Saturday, 18 April 2015

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగా నాంచారమ్మా: - అన్నమయ్య కీర్తన




అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగా నాంచారమ్మా:

భావం:ఈ కీర్తనలో  అన్నమయ్య అమ్మవారిమీద చిరుకోపం ప్రదర్శిస్తున్నాడు.
విరహం తొ నున్న స్వామిపై నీకెందుకమ్మా ఇంత అలక?నీ అలకలు తీర్చటం కోసం, నిన్ను సంతోషపెట్టడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తి ఎన్నొఎన్నొ బాధలు పడ్డాడు.  ఇకనైనా అలుక చాలించి స్వామిని దరికి చేర్చుకోమంటాడు. ఇంతటి చనువు అధికారం అన్నమయ్యకే సొంతం. 

ప. అమ్మా! అలమేల్మంగమ్మా! ఏమిటమ్మా ఇది? పద్మాసనివై ప్రకాసించే తల్లివి, విభుని ప్రానసఖివి ఇలా చేయతగునా?

చ. నువ్వు నీటిలో ఉన్నావని తెలిసి నీటిలో తల్లడిల్లుతూ కలయతిరిగాడు (మత్స్యావతారం) నీవు నివాసమున్నపద్మము కింద ఉన్ననీటిలో నుండి పులకరించిపోయాడు నీ రమణుడు. (కూర్మావతారం). నీపై గల విరహంతో గోళ్ళు కూడా చెమరించి కంపిస్తున్నాయి. (వరాహావతారం). ఎడతెగని నీ అలుకలు చూసి విభుడు కోపం వ్యక్తపరుస్తున్నాడు.(నరసింహావతారం). అమ్మా!నీ అలుకలు చాలించవమ్మా!

౨. నీకోసం ప్రేమగా చెయ్యి చాచి శరీరాన్ని పెద్దది చేసాడు (వామనావతారం). నీవు అలుకతో ఆ చెయ్యిని అందుకోలేదు. అందుకు కోపగించి రెచ్చిపోయాడు. (పరశురామావతారం). నీపై విరహంతో నీకోసం అడవులంట తిరిగి బాధలు అనుభవించాడు.(రామావతారం). ఇక్కడా అక్కడా సతుల హృదయాలని కలవరపెట్టాడు. (కృష్ణావతారం). ఇకనైనా నీ అలుక మాని అతనికి ఆకు మడిచి (తాంబూలం)ఇయ్యమ్మా!( తాంబూలం వరకూ వచ్చిందంటే సంధి కుదిరినట్లే.)..

౩. చక్కదనములను పెంపొందించుకొని, సర్వమూ తానె అయి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి నీకోసం వేచి ఉన్నాడు. అమ్మా! అలమేల్మంగమ్మా! ఇకనైనా  మక్కువతో స్వామిని అక్కున చేర్చుకొని ఇట్టె అలరించవమ్మా .

(పొన్నాడ లక్ష్మి)

No comments:

Post a Comment