Friday, 24 April 2015

నేనేమి జేయగలేను నీవు పరిపూర్ణుడవు - అన్నమయ్య కీర్తన



25.4.2015: ఈ వారం అన్నమయ్య కీర్తన:  

ప. నేనేమి జేయగలేను నీవు పరిపూర్ణుడవు
    హీనుడ నే నధికుడ వన్నితానీవు. !!

చ.  దండము బెట్టుట నాది తప్పులో గొనుట నీది.
      నిండి నీవెప్పుడు దయానిధివి గాన,
      అండ జేరుకొంట నాది అందుకు మా కొంట నీది
      దండియైన దేవేదేవోత్తముడవు గాన.

౨.   శరణు  జొచ్చుట నాది సరుగ గాచుట నీది.
      పరమపురుష శ్రీపతివి నీవు,
      విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది
      పోరి నీవు భక్తసులభుడ వటుగాన.

౩.    దాసుడననుట నాది తప్పక ఏలుట నీది
      అసదీర్చే వరదుడ వటుగాన.
       నీ సేవ యొక్కటి నాది నిచ్చలు గైకొంట నీది
       యీసు లేని శ్రీ వేంకటేశుడవు గాన.

భావము:  దేవా! అల్పజీవుడనైన నేనింత కంటే నేమియు చేయజాలను. నీవు పరిపూర్ణ స్వరూపుడవు. నేను ఎట్టి శక్తియు లేని అల్పుడను. నీవు అన్నిటా అధికుడివి.

నీకు దండము పెట్టుట నా పని. నా తప్పులు సైరించి నన్ను మన్నించుట నీ పని. ఏలననగా నీవు ఎల్లప్పుడూ దయానిధివి కదా. నీ అండ చేరుకొనుట నా పని. నా పిలుపు విని నా కోరికలు తీర్చుట నీ పని. ఏలన నీవు దండియైన దేవాదిదేవుడవు కదా.

నిన్ను శరణు జొచ్చుట నా వంతు. నన్ను రక్షించుట నీ వంతు. ఎందుకన, ఓ పరమపురుషా! శరణాగతులను రక్షించమని పురిగోలిపే లక్ష్మీ దేవికి పతివి కదా.. పూలతో పూజించుట నా వంతు. సకలసంపదలొసగుట నీ వంతు. ఎందుకన నీవు భక్తజనులకు సులభుడవు కదా..

నేను నీ దాసుడననుట నా కర్తవ్యము. నన్ను దయచూచి కాపాడుట నీ కర్తవ్యము.  ఏలన నీవు దాసజనుల ఆశలు దీర్చు వరదుడవు కదా! ఈ రీతిగా నిన్ను సేవించుట ఒక్కటే నా పని. నా సేవల నెల్లవేళలా అంగీకరించుటే నీ పని. ఎందుకన నీవు యీసు లేని శ్రీ వేంకటేశ్వరుడవు కదా..

జీవుడు అల్పుడు. దేవుడు అధికుడు. జీవుడు దేవుని సేవింపవలెను. దేవుడు జీవుని కరుణింప వలెను. జీవునికి దేవునికి గల ఈ సంబంధమునే ఈ కీర్తనలో అన్నమయ్య విశదీకరించాడు.

-- పొన్నాడ లక్ష్మి 

No comments:

Post a Comment