Friday, 5 September 2014

ఇందిరారమణు దెచ్చి ఇయ్యరో మాకిటువలె - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన: ఇందిరా రమణు దెచ్చి.... 6.9.14
అన్నమయ్య దేవతార్చన విగ్రహాలు ఎవరో దాచివేసినారు. అన్నమయ్య హృదయం పరితాపమునకు గురి అయి పరమాత్ముడితో ఎవరెవరికైతే అనుబంధం ఉన్నదో వారందరినీ పేరుపేరుతో పిలిచి స్వామిని తెచ్చి తనకీయమని వేడుకొంటున్నాడు.
ప. ఇందిరారమణు దెచ్చి ఇయ్యరో మాకిటువలె – పొంది ఇతని పూజించ పోత్తాయే నిపుడు !!
౧. ధారుణి మైరావణు దండించి రాము దెచ్చి నేరుపున మించిన అంజనీతనయా !
ఘోర నాగాపాశముల గొట్టివేసి ఈతని కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా ! !!
౨. నానాదేవతలకు నరసింహు గంభములో పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా !
మానవుడై కృష్ణ మహిమల విశ్వరూపు బూని బండి నుంచుకొన్న పోటుబంట యర్జునా! !!
౩. శ్రీ వల్లభునకు నశేష కైంకర్యముల శ్రీ వెంకాద్రివైన శేషమూరితీ !
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా ఈ దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే ! !!
భావం:
ఇందిరా రమణుని తెచ్చి మాకియ్యండి. ఈతని మనసారా పూజించే వేళయింది.
మైరావణుని జయించి రాముణ్ణి నేర్పుతో తెచ్చిన ఆంజనేయా, ఘోరమైన నాగపాశములతో బంధింపబడిన శ్రీరాముణ్ణి తన బలముతో నాగ పాశములను విడగొట్టి, ఆ రాముడి కరుణను పొందినట్టి గరుత్మంతుడా!
దేవతలందరికీ కంభములో వెలసినట్టి నరసింహ స్వామిని చూపినట్టి ప్రహ్లాదుడా, మానవుడవై జన్మించి అపురూపమైన విశ్వరూపమును దర్శించి తరించినట్టి అర్జునుడా!
శ్రీవల్లభునకు విశేషంగా కైంకర్యములను సమర్పించి సేవించుటకు శ్రీ వేంకటాద్రివైన ఆదిశేషువా, నీ సేవలతో స్వామిని కైవసము చేసుకొన్నట్టి కార్తవీర్యార్జునుడా! మీలో ఎవరి దగ్గిర స్వామి ఉన్నా మాకు ఇట్టే తెచ్చి ఇవ్వండి.

No comments:

Post a Comment