Friday, 26 September 2014

దేహము సంబంధము ఇవి దేహికి బని లేదు – ఊహించ నేర్చినవారలే ఓరుచుకుందురయ్యా!

27.9.14. ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. దేహము సంబంధము ఇవి దేహికి బని లేదు – ఊహించ నేర్చినవారలే ఓరుచుకుందురయ్యా!
౧.  విడువవు శీతోష్ణంబులు, విడువవు సుఖదుఖంబులు – వెడవెడ మరణ భయంబులు విడిచిన యందాకా    
     ఉడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు -  పొడవగు విరక్తి తనలో బొడమిన యందాకా.
౨.   మానదు చిత్తవికారము, మానదు దుర్గుణ దోషము – మానదు భోగములన్నియు మానిన యందాకా,
      పోనీదు సేసిన దురితము, పోనీదు వ్రాత ఫలంబును – పూనిన తన యజ్ఞానము పోయిన యందాకా.
౩.     తెగవటు భవబంధంబులు తెగవెడయని గర్వంబులు – నిగిడిన యీయాత్మజ్ఞానము నీవిచ్చిన యందాకా .
        జగదేకవిభుడ శ్రీ వేంకటేశ్వర సర్వము నీ యానతికొలదే – తగులుచుండు నివి నిశ్చలముగ నీ దాస్యము
                                                                       కలిగిన యందాకా!
భావం:
          అన్ని విషయాలు దేహానికి మాత్రమె సంబధించినవి. ఆత్మకు వీటితో పని లేదు. పరిశీలింపగా దేహముయోక్కయు, దేహి(ఆత్మ) యొక్కయు స్వరూపమును చక్కగా నెరింగిన అత్మజులు మాత్రమె వీటిని అర్ధం చేసికొనగలరు.
          మరణ భయములు విడుచునంత వరకు శీతోష్ణములు, సుఖదఃఖములు మున్నగునవి ప్రాణిని విడువవు. పూర్తి వైరాగ్యము కలుగునంతవరకు కోరికలు, మమకారములు, అవి తీర్చుకొనుటకై చేసే ప్రయత్నములు, అవి విఫలమైనపుడు చింతలు తప్పవు.
          భోగములన్నియు వదులు కోనేవరకు మనోవికారము, దుర్గుణముల వలన కలుగు దోషములు తొలగవు. తన్నావహించిన అజ్ఞానము నసించువరకుచేసిన పాపము, నొసటి వ్రాతయొక్క ఫలము విడువవు.

                జగదేకవిభుడవైన శ్రీ వేంకటేశ్వరా! ఆత్మజ్ఞానమును నీవు ప్రసాదించువరకు ఈ సంసార బంధములు, ఎడతెగని గర్వములు తెగవు. అంతయు నీ ఆజ్ఞ ననుసరించియే జరుగుచున్నది. నిశ్చలమైన నీ దాస్యము చేకూరునంత వరకు పైన చెప్పిన బాధలన్నియు ప్రాణులను వెన్నంటియే యుండును. 

No comments:

Post a Comment