Wednesday, 4 March 2015

అందుకే పో నీపై నాశ పుట్టి కొలిచేది



ప. అందుకే పో నీపై నాశ పుట్టి కొలిచేది మందలించితి నిక మరి నీ చిత్తము
౧. ఇందరు జెప్పగా వింటి ఎవ్వరికైనా విష్ణుడే కందువ మోక్షమియ్య గర్త యనగా
    ముందే వింటి నారదుడు ముంచి నిన్ను బాడగా పొందుగా లోకములోన పూజ్యుడాయెను. !!
౨. అప్పటి వింటి లోకములన్నిటికి హరియే - కప్పి రక్షకత్వానకు గర్త యనగా
     ఇప్పుడే వింటి ధ్రువుడు ఇటు నిన్ను నుతించే - ఉప్పతిల్లి పట్టమేలుచున్నా దనుచును.    !!
౩.  ఇదే వింటి శ్రీ వేంకటేశ బ్రహ్మకు దండ్రివై - కదిసి పుట్టించ బెంచ గర్త వనుచు,
     వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి చెదర కాద్యులలో బ్రసిద్దుడాయ ననుచు.     !!
భావము:
          దేవా! నిన్ను కొలిచినవారికి శ్రేయస్సు కలిగించెదవని విన్నాను. అందుకే నీపై ఆశ పుట్టి నిన్ను సేవించుచున్నాను. నీకు మనవి చేసికొనుచున్నాను.ఆపై నీ చిత్తము, నా భాగ్యము.
          ఎవ్వరికైనా మోక్షమిచ్చే కర్త విష్ణుడే అని ఎందరో చెప్పగా వింటిని. నారదుడు భక్తితో నిన్ను కీర్తించగా లోకములో పూజ్యుదయ్యేనని ముందే వింటిని.
          లోకములన్నిటికీ రక్షణ కలిపించేవాడు హరియే అని అప్పుడే వింటిని. ధ్రువుడు నిన్ను స్తుతిం చియే మహోన్నతుడై శాశ్వతమైన పట్టమును ఏలుచున్నాడని ఇప్పుడే వింటిని.
          శ్రీ వేంకటేశ్వరా! నీవు సృష్టి కర్తవై బ్రహ్మకు తండ్రివై లోకములను పుట్టించి, పోషించుటకు ముఖ్య కర్తవుగా ఉన్నావని ఇదిగో వింటిని. అంతే కాదు వాల్మీకి మహర్షి నీ మీద కావ్యము చెప్పి ఆది మునీంద్రులలో ప్రసిద్దుడాయేనని   కూడా వింటిని. ఇంక నీవే నాకు దిక్కు.

No comments:

Post a Comment