మాయలను నీవే కప్పిపుచ్చి, మాకందరికీ ఎన్నో విషయాలు రుచి చూపించి, ఇందులో మంచిచెడ్డలు కనుగొంటే మోక్షమిచ్చి, కానుకోక వాటికి లోబడితే కర్మమునిచ్చి గొప్పగా చేసేనని చెప్తావు. ఇందుకు కర్త ఎవరయ్యా?
ప్రాణులందరూ నీ గర్భములోనే ఉన్నారు, మేమే కన్నామని మాకు భ్రమ కల్పించుతావు. జగత్తునంతా నీవే ఏలుతున్నావు. అంతా నీ చేతిలోనే ఉంది. ఇంక నన్ను నీవు, నిన్ను నేను ఎంచుకుంటే ఎలా? నీకే తెలుసు గదయ్యా..
No comments:
Post a Comment