Friday, 31 October 2014

నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు

ఈ వారం అన్నమయ్య కీర్తన (01.11.2014)

ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

భావం :

        శ్రీ వేంకటేశ్వరుడు నిత్యస్వరూపుడై ఉండి నిత్యుడై ప్రకాశిస్తున్నాడు. సత్య స్వరూపుడగుట వలన సత్యుడు అనబడుచున్నాడు. లోకములో అందరికీ పరబ్రహ్మమై వెలుగొందు చున్నాడు.
    
    ఏ దివ్యమూర్తి లోకములనెల్ల పాలించుచున్నాడో, ఏ మూర్తిని బ్రహ్మాది దేవతలెల్ల వెదకుతున్నారో, ఏమూర్తి నిజమైన మోక్షము నియ్యగలడో, ఎవడు లోకమునకు హితము గూర్చు వాడో, ఎవడు నిజమైన మూర్తిగా (నిరాకారుడు) ఉండేవాడో, ఎవడు త్రిమూర్తులు ఏకమైన మూర్తిగా నున్నాడో, ఎవడు సర్వాత్ముడో, ఎవడు పరమాత్ముడో ఆ దివ్యమూర్తియే శ్రీ వేంకటగిరి నాధుడు.

        ఏ దేవుని శరీరమున ఇన్నియు పుట్టినవో, ఎవని శరీరమున ఇవన్నియు లయమగుచున్నవో, ఈ సృష్టి అంతయూ ఎవ్వని శరీరమో, సూర్యచంద్రులు ఎవ్వని నేత్రములో, ఎవడు ఈ సర్వజీవులలో అంతరాత్ముడై యున్నాడో, ఎవ్వని చైతన్య మీచేతనములకెల్లా నాధారమో,  ఏ దేవుడు అవ్యక్తుడో, ఎవడు అద్వితీయుడో, ఆ ఉచ్చ్వాస దేవుడే ఈ వేంకటాచల నాధుడు.


        భూమి, ఆకాశము ఏ వేల్పు పాదయుగ్మమో, ఎవని పాదములు తుదియు, అంతము లేనివో, ఈ మహావాయువు ఏ వేల్పు నిస్వాసమో, ఈ పుణ్యాత్ములు ఎవ్వనికి నిక్కమైన దాసులో, ఎవడు సర్వేశ్వరుడో, ఎవడు పరమేశ్వరుడో, ఎవడు ప్రపంచమంతటికీ  హితమనోభావకుడో, ఎవ్వడు మిక్కిలి సూక్ష్మమైనవాడో, ఎవ్వడు మిక్కిలి స్థూలమైనవాడో ఆ దేవుడే శ్రీ వేంకటేశ్వరుడు.

-- పొన్నాడ లక్ష్మి 

No comments:

Post a Comment