ఈ వారం అన్నమయ్య కీర్తన :
అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా ॥
వలపుల ఈది ఈది వాసులకే లోగి లోగి
అలుకలే తవ్వి తవ్వి యట్టె నవ్వి
చెలగేటి విరహివి చింత మాన్ప నెరగనా
చెలి నింతే నీకు నేను చెప్పి చూపవలెనా ॥
బలిమై చేయి చాచి చాచి పంతాన మెయి దోచిదోచి
పలుకాక గందికంది భామల బొంది
కులుకుజాణడవు నా కోర్కె తీర్పనెరుగవా
ఇలా నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా ॥
పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్ళీ మళ్ళీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్ళి
తలచి శ్రీవేంకటేశ తగ నన్ను గూడితివీ
వెలయు నీదేవి నింతే వేదుకొనవలెనా ॥
భావం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో, ఆడువారైనా, మగవారైనా అందరికీ ఒక్కటే మాట చాలును అంటారు. ముందటనే ఎత్తుగడగా నిన్ను నొప్పించేటట్లు నాకు మాటాడవలఇన పనియేమి.
ఆడువారికైనా మగవారికైనా ఒక్కటే నీతి కదా స్వామీ ! నీవు వనితల వలపులలో ఈది ఈది, వారి చూపే వాసులకు (ఆధిక్యమునకు) లొంగి లొంగి వారి అలకలు తీర్చి తీర్చి మళ్ళీ మధురంగా వాళ్ల విరహతాపమును నీవే అనుభవిస్తూ వారి చింత బాపుట ఎరుగుదవు. నీకు నేను నెచ్చిలినే కదా స్వామీ ! వేరే నీకు చెప్పవలనా ?
స్వామీ ! బలిష్టమయిన నీ చేయి చాచి చాచి, నా శరీరమును పంతముతో దోచి దోచి, అనేకమైన తాపములతో కంది కంది, అనేకమంది భామలను పొంది పొంది, వారితో కులికే నేర్పరివి. మరి నా కోర్కెలనుకూడా తీర్చనెరుగవా? నేనూ జవ్వనినే. నన్నింత రట్టుచేయవలెనా ?
స్వామీ ! నాపై మాటలు గుప్పించి గుప్పించి, మళ్ళీ మళ్ళీ నన్ను పారి పారి (తడివీ తడివీ) మన్మధుని పనులకు వాహ్యాళికి వెళ్ళి పనిలోపనిగా వేంకటేశా నన్ను కూడితివి. ఇంతాచేసి నేను నీ దేవేరినే కదా స్వామీ. నన్నింత వేడుకోవలెనా?
No comments:
Post a Comment